TS: ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీ

8 Jan, 2024 17:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా పాలన దరఖాస్తులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. కేబినెట్‌ సబ్‌కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టిని నియమించారు. కమిటీ సభ్యులుగా శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నియమించారు.

తెలంగాణ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులపై రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు, ప్రజా పాలన నోడల్‌ అధికారులు హాజరయ్యారు. డేటా ఎంట్రీలో తప్పులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌ అధికారులను ఆదేశించారు.  డేటా ఎంట్రీకి ఈ నెల చివరి వరకు సమయం కావాలని అధికారులు కోరారు.

కోటి అయిదు లక్షల దరఖాస్తు
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా పాలన-అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సజావుగా జరిగిందని, సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజా పాలనలో కోటి అయిదు లక్షల అభయహస్తం దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇతర రేషన్ కార్డు, భూములు తదిరల అంశాల నుంచి 20 లక్షలు వచ్చాయన్నారు. డేటా ఎంట్రీ తరువాత కేబినెట్, అలాగే సబ్ కమిటీలో చర్చలు జరిపి విధివిధానాలు అర్హులను ప్రకటిస్తామన్నారు.  అర్హులైన లబ్ధదారులను ఎంపిక చేసి అమలు చేస్తామని చెప్పారు. ఫిజికల్ వెరిఫికేషన్ కూడా జరుగుతుందన్నారు.

కారు కూతలు కూస్తే ఊరుకోం
ఈ నెల 25వ నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని మంత్రి చెప్పారు. ధరఖాస్తు పత్రాలను ఆధార్, రేషన్ లింక్ చేస్తామని తెలిపారు.  ప్రతిపక్ష నేతలు 40 రోజుల్లో హామీలు అమలు చేయడం లేదని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 40 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని తామెక్కడ చెప్పలేదని, వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పామని అన్నారు. ఎవరైనా కారు కూతలు కూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఎవరెన్నీ విమర్శలు చేసినా, మేం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.  వంద రోజుల్లో ఇచ్చిన మాట అమలు చేస్తామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు