long covid: మెదడు మొద్దుబారుతోంది! షాకింగ్‌ స్టడీ

14 Aug, 2021 12:43 IST|Sakshi

1918 నాటి స్పానిష్‌ ఫ్లూ, 2002లో సార్స్, 2012లో మెర్స్‌ కేసుల్లోనూ మానసిక ఆందోళన, డిప్రెషన్‌ సమస్యలు 

భావోద్వేగాలు, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తిలో ఇబ్బందులు 

సమస్యలు, జాగ్రత్తలపై  వైద్యుల సూచనలు 

పరోక్షంగా మెదడుపై ప్రభావం చూపుతున్న కరోనా 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ బారినపడి కోలుకున్నాక కూడా కొందరిలో అనారోగ్య సమస్యలు చాలాకాలం బాధిస్తున్నాయి. లాంగ్‌ కోవిడ్‌ సమస్య ఉత్పన్నమవుతోంది. కరోనాతో తీవ్రంగా జబ్బుపడి, ఐసీయూ, వెంటిలేటర్‌ వరకు వెళ్లిన బాధితులపైనే లాంగ్‌ కోవిడ్‌ ఎక్కువ ప్రభావం ఉన్నట్టు తొలుత భావించినా.. పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కోవిడ్‌ సీరియస్‌గా మారని వారు, చికిత్స కోసం ఆస్పత్రులదాకా వెళ్లాల్సిన అవసరం పడనివారిలోనూ లాంగ్‌ కోవిడ్‌ సమస్యలు కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు.

వయసుతోగానీ, వ్యాధి తీవ్రతతోగానీ సంబంధం లేకుండా ‘బ్రెయిన్‌ ఫాగింగ్‌ (మెదడు మొద్దుబారిపోవడం)’, ఇతర మానసిక సమస్యల బారిన పడుతున్నారని పేర్కొంటున్నారు. ఈ అంశంపై యూకేకు చెందిన ఫ్లోరే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరోసైన్స్, మెంటల్‌ హెల్త్‌ న్యూరాలజిస్ట్, క్లినికల్‌ డైరెక్టర్‌ ట్రేవర్‌ కిల్‌పాట్రిక్, ప్రొఫెసర్‌ స్టీవెన్‌ పెట్రో పరిశోధన చేశారు. ఇన్‌ఫ్లూయెంజా సహా ఊపిరితిత్తులతో ముడిపడిన వైరస్‌లకు.. మెదడు సరిగా పని చేయకపోవడానికి మధ్య లంకె ఉన్నట్టుగా తమ అధ్యయనంలో తేలిందని వివరించారు. 1918 నాటి స్పానిష్‌ ఫ్లూకు సంబంధించి డిమెన్షియా, కాగ్నిటివ్‌ డిక్లైన్‌, నిద్రలేమి సమస్యలు, 2002 నాటి సార్స్, 2012 లో వచ్చిన మెర్స్‌ కేసుల్లో యాంగ్జయిటీ, డిప్రెషన్, చురుకుగా వ్యవహరించడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. సార్స్, మెర్స్‌ నుంచి కోలుకున్నవారిలో 20 శాతం మంది జ్ఞాపకశక్తితో ఇబ్బందులు, అలసట, నీరసం, కుంగుబాటు, ఆం దోళన సమస్యలు ఎదుర్కొన్నారని వివరించారు.  (corona leak: అప్పుడే అనుమానం వచ్చింది! మాట మార్చిన డబ్ల్యుహెచ్‌ఓ సైంటిస్ట్‌)

ముక్కు నుంచి మెదడుకు.. 
కోవిడ్‌ పేషెంట్లలో ముక్కును మెదడుతో కలిపే నరాల ద్వారా వైరస్‌ మెదడుకు చేరుకుంటోందని అంచనా వేసినట్టు పరిశోధకులు తెలిపారు. మెదడులోని ‘లింబిక్‌ సిస్టమ్‌’ను ముక్కులోని సెన్సరీ సెల్స్‌ కలుపుతాయని.. భావోద్వేగాలు, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి వంటి వాటిని లింబిక్‌ సిస్టమ్‌ నిర్వర్తిస్తుందని వివరించారు. కరోనా బారిన పడక ముందు, తర్వాత మెదడుకు సంబంధించిన స్కానింగ్‌లను పరిశీలిస్తే.. లింబిక్‌ సిస్టమ్‌లోని కొన్నిభాగాలు కుంచించుకుపోయినట్టు బయటపడిందని తెలిపారు. మొత్తంగా కొవిడ్‌ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతోందని స్పష్టమైందని వెల్లడించారు. కాగా.. ఈ పరిశోధన, మెదడుపై కరోనా ప్రభావానికి సంబంధించి రాష్ట్రానికి చెందిన సీనియర్‌ న్యూరాలజిస్ట్‌ బి.చంద్రశేఖర్‌రెడ్డి, సైకియాట్రిస్ట్‌ నిశాంత్‌ వేమన తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. (corona virus: పండుగ ఊరేగింపులపై నిషేధం!)

ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతున్నాయి 
లాంగ్‌ కోవిడ్‌ బారినపడ్డవారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఏదైనా విషయాన్ని వెంటనే గుర్తు తెచ్చుకోలేకపోవడం, మర్చిపోవడం, ఆందోళన, కుంగుబాటు వంటివి కనిపిస్తున్నాయి. ఇది ‘బ్రెయిన్‌ ఫాగింగ్‌’కు దారితీసి.. మరిన్ని సమస్యలకు కారణమవుతోంది. నిద్ర సరిగా పట్టకపోవడం, గొంతు కండరాల సమస్య, గురక (ఓఏఎస్‌) వంటివి కూడా వస్తున్నాయి. కరోనా వచి్చనపుడు సరైన పోషకాహారం తీసుకోకపోవడం, దీర్ఘకాలం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడం, బరువు పెరగడం, మానసిక ఆందోళనలకు లోనవడం కారణంగా లాంగ్‌ కోవిడ్‌ సమస్యలు పెరుగుతున్నాయి. నాడీ వ్యవస్థపై కరోనా ప్రభావం తక్కువే అయినా.. కొవిడ్‌ వ్యాక్సిన్‌తో కొందరిలో నరాల పైపొర దెబ్బతిని జీబీ సిండ్రోమ్‌ అనే వ్యాధి వస్తోంది. 90 శాతం మంది లాంగ్‌ కోవిడ్‌ సమస్యల నుంచి 6 నెలలలోగా కోలుకుంటున్నారు. మిగతావారు 9 నెలల నుంచి ఏడాదిలో కోలుకుంటున్నారు. – డాక్టర్‌ బి చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరాలజిస్ట్, చైర్మన్‌ ఏపీ కొవిడ్‌ టెక్నికల్‌  ఎక్స్‌పర్ట్‌ కమిటీ 

లాంగ్‌ కొవిడ్‌ సమస్య పెరిగింది 
కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన వారితోపాటు ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం రానివారు, స్వల్ప లక్షణాలతో కోలుకున్నవారు కూడా లాంగ్‌ కోవిడ్‌ సమస్యతో వైద్యుల వద్దకు వస్తున్నారు. నీరసం, నిస్సత్తువ, అయోమయంగా కనిపించడం, చురుకుదనం లేకపోవడం, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం, యాంగ్జయిటీ, డిప్రెషన్‌కు గురైన వారికి కూడా మేం చికిత్స ఇస్తున్నాం. చాలా మంది త్వరగానే కోలుకుంటున్నారు. వంద మందికి కోవిడ్‌ వస్తే.. అందులో 30 శాతం మంది వివిధ రకాల లాంగ్‌ కోవిడ్‌ సమస్యలతో బాధపడుతున్నారని ఇది వరకే వెల్లడైంది. జూన్‌లో లాంగ్‌ కోవిడ్‌ బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇప్పటికీ బాధితులు వస్తూనే ఉన్నారు. – డాక్టర్‌ నిశాంత్‌ వేమన,  కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్,  సన్‌షైన్‌ ఆస్పత్రి  
 

మరిన్ని వార్తలు