తెలంగాణకు వనరుల రూపంలో రూ.1.45 లక్షల కోట్లు.. 150 శాతం అప్పులు..!

27 May, 2021 04:42 IST|Sakshi

ప్రభుత్వ సవరణల బడ్జెట్‌ కన్నా  రూ. 21 వేల కోట్లు తక్కువ 

పెరిగిన అప్పులు, తగ్గిన కేంద్ర పన్నుల వాటా, పన్నేతర ఆదాయం 

 ప్రభుత్వ అంచనాలకు మించి  గత ఏడాది ద్రవ్యలోటు 

మెరుగ్గానే మూలధన వ్యయం...   పన్ను ఆదాయం ఫర్వాలేనట్టే 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి కకావికలం చేసిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బడ్జెట్‌ లెక్కలను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తేల్చింది. 2020–21లో మార్చి 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వనరుల రూపంలో రూ.1,45,599.95 కోట్లు సమకూరినట్లు లెక్కకట్టింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 18న అసెంబ్లీ ముందు ఉంచిన 2020–21 బడ్జెట్‌ సవరణ ప్రతిపాదనల్లో మొత్తం ఆదాయం రూ.1,66,728.91 కోట్లు వస్తుందని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వ అంచనా కంటే రూ. 21వేల కోట్లకు పైగా ఆదాయం తగ్గిందని కాగ్‌ వెల్లడించింది.

ముఖ్యంగా పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నుల్లో వాటాలో తగ్గుదల కారణంగా ప్రభుత్వ అంచనాల్లో కూడా తగ్గుదల కనిపించిందని, ప్రభుత్వం అంచనావేసిన దాంట్లో అప్పులు పెరగ్గా, పన్ను ఆదాయం దాదాపు అదే విధంగా వచ్చిందని తేల్చింది. అయితే, బడ్జెట్‌ ప్రతిపాదనలతో పోలిస్తే రూ. 45 వేల కోట్ల వరకు నష్టం వస్తుందన్న ప్రభుత్వ లెక్కకు కొంచెం అటూఇటుగానే కాగ్‌ లెక్కలు కూడా ఉండటం గమనార్హం.  

150 శాతం అప్పులు.. 
2020–21లో రూ.34 వేల కోట్లకు పైగా రుణాల ద్వారా సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పేర్కొంది. కానీ, కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనివార్యమైన అప్పుల కారణంగా ఈ ప్రతిపాదనలను సవరించి గత ఏడాది మొత్తం రూ. 43,784 కోట్ల అప్పులు అవసరం అవుతాయని అంచనా వేసింది. అయితే వాస్తవ బడ్జెట్‌ ప్రతిపాదనలు, సవరణల బడ్జెట్‌ అంచనాలను మించి 2020–21లో ఏకంగా రూ.45,638.79 కోట్లు అప్పులు చేయాల్సి వచ్చిందని కాగ్‌ తేల్చింది.

అప్పులు పెరగ్గా, రాష్ట్ర ప్రభుత్వానికి పన్నేతర ఆదాయంతో పాటు కేంద్ర పన్నుల్లో వాటాలో బాగా నిధుల రాబడి తగ్గిందని, గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా ఈ లోటు కొంత పూడినా ప్రభుత్వం ఆశించిన మేర ఆదాయం రాలేదని కాగ్‌ లెక్కలు చెబుతున్నాయి. అయితే, పన్ను ఆదాయం విషయంలో మాత్రం ప్రభుత్వం అంచనాలకు, కాగ్‌ గణాంకాలకు పొంతన కుదిరింది. 2020–21కి గాను రూ. 85,300 కోట్ల మేర పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం మొదట అంచనా వేసినా కరోనా దెబ్బకు ఆ మొత్తాన్ని రూ.76,195.65 కోట్లకు సవరించింది. కాగ్‌ లెక్కల ప్రకారం చూస్తే ప్రభుత్వం అంచనాలకు కొంచెం ఎక్కువగా రూ. 79,339.92 కోట్లు పన్ను ఆదాయం రూపంలో రావడం గమనార్హం.  

మూలధన వ్యయం ‘సూపర్‌’ 
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణకు దిక్సూచిగా నిలిచే మూలధన వ్యయం మాత్రం గత ఏడాది బాగా జరిగిందని కాగ్‌ లెక్కగట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సవరణల బడ్జెట్‌ ప్రకారం.. 2020–21లో రూ.10,561.18 కోట్ల మూల ధన వ్యయం జరగాల్సి ఉండగా, 2021, మార్చి 31 నాటికి రూ.16,181.30 కోట్ల వ్యయం జరిగిందని తేల్చింది. అలాగే ద్రవ్యలోటు కూడా కాగ్‌ లెక్కల ప్రకారం ప్రభుత్వ అంచనాలకు మించి ఉంది. ప్రభుత్వం గత ఏడాది రూ.42,399 కోట్ల మేర ద్రవ్యలోటు అంచనా వేయగా, అది రూ.45వేల కోట్లు దాటిందని కాగ్‌ వెల్లడించింది.  

మరిన్ని వార్తలు