ఒక్క క్లిక్‌తో ఈజీగా బస్సు జాడ

14 Jan, 2023 02:10 IST|Sakshi

ప్రయాణికుల మొబైల్‌ ఫోన్లకు ట్రాకింగ్‌ లింక్‌

మొదట 1,800 రిజర్వేషన్‌ బస్సులకు అనుసంధానం  

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు బయలుదేరే ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. తాము బయలుదేరి వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో మొబైల్‌ ఫోన్‌లో తెలుసుకొనే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ‘టీఎస్‌ ఆర్టీసీ బస్‌ ట్రాకింగ్‌’యాప్‌ను వినియోగంలోకి తెచ్చింది. ప్రయాణికులు గూగుల్‌ ప్లే స్లోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని బస్సు జాడ తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం బుకింగ్‌ చేసుకుంటున్న ప్రయాణికుల ఫోన్లకు టికెట్‌ వివరాలతోపాటు బస్‌ ట్రాకింగ్‌ లింక్‌ను కూడా అధికారులు ఎస్సెమ్మెస్‌ రూపంలో పంపిస్తున్నారు. ఆ లింక్‌పై క్లిక్‌ చేయగానే బస్సు ఎక్కడుందో ప్రయాణికులు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ట్రాకింగ్‌ యాప్‌ వివరాల ఆధారంగా బస్సు వచ్చే సమయాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చు.

‘‘ప్రస్తుతం ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే 1,800 బస్సు సర్వీస్‌లకు ఈ ట్రాకింగ్‌ సదుపాయం కల్పించాం. సంక్రాంతి సందర్భంగా రిజర్వేషన్‌ సౌకర్యం ఉన్న 600 ప్రత్యేక బస్సులకు కూడా ట్రాకింగ్‌ సౌకర్యాన్ని అనుసంధానం చేశాం. త్వరలో హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్‌ప్రెస్‌లుసహా మిగిలిన సర్వీస్‌లకు ట్రాకింగ్‌ సదుపాయం కల్పిస్తాం. ఒక్క క్లిక్‌తో బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు’’అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. 

యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి ఇలా..
►గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి, టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
►ఈ యాప్‌లో ప్రయాణికులు వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. 
►హైదరాబాద్‌ నగరంతోపాటు జిల్లా సర్వీస్‌లకు సంబంధించిన సమాచారాన్ని వేర్వేరుగా పొందుపర్చారు.
►ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించే బస్సుల వివరాలతోపాటు అవి ప్రస్తుతమున్న లొకేషన్‌ను తెలుసుకోవచ్చు.
►ప్రయాణికులు సమీపంలోని బస్టాప్, సర్వీస్, బస్సు నంబర్‌లను ఎంటర్‌ చేసి వివరాలను పొందవచ్చు. 
►అత్యవసర పరిస్థితులు తలెత్తితే రిపోర్ట్‌ చేసే సదుపాయాన్ని ఈ యాప్‌లో కల్పించారు.
►బస్సు బ్రేక్‌డౌన్, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం తదితర వివరాలను ఈ యాప్‌ ద్వారా ప్రయాణికులు రిపోర్టు చేయొచ్చు. ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. 

మరిన్ని వార్తలు