ఏ హైదరాబాద్‌కే పోకుండా.. గీ గోదావరిఖనిల తీసుడు ఎందుకే బావా?

19 Mar, 2023 15:28 IST|Sakshi

గోదావరి లోయలో సినిమా షూటింగ్‌ల సందడి 

పోరాట సన్నివేశాలకు అనుకూలంగా గనుల ప్రాంతం 

ఓపెన్‌ కాస్టుల్లో చిత్రీకరించేందుకు దర్శకుల ఆసక్తి 

‘సలార్, దసరా, ఓదెల రైల్వేస్టేషన్‌’ వంటి సినిమాలతో పెరిగిన డిమాండ్‌ 

గతంలోనూ ఇక్కడ పలు సినిమాల నిర్మాణం 

‘సిన్మా తీయాలంటే ఏ హైదరాబాద్‌కే పోకుండా.. గీ గోదావరిఖనిల తీసుడు ఎందుకే బావా?..’.. ‘ఏతులు గొట్టకుండా సింగిల్‌ లైన్‌లో ఒక్కటి చెప్పన్నారా? గోదావరి ఖనిల సిన్మా తియ్యాల్నంటే 100 దళపతులు, 100 రక్తచరిత్రలు తీయొచ్చు..’ 

.. ఇటీవల గోదావరిఖని నేపథ్యంలో వచ్చింన ‘కొత్త సినిమా’ చిత్రం ట్రైలర్‌లోని సంభాషణలివి.. ఇవి కేవలం సినిమాలో డైలాగులు మాత్రమే కాదు. జరుగుతున్న వాస్తవం కూడా. ఒకప్పుడు కేవలం బొగ్గు  వెలికితీతకు కేంద్రంగా మాత్రమే సింగరేణి పారిశ్రామిక ప్రాంతానికి గుర్తింపు ఉండేది. అడపాదడపా సినిమాల షూటింగులు జరిగినా.. కార్మిక హక్కుల కోసం తీసిన సినిమాల్లో ఒకట్రెండు సన్నివేశాలనే చిత్రీకరించారు.

కాలక్రమంలో పరిస్థితి మారింది. నాలుగేళ్ల కింద గనుల నేపథ్యంలో విడుదలైన ‘కేజీఎఫ్‌’ సినిమా మంచి జనాదరణ దక్కించుకుంది. ఓపెన్‌ మైన్లలో పోరాట సన్నివేశాలు ఆ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. అలాంటి సన్నివేశాలు, పోరాట దృశ్యాలు ఉండాలని కొందరు సినీహీరోలు, దర్శకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గనులకు నిలయమైన గోదావరిఖనికి ఆదరణ పెరిగింది. 

ఎన్నో ప్రత్యేకతలతో.. 
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా) గోదావరి లోయను ఆనుకుని సింగరేణి పారిశ్రామిక ప్రాంతం ఉంది. విశాలమైన గోదావరి నది, దాని లోయను ఆనుకుని ఏర్పడిన సింగరేణి గనులు, ఎన్టీపీసీ, బొగ్గురవాణా కోసం ఏర్పాటైన ప్రత్యేక రైల్వే లైన్లు, రైల్వే బ్రిడ్జీలు, కన్వేయర్‌ బెల్టులు, 40 నుంచి 50 అడుగుల ఎత్తయిన భారీ డంపర్లు, క్రేన్లు ఇలా భారీ యంత్రాలు, హంగామా వంటివి ఇక్కడ కనిపిస్తాయి. 

రెండు రకాల గనులతో.. 
ఇక్కడి గనుల్లో రెండు రకాలు ఉంటాయి. బొగ్గు నిక్షేపాలను గుర్తించిన కొత్తలో ఏటవాలుగా క్రమపద్ధతిలో లోపలికి తవ్వి బొగ్గు తీస్తే అది భూగర్భ మైనింగ్‌. నిల్వలు చివరిదశకు వచ్చాక పేలుళ్లతో మిగతా బొగ్గును వెలికితీసి, భారీ యంత్రాలతో తరలిస్తే ఓపెన్‌కాస్ట్‌ (ఉపరితల మైనింగ్‌). ఇవి వందల మీటర్ల లోతు వరకు ఉంటాయి.

బొగ్గు కోసం నిత్యం జరిపే పేలుళ్లతో బొగ్గు పెళ్లలు వందల అడుగులు పైకెగిరి పడుతూ ఉంటాయి. ఆ బొగ్గును తరలించేందుకు భారీ క్రేన్లు, డంపర్లు ఉంటాయి. బయటి ప్రాంతాల వారికి ఇదంతా కొత్త ప్రపంచం. కేజీఎఫ్‌ సినిమా కూడా ఇలాంటి ఓపెన్‌ కాస్ట్‌ ఇనుప ఖనిజం గనుల్లో తీసిందే కావడం గమనార్హం. 

మెల్లగా పెరుగుతున్నషూటింగ్‌లు..  
భారీ యాక్షన్‌ సినిమాలకు ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో సింగరేణి ఓపెన్‌ కాస్టుల్లో షూటింగులు పెరుగుతున్నాయి. ప్రభాస్‌ నటిస్తున్న ‘సలార్‌’ చిత్రంలోని పలు యాక్షన్‌ సన్నివేశాలను ఇటీవలే సెంటినరీ కాలనీ సమీపంలోని ఓపెన్‌కాస్టుల్లో షూట్‌ చేశారు. నాని నటించిన ‘దసరా’ సినిమా పూర్తిగా గోదావరిఖని పట్టణానికి ఆనుకుని ఉన్న ‘వీర్లపల్లె’ నేపథ్యంగా వచ్చింనదే. ఆ చిత్రాన్ని కూడా ఓపెన్‌కాస్టు గనుల్లోనే చిత్రీకరించారు.

ఇక జాతిరత్నాలు సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు అనుదీప్‌ తొలిచిత్రం ‘పిట్టగోడ’ కూడా గోదావరిఖని నేపథ్యంలో తీసినదే. ఇక ఇటీవల విడుదలైన క్రైం థ్రిల్లర్‌ ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ సినిమాకు కూడా మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ‘సిరోంచ’ పేరుతో తీసిన సినిమాను నేరుగా యూట్యూబ్‌లో విడుదల చేశారు.

ఆ సినిమా నచ్చింనవారు దర్శకుడికి ఇప్పటికీ డబ్బులు పంపుతున్నారు. ఇవే కాకుండా ‘కొత్త సినిమా’ పేరుతో ఒక చిత్రం, మరికొన్ని సినిమాలు ఇక్కడ షూటింగ్‌ జరుపుకొంటున్నాయి. గతంలో ఆర్‌.నారాయణమూర్తి చీకటిసూర్యులు, రానా నటించిన లీడర్‌ వంటి సినిమాల్లోని పలు సీన్లను ఈ ప్రాంతంలోనే చిత్రీకరించారు. 

సినిమా షూటింగ్‌లకు అనుకూలం
గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం సినిమా షూటింగ్‌లకు ఎంతగానో అనుకూలం. సలార్‌ సినిమా షూటింగ్‌ ఓసీపీ–2లో రెండువారాల పాటు సాగింది. భూగర్భగనులు, ఓసీపీలు, ఓబీ ప్రాంతాల్లో షూటింగ్‌లు చేయవచ్చు. సినిమాలతోపాటు టెలిఫిల్‌్మలు, చిన్న సినిమాల చిత్రీకరణ జరుగుతోంది. స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉంది.
– కె.నారాయణ, ఆర్జీ–1 గని జనరల్‌ మేనేజర్‌ 
 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు