ఆర్టీసీ బస్సుకు విద్యుదాఘాతం.. మహిళ మృతి

1 Jul, 2021 07:48 IST|Sakshi
ప్రమాదానికి గురైన బస్సు

కల్వకుర్తి టౌన్‌: ఆర్టీసీ బస్సు విద్యుదాఘాతానికి గురవడంతో ఓ మహిళ మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌ సహా 24 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓ మేస్త్రీ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కల్వకుర్తి బస్టాండ్‌లో ప్రయాణికులను ఎక్కించుకుని అచ్చంపేటకు బయల్దేరింది. పట్టణంలోని హనుమాన్‌నగర్‌ కాలనీలో మురుగుకాల్వ నిర్మాణం చేపడుతుండటంతో బస్సును డ్రైవర్‌ వెంకటయ్య ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద డైవర్షన్‌ తీసుకున్నాడు. అయితే అక్కడ కిందకు వేలాడుతున్న విద్యుత్‌ తీగను గమనించక ముం దుకు వెళ్లాడు. దీంతో బస్సు టాప్‌పై ఉండే క్యారియర్‌కు తీగ తగిలి ఎర్తింగ్‌ రావడంతో ప్రయాణికులంతా హాహాకారాలు చేశారు.

అక్కడే పనిచేస్తున్న తాపీమేస్త్రీ శ్రీశైలం పరిస్థితిని గమనించి వెంటనే తాను పని చేసే స్థలం వద్ద ఉన్న పెద్ద కర్రను తీసుకొచ్చి విద్యుత్‌ తీగను పక్కకు నెట్టాడు. ప్రమాద తీవ్రతను పసిగట్టిన డ్రైవర్‌.. ఎవరూ బస్సు దిగవద్దని, కిందకు దిగితే ఎర్తింగ్‌ వల్ల కరెంట్‌ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అప్పటికే ప్రాణభయంతో డోరు వద్ద ఉన్న వంగూరు మండలం రంగాపూర్‌కు చెందిన నర్సమ్మ (50) తన ఇంటికి అవసరమైన ఇనుప వెంటిలేటర్లను తీసుకుని, బస్సులోని ఐరన్‌ రాడ్డు సహాయంతో కిందకు  దిగిన వెంటనే విద్యుదాఘాతానికి గురై ఆమె మృతి చెందింది. మరో ప్రయాణికుడు వృద్ధుడైన రెడ్యా భయంతో కిటికిలోంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

బస్సు దగ్ధమయ్యేది.. 
బస్సుకు విద్యుత్‌ తీగలు తగల డం గమనించాను. వెంటనే పెద్దకర్రను తీసుకుని పక్కకు జరిపి బస్సును ముందుకు వెళ్లనివ్వమని డ్రైవర్‌కు చెప్పాను. అప్పటికే బస్సుకు ఎర్తింగ్‌ ఉండటం, 11కేవీ విద్యుత్‌ లైన్‌ కావటంతో పూర్తిగా దగ్ధమై ఉండేది. ఈ ప్రమాదం గురించి తలుచుకుంటేనే భయమేస్తుంది.  
– శ్రీశైలం, ప్రమాదం నుంచి కాపాడిన వ్యక్తి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు