జీహెచ్‌ఎంసీకి కాగ్‌ ఆక్షింతలు

27 Mar, 2021 08:41 IST|Sakshi

నిర్లక్ష్యంపై సీరియస్‌

వివిధ శాఖల పనితీరుపై అసంతృప్తి 

నిధుల వృథాపై కస్సుబుస్సు

గ్రేటర్‌ పరిధిలోని పలు ప్రభుత్వ శాఖలు, సంస్థల పనితీరు ఏమాత్రం బాగోలేదని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక పేర్కొంది. వ్యయ నిర్వహణ, సేవల తీరు, ఆర్థిక క్రమశిక్షణ, నిర్లక్ష్యం, నష్టాలకు కారణాలను కూలంకుశంగా పేర్కొన్న కాగ్‌..జలమండలి, ప్రభుత్వ ఆస్పత్రులు, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలను కడిగిపారేసింది. అధికారులు సక్రమంగా వ్యవహరించకపోవడం వల్ల రూ.కోట్ల నష్టాలు మిగిలాయని పేర్కొంది. ప్రజలకుసక్రమమైన సేవలు అందలేదని స్పష్టం చేసింది.  

సాక్షి, సిటీబ్యూరో: నాలాల్లో డీసిల్టింగ్‌ (పూడికతీత)కు సంబంధించి అవకతవకలు జరిగినా అధికారులు కళ్లు మూసుకున్నారని, తత్ఫలితంగా  జీహెచ్‌ఎంసీ నుంచి రూ.53.56 లక్షల మేర అక్రమ చెల్లింపులు జరిగాయని కాగ్‌ నివేదిక కడిగి పారేసింది. 

 • 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్‌ నివేదికలో ఇందుకు సంబంధించిన వివరాలను పొందుపరిచింది. 
 • 2015–17 మధ్యకాలంలో జీహెచ్‌ఎంసీ చేసిన 766 డీసిల్టింగ్‌ పనుల్లో  రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన పనులు 207 ఉన్నాయని,  వాటిల్లో  మచ్చుకు 21 పనుల్ని ఆడిట్‌ తనిఖీ చేయగా అక్రమాలు  వెలుగు చూశాయని తెలిపింది.  
 • మొత్తం తనిఖీ చేస్తే ఇంకెంతమేర అక్రమాలుంటాయోనని అభిప్రాయపడింది. ప్రయాణికుల వాహనాల్లో పూడికను తరలించినట్లు కాంట్రాక్టర్లు పేర్కొన్నా అధికారులు గుర్తించకపోవడం అశ్రద్ధకు పరాకాష్టగా విమర్శించింది. 
 • రవాణాశాఖ వద్ద నమోదైన వాహనాల నెంబర్లతో పోల్చిచూడగా ఈవిషయం వెలుగు చూసింది. అంతేకాదు వివిధ వాహనాలను రవాణాశాఖ అనుమతించిన గరిష్ట బరువు కంటే ఎక్కువ బరువైన పూడికను తరలించేందుకు వినియోగించినట్లు మెజర్‌మెంట్స్‌ రికార్డుల్లో ఉందని పేర్కొంది. 20 పనులకు సంబంధించి 133 వాహనాల ద్వారా 1326 ట్రిప్పుల్లో తరలించిన పూడిక బరువు, సదరు వాహనాలను అనుమతించిన గరిష్ట బరువుకంటే ఎక్కువగా ఉందని తెలిపింది.  

 చెరువుల నిర్వహణపైనా... 

 • నగరంలో చెరువుల్ని నిర్లక్ష్యం చేయడంపై కాగ్‌ తప్పుపట్టింది. ప్రభుత్వం 2014–18 మధ్యకాలంలో చెరువుల కోసం రూ.287.33 కోట్లు కేటాయించినప్పటికీ, కేవలం రూ. 42.14 కోట్లు మాత్రమే ఖర్చుచేసిందని తెలిపింది. 
 • ఈ నిధులతో పరిరక్షణ, సుందరీకరణ పనులకు, వినాయక చవితి సందర్భంగా విగ్రహాల నిమజ్జనాలకు కుంటలు, బతుకమ్మ పండుగ సందర్భంగా ఏర్పాట్లకే ఖర్చు చేసిందని పేర్కొంది. 
 • మిషన్‌ కాకతీయ నాలుగో ఫేజ్‌  కింద  2018–19 మధ్య జీహెచ్‌ఎంసీ పరిధిలోని 19 చెరువుల పునరుద్ధరణ, సమగ్రాభివృద్ధికోసం రూ. 282.63 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చిందని పేర్కొంది. ఈ పనులు చేసేందుకు  చెరువుల్లో నీటి నాణ్యతపై దృష్టి సారించలేదని తప్పుబట్టింది. మిషన్‌ కాకతీయ మార్గదర్శకాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాతిపదికన చెరువుల్ని ఎంపిక చేయడం వల్ల గ్రేటర్‌ పరిధిలోని చెరువుల సహజత్వానికే భంగం వాటిల్లిందని అభిప్రాయపడింది. అంతేకాదు.. గ్రేటర్‌ పరిధిలోని చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్, పరీవాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా సాగుతున్న ఆక్రమణలను అడ్డుకునేవారు లేక చెరువుల ఉనికే ప్రమాదకరంగా మారిందని హెచ్చరించింది. 
 • దుర్గంచెరువు చుట్టూ నిర్మాణాల వల్ల ఎఫ్‌టీఎల్‌ విస్తీర్ణం తగ్గిందని స్పష్టం చేసింది. సైకిల్‌ట్రాక్‌ను తొలగించాలని  లేక్‌ప్రొటెక్షన్‌ కమిటీ ఆదేశించినా అమలు చేయలేదని తప్పుపట్టింది. దుర్గం చెరువు సుందరీకరణను సీఎస్సార్‌ కింద కే.రహేజా ఐటీపార్క్‌కు అప్పజెప్పడం తగని చర్యగా పేర్కొంది. 2016లో నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, 18 చెరువులకు సంబంధించి  నిర్వహించిన సర్వేలో  8 చెరువుల ఎఫ్‌టీఎల్‌లో రోడ్లు, 11 చెరువుల ఎఫ్‌టీఎల్‌లో భవనాలు, 17 చెరువుల బఫర్‌జోన్లలో భవనాలున్నా యని వెల్లడించింది. చెరువులకు సంబంధించి  ఇంకా వివిధ అంశాల్లో  ఆయా ప్రభుత్వశాఖల బాధ్యతారాహిత్యాన్ని కాగ్‌ తప్పుబట్టింది.  

రిజిస్ట్రేషన్ల ఆదాయానికి గండి 

 • గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్వాకాన్ని కాగ్‌ ఎత్తి చూపింది. దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ ఫీజుల వసూళ్లలో చేతివాటంపై అభ్యంతరాలు వ్యక్తం చేసి రెండేళ్లు గడుస్తున్నా సంబంధిత అధికారులు సరైన వివరణ ఇవ్వకపోవడంపై కాగ్‌ తీవ్రంగా తప్పుపట్టింది.  
 • 2017–18 ఆర్థిక సంవత్సరంలో తాకట్టు లావాదేవీలను సాధారణ దస్తావేజుల డిపాజిట్‌గా పరిగణించడంతో రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయానికి భారీగా గండి పడింది. వాస్తవంగా దస్తావేజుల ద్వారా తీసుకున్న రుణాలపై 0.5 శాతం రిజిస్ట్రేషన్‌ రుసుం వసూలు చేయాల్సి ఉండగా హైదరాబాద్‌ (దక్షిణం) డీఆర్, షాద్‌నగర్, కూకట్‌పల్లి, చేవెళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌లు ఒక్కో దస్తావేజుపై రూ.10 వేల చొప్పున మాత్రమే వసూలు చేసి చేతివాటం ప్రదర్శించినట్లు కాగ్‌ వెల్లడించింది. ఫలితంగా సుమారు  రూ.4.44 కోట్ల ఆదాయానికి గండి పడిందని పేర్కొంది. దీనిపై రెండేళ్ల క్రితమే  అభ్యంతరాలు వ్యక్తం చేసినా..ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని కాగ్‌ పేర్కొంది. 
 • రిజిస్టర్‌ అయిన దస్తావేజులపై తక్కువగా సుంకాలు విధించడంతో సుమారు రూ.20 కోట్ల ఆదాయానికి గండి పడిందని హైదరాబాద్‌ సౌత్, మేడ్చల్‌ డీఆర్, బాలానగర్, దూద్‌బౌలి, గోల్కొండ, కాప్రా, కూకట్‌పల్లి, సరూర్‌నగర్, శేరిలింగంపల్లి, షాద్‌నగర్, ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్లపై కాగ్‌ అభియోగాలు మోపింది. అభ్యంతరాలపై lసరైన సమాధానాలు ఇవ్వక పోవడాన్ని తప్పుపట్టింది.  

ఆర్థికంగా బలహీనమే.. 

 • జలమండలి పనితీరుపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ అక్షింతలు వేసింది. తాజాగా శాసనసభకు సమర్పించిన నివేదికలో..వాటర్‌ బోర్డు 2013–17 మధ్యకాలానికి సంబంధించి వార్షిక పద్దులను ప్రభుత్వ ఆమోదం కోసం సమర్పించలేదని ఆక్షేపించింది. ఇక 2010–13 మధ్యకాలానికి సంబంధించిన వార్షిక పద్దులను సమర్పించినా.. ప్రభుత్వం ఆమోదించలేదని స్పష్టం చేసింది. ఇక జలమండలికి జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన రూ.761.96 కోట్ల బకాయిలు రాకపోవడంతో వాటర్‌బోర్డు ఆర్థికంగా బలహీనమైందని పేర్కొంది. 
 • జలమండలి తన పరిధిలో ప్రతి వ్యక్తికీ నిత్యం 150 లీటర్ల నీటిని సరఫరా చేయలేకపోతుందని..వాస్తవంగా సరఫరా చేస్తున్న నీరు 66–71 లీటర్ల మధ్యన ఉందని తెలిపింది.  

‘ఈ– ఆస్పత్రుల’ నిర్వహణలో విఫలం 

 • ‘ఈ– ఆస్పత్రుల’ నిర్వహణకు ఎంపిక చేసిన ఆస్పత్రులు ఘోరంగా విఫలమైనట్లు కాగ్‌ స్పష్టం చేసింది. ఆస్పత్రులకు వచ్చే ఇన్‌పేషంట్లు, అవుట్‌ పేషంట్ల వివరాలను ఎలక్ట్రానిక్‌ రికార్డులో పొందుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈహెచ్‌ఎంఎస్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. పైలెట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా నగరంలోని గాంధీ, కింగ్‌కోఠి, మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రులను ఎంపిక చేసింది. ఇందుకు రూ.10.49 కోట్లు కేటాయించి, ఇందులో రూ.10.20 లక్షలు రెండు విడతల్లో చెల్లించింది. కానీ అధికారులు మాత్రం ఈ పథకం అమలులో పూర్తిగా నిర్లక్ష్యం చూపినట్లు కాగ్‌ పేర్కొంది. 
 • గాంధీ, ఉస్మానియా వైద్య కళాశాలలకు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్‌ యూనిట్లును మంజూరు చేసింది. పరిశోధనల కోసం రెండు ఎంఆర్‌ఐ మిషన్లను అందించింది. అయితే వాటికి అవసరమైన స్థల కేటాయింపు, సిబ్బంది నియామకం, నిర్వహణ అంశాల్లో రెండు కాలేజీలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సహా కీలక వైద్య పరికరాలు రాకుండా పోయినట్లు కాగ్‌ తన నివేదికలో ఎత్తిచూపింది.    
మరిన్ని వార్తలు