ఇక్కడ తగ్గించి.. ఏపీకి మళ్లించి!

17 Nov, 2020 09:19 IST|Sakshi

కొత్త ఒప్పందంతో ఆంధ్రాకు పెరిగిన సర్వీసుల సంఖ్య

చాలినన్ని లేక స్థానిక పట్టణాలకు ట్రిప్పుల కుదింపు

కొత్త బస్సులు కొనేవరకు ఇదే పరిస్థితి

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ సర్వీసులు నడపాల్సిరావడంతో చాలినన్ని బస్సులు లేక హైదరాబాద్‌ నుంచి ఇతర పట్టణాలకు నడిచే ట్రిప్పులను తగ్గించి వాటిని సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏపీతో ఇటీవల అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం ఖరారు కావటంతో, లాక్‌డౌన్‌ సమయం నుంచి 7 నెలలపాటు నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. ఇంతకాలం తెలంగాణతో పోలిస్తే ఏపీఎస్‌ఆర్టీసీ 1.03 లక్షల కి.మీ. మేర ఎక్కువగా రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిప్పుతోంది. అంతమేర ట్రిప్పుల్లో కోత విధించుకోవాలని, అప్పటి వరకు ఒప్పందం చేసుకోబోమని తెలంగాణ తేల్చిచెప్పడంతో ఏపీఎస్‌ఆర్టీసీ అంతమేర తగ్గించుకుంది. ఈ ఒప్పం దంలో భాగంగా టీఎస్‌ఆర్టీసీ ఏపీకి 826 బస్సు లు తిప్పాల్సి వస్తోంది. 

ఇది అంతకుముందు కంటే దాదాపు 85 బస్సులు ఎక్కువ. ఇప్పుడు ఈ పెరిగిన సంఖ్యకు తగ్గట్టుగా ఆర్టీసీ వద్ద అదనపు బస్సుల్లేవు. ఇప్పటికే ఏపీకి నడుస్తున్న బస్సుల్లో 30% పాతవే. వీటి స్థానంలో కొత్తవి తీసుకోవాల్సి ఉంది. కొత్తవి కొనేందుకు డబ్బు లేక అలాగే నడుపుతున్నారు. ఈ తరుణంలో అదనంగా 85 బస్సులు తిప్పాల్సి రావడం ఆర్టీసీకి ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. గత్యంతరం లేని పరిస్థితిలో హైదరాబాద్‌ నుంచి తెలంగాణలోని ఇతర పట్టణాలకు తిరిగే సర్వీసులకు సంబంధించి కొన్ని ట్రిప్పులను తగ్గించి ఆ బస్సులను ఏపీకి తిప్పాలని నిర్ణయించారు.  హైదరాబాద్‌ నుంచి కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్, హన్మకొండ.. ఇలా ఎక్కువ ట్రిప్పులున్న మార్గాల్లోంచి కొన్నింటిని తగ్గించనున్నారు. ఆయా మార్గాల్లో ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఏయే ట్రిప్పులు తగ్గించాలో తేల్చారు. (చదవండి: ఆర్టీసీపై ‘పోలవరం’ భారం)

ఎక్స్‌ప్రెస్‌లే ఎక్కువ..
కొత్త ఒప్పందం ప్రకారం.. హైదరాబాద్‌–విజయవాడ మార్గంలో 107 బస్సులు కొత్తగా తిప్పాలి. విజయవాడ–ఖమ్మం మార్గంలో కొన్ని పల్లెవెలుగు సర్వీసులు తగ్గించనున్నారు. ఇలా విజయవాడ మార్గంలో వందకు పైగా అదనంగా తిప్పాల్సి రావడం, ఖమ్మం–విజయవాడ మార్గంలో పల్లెవెలుగు బస్సుల సంఖ్య తగ్గించడం వెరసి కొత్తగా 85 బస్సులు అవసరం. విజయవాడ మార్గంలో డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఎక్కువ అవసరమవుతున్నాయి. ఎక్స్‌ప్రెస్‌ల సంఖ్య పెం చాల్సి రావడంతో వివిధ ప్రాంతాల్లో నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌లలోనే కోతపెట్టి మళ్లిస్తున్నా రు. 

ఆరు నెలల తర్వాతే..
కొత్త బస్సులు కావాలంటూ ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదించనుంది. వేయి కొత్త బస్సులు కావాలంటూ గతంలోనే ఓ ప్రతిపాదన సిద్ధం చేసింది. బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు పూచీకత్తు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనుంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చి, రుణం మంజూరై, కొత్త బస్సులు కొని, బస్‌ బాడీ సిద్ధం చేసుకుని నడిపేందుకు ఆరు నెలల సమయం పట్టనుంది. అప్పటి వరకు ఇతర ప్రాంతాల నుంచి తగ్గించిన బస్సులతోనే నెట్టుకురానుంది. 

మరిన్ని వార్తలు