పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం

19 Sep, 2021 04:28 IST|Sakshi

కేబినెట్‌ సబ్‌కమిటీ భేటీలో నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ఏళ్లు గా పెండింగ్‌లో ఉన్న పోడుభూముల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పోడుభూముల అంశాలపై సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌కమిటీ శనివారం తొలిసారి భేటీ అయింది. గిరిజన, సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రు లు పువ్వాడ అజయ్‌కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోడు భూముల కింద వచ్చిన దరఖాస్తులు, పరిష్కారమైనవెన్ని, మిగిలిపోయినవెన్ని? తదితర అంశాలపై పక్కా సమాచారాన్ని రూపొందించి నివేదిక ఇవ్వాలని గిరిజన సంక్షేమం, అటవీశాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు. పూర్తి సమాచారంతో ఈనెల 24న మరోసారి సమావేశం నిర్వహించి లోతుగా చర్చించాలని నిర్ణయించారు. సమావేశంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ, పీసీసీఎఫ్‌ శోభ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు