టాయిలెట్‌ ద్వారా కరోనా వ్యాపిస్తుందా?

24 May, 2021 16:18 IST|Sakshi

పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి వాడిన టాయిలెట్‌ వాడితే ప్రమాదమా? 

ఇంట్లో వాళ్లకే కాకుండా చుట్టుపక్కల వారి దాకా వైరస్‌ వెళ్తుందా? 

టాయిలెట్‌ ద్వారా వ్యాపిస్తుందంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ 

అంతగా భయపడాల్సిన అవసరం లేదంటున్న వైద్య నిపుణులు 

వైరస్‌ లోడ్‌ చాలా ఎక్కువగా ఉంటేనే వ్యాప్తి చెందే అవకాశం 

టాయిలెట్‌ ఫ్లష్‌ చేసేముందు మూత వేస్తే వైరస్‌ వ్యాప్తి చాలా తక్కువ 

కరోనా బాధితుల్లో ప్రస్తుతం నీళ్ల విరేచనాలు సర్వ సాధారణంగా కనిపిస్తున్న లక్షణం. బాధితుల విసర్జితాల్లో వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ లేదా జెనెటిక్‌ కోడ్‌ను ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు. మరి ఈ నేపథ్యంలో కరోనా సోకిన వ్యక్తి టాయిలెట్‌ ఫ్లష్‌ను వాడితే పొరుగింటి దాకా ఈ వైరస్‌ వ్యాపిస్తుందా..? అదే టాయిలెట్‌ను వాడటం లేదా అదే ఇంట్లో ఉండటం వల్ల వేరే వారికి కరోనా వైరస్‌ సోకుతుందా..? ఇటీవల సోషల్‌ మీడియాలో దీనిపై తీవ్ర చర్చ జరిగింది. ఇంతకూ ఇందులో నిజమెంత.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

సార్స్‌ విషయంలో ఏం జరిగింది.. 
2003లో సార్స్‌ వైరస్‌ సంక్షోభ సమయంలో హాంకాంగ్‌లోని ఓ 50 అంతస్తుల భవనంలో 342 మందికి వైరస్‌ సోకగా, వారిలో 42 మంది చనిపోయారు. టాయిలెట్‌ ద్వారా వ్యాప్తి చెందడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మార్చి 14, 19న సార్స్‌ సోకిన వ్యక్తి ఆ భవనంలోని మధ్య అంతస్తులోకి వచ్చాడని, అతడు విరేచనాలతో బాధపడుతూ తరచుగా టాయిలెట్స్‌ ఉపయోగించాడని, ఆ తర్వాతే ఆ భవనంలో అనేక మంది సార్స్‌ బారినపడ్డారని వెల్లడైంది. విచిత్రమేంటంటే.. సదరు రోగి వచ్చిన అంతస్తు పైన ఉన్న అంతస్తుల్లోనే అధికంగా కేసులు నమోదయ్యాయి. కింది అంతస్తులో ఉన్న వారిలో చాలా తక్కువ మందికి సోకిందట. టాయిలెట్‌ వాడకమే సార్స్‌ సోకడానికి ప్రధాన కారణం కాకపోయినా.. టాయిలెట్ల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి అంశాన్ని పూర్తిగా కొట్టిపారేసే విషయం కాదని చెబుతున్నారు. 


సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌.. 
టాయిలెట్స్‌ ద్వారా కరోనా వైరస్‌ సులువుగా వ్యాప్తి చెందుతుందని ఇటీవల సోషల్‌ మీడియాలో కొన్ని పోస్టులు తెగ హల్‌చల్‌ చేశాయి. తాజాగా ‘ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌’అనే జర్నల్‌లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. టాయిలెట్‌ ఫ్లష్‌ చేయడం వల్ల అందులోని విసర్జితాలు నీటి తుంపరల రూపంలో బయటకు వచ్చి, ఆ గదిలో వ్యాపిస్తాయి. ఒకవేళ విసర్జితాల్లో వైరస్‌ లోడ్‌ ఉంటే టాయిలెట్‌ సీటుపై దాదాపు 40 నుంచి 60 శాతం వైరస్‌ అవశేషాలు పడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.  

వైరస్‌ లోడ్‌ ఎక్కువగా ఉంటేనే.. 
‘టాయిలెట్‌ బౌల్‌ లోపల పెద్ద సంఖ్యలో వైరస్‌లు తిష్టవేసి ఉండే అవకాశం ఉంది. వైరస్‌ సోకిన వ్యక్తులు వాటిని ఉపయోగిస్తే.. వైరస్‌ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. హోం ఐసోలేషన్‌లో ఉండే వ్యక్తి వాడిన టాయిలెట్‌ వేరే వారు వాడకుండా ఉంటే మంచిది. అయితే పబ్లిక్‌ టాయిలెట్స్‌ విషయంలో ఇది సాధ్యపడదు. చాలా మంది అదే టాయిలెట్‌ను వాడటం ద్వారా వైరస్‌ వ్యాప్తి వేగంగా జరిగే ప్రమాదం ఉంది. అయితే బాత్రూం పైపుల ద్వారా భారీగా కరోనా వైరస్‌ సోకుతుందనడం సరికాదు. ఒకవేళ వైరస్‌ లోడ్‌ చాలా ఎక్కువ మోతాదులో ఉంటే మాత్రమే సోకే అవకాశం ఉంది. అంతేకాదు టాయిలెట్‌ బేసిన్‌ నిర్మాణం కూడా ప్రభావం చూపుతుంది. టాయిలెట్‌ వాడిన తర్వాత ఫ్లష్‌ చేసేటప్పుడు దాని మూత వేసి ఫ్లష్‌ చేస్తే బాత్రూం గోడలు, గదిలో తుంపరలు పడకుండా అడ్డుకోవచ్చు. దీనిద్వారా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఆపొచ్చు.’ 
– డి.మనోజ్‌ కుమార్, జనరల్‌ మెడిసిన్‌   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు