Hyderabad: ప్రకటనలకేనా బస్‌ షెల్టర్లు? ప్రయాణికులు తలదాచుకోవడానికి కాదా!

12 Jul, 2022 08:19 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఒకవైపు వరుస వర్షాలు.. మరోవైపు బస్సుల కోసం నిరీక్షిస్తూ తలదాచుకుందామంటే ఉన్న బస్‌షెల్టర్లు ప్రయాణికులకు రక్షణనివ్వడం లేదు. ఎండాకాలంలో మండుటెండల్లో నీడనివ్వగలిగేవి వీటిలో కొన్ని మాత్రమే. ఇక ఏసీ బస్‌షెల్టర్లన్నది ప్రచారార్భాటంగా మిగిలింది. అటు ఆర్టీసీ.. ఇటు జీహెచ్‌ఎంసీ బస్‌ షెల్టర్లను ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నాయి? ఎవరి కోసం ఏర్పాటు చేస్తున్నాయి? అంటే.. కేవలం వాటిని ఏర్పాటు చేసే ఏజెన్సీలకు ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చేందుకేనని చెప్పక తప్పదు.  

అలంకారప్రాయంగా.. 
జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 1200 బస్‌ షెల్టర్లున్నాయి. వివిధ ఏజెన్సీలు వాటిని ఏర్పాటు చేశాయి. ఒప్పందం మేరకైతే ప్రజలకు సదుపాయంగా ఉండాలి.  కానీ.. అవి అలా ఉన్నాయా.. లేదా అన్నది అందుకు స్థలాలు కేటాయించిన జీహెచ్‌ఎంసీ గాని.. ప్రజలకు సదుపాయంగా ఉంచాల్సిన ఆర్టీసీ గాని  పట్టించుకోలేదు. దీంతో బస్‌షెల్టర్లు ప్రజావసరాలకు కాకుండా అలంకారప్రాయంగా మారాయి. బస్సుల కోసం ప్రజలెక్కువగా ఎదురు చూసే ప్రాంతాల్లో  బస్‌ షెల్టర్లుండవు.   

ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా ఉన్న బస్సు షెల్టర్లు.. వాటి స్థితిగతులు.. ప్రజలకుపయోపడుతున్న తీరు వంటివి తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగాలు ఆపనిచేయలేదు. పైపెచ్చు కొత్తగా మరో 78 బస్‌షెల్టర్లు మూడునెలల్లో ఏర్పాటు చేసేందుకు  ఇప్పటికే పలు బస్‌షెల్టర్లను ప్రకటనల ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాయి.  

పేరుకు మాత్రం సకల సదుపాయాలతో ఏర్పాటు చేయాల్సిందిగా నిబంధనల్లో  పొందుపరుస్తున్నప్పటికీ, ఆ తర్వాత పట్టించుకోవడం లేరు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) కింద బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ (బీఓటీ) పద్ధతిలో   ఏర్పాటుకు అనుమతించారు.  అందంగా, ప్రయాణికుల.. పర్యావరణహితంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నప్పటికీ, ఏమేరకు వాస్తవ రూపం దాలుస్తాయో వేచి చూడాల్సిందే.  

ఈ ప్రాంతాల్లో ఏర్పాటు..  
బస్‌షెల్టర్లు ఏర్పాటు కానున్న ప్రాంతాల్లో  రాజేంద్రనగర్‌ ఆర్చి (ఏజీ యూనివర్సిటీ), çపురానాపూల్‌ గాంధీ విగ్రహం, చౌమహల్లా ప్యాలెస్‌ ఎదుట, జియాగూడ, వివేకానందనగర్, ఉప్పల్‌ క్రాస్‌రోడ్స్, హయత్‌నగర్‌(కెప్టెన్‌కుక్‌ ఎదుట), బైరామల్‌గూడ, పనామా క్రాస్‌రోడ్స్, విక్టోరియా మెమోరియల్‌–సరూర్‌నగర్, కామినేని హాస్పిటల్, హెచ్‌బీకాలనీ, కొత్తపేట ప్రభుత్వ పాఠశాల, నాగోల్‌ క్రాస్‌రోడ్స్, నాగార్జునసాగర్‌ రింగ్‌రోడ్‌(ఒవైసీ ఆస్పతి వైపు), నందనవనం భూపేశ్‌నగర్‌ , తాళ్లూరి థియేటర్‌ కమాన్,  ఓయూ క్యాంపస్, పద్మారావునగర్‌ ఎస్‌పీ కాలేజ్, సెయింట్‌ ఆన్స్‌ స్కూల్, చిలకలగూడ (ఉప్పల్‌వైపు) తదితరమైనవి ఉన్నాయి.  

నిబంధనల మేరకు.. 
జీపీఎస్‌ ద్వారా ఆర్టీసీ బస్సులు బస్‌షెల్టర్లకు చేరుకోనున్న  రియల్‌టైమ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 
బస్సుల నంబర్లు, రూట్‌మ్యాప్‌ వంటి వివరాలు సైతం ఉంచాలి. 
రాత్రి వేళల్లో విద్యుత్‌ ఉండాలి. షెల్టర్లలోని బెంచీలు బలంగా, ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా ఉండాలి. 
మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్, డస్ట్‌బిన్‌ వంటివి ఉండాలి. 
వీటి అంచనా వ్యయం దాదాపు రూ.1.09 కోట్లు.

మరిన్ని వార్తలు