COVID Vaccine: వ్యాక్సిన్‌ వేసుకున్నా కరోనా సోకిందా?

12 Jun, 2021 19:32 IST|Sakshi
ప్రతీకాత్మక చి​త్రం

‘బ్రేక్‌ థ్రూ’ ఇన్‌ఫెక్షన్ల కారణంగా చాలా తక్కువ మందికి సోకే అవకాశం

అయినా భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణుల భరోసా

రెండు డోసులు వేసుకున్నా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని సూచన 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులూ వేసుకున్నాక కూడా ఇన్‌ఫెక్షన్‌ సోకితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఇలా వస్తే టీకాల్లో లోపం వల్లనో.. వేసేటపుడు సరైన పద్ధతులు పాటించకపోవడం వల్లనో ఇలా జరుగుతోందని అనవసర అనుమానాలు, భయాలు పెట్టుకోవద్చని చెబుతున్నారు. ‘బ్రేక్‌ థ్రూ’ఇన్‌ఫెక్షన్ల కారణంగా చాలా తక్కువ సంఖ్యలో వైరస్‌ బారిన పడుతున్నారని, అయితే లక్షణాలు తీవ్రస్థాయికి చేరుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

రాష్ట్ర పోలీసు శాఖలో దాదాపు 75 శాతం పోలీసులకు రెండో డోసు వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా దాదాపు 6 వేల మంది కోవిడ్‌ బారినపడ్డారు. అందులో దాదాపు 30 మంది వరకు మరణించారు. ఈ విషయంలో అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పలువురు వైద్య నిపుణులు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే.. 

టీకా వేసుకున్నా మాస్కు తప్పనిసరి 
వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత కూడా మాస్కులు పెట్టుకోవాలి. ఇతర జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని కాపాడుకోవాలి. అందుకోసం పోషక విలువలున్న సమతుల ఆహారం, మంచినిద్ర, తగిన వ్యాయామం మేలు చేస్తాయి. కొన్ని వైరస్‌లలో ఇమ్యూనిటీని చాకచక్యంతో తప్పించుకునే స్వభావంతో పాటు అదను చూసుకుని దాడిచేసే తత్వం ఉంటుంది. ఇమ్యూన్‌ ఎస్కేప్‌ లేదా వ్యాక్సిన్‌ ఎస్కేప్‌ వేరియెంట్‌ కూడా ప్రస్తుతం కోవిడ్‌ ఉన్నా లేదా గతంలో వచ్చి తగ్గినా ఈ వైరస్‌ శరీరంలోని రోగనిరోధకశక్తి నుంచి తప్పించుకుంటోంది. కరోనా వైరస్‌ కొత్త మ్యుటేషన్లు, స్ట్రెయిన్లు కొత్త మార్గాలు, పద్ధతులు వెతుక్కుని దాడి చేస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. టీకా సమర్థత, సామర్థ్యంతో పాటు వైరస్‌ దాని కంటే పైచేయి సాధించే పరిస్థితుల్లో, రోగ నిరోధకశక్తి సరిగా లేని వారు, మాస్కులు ఇతర జాగ్రత్తలు పాటించకపోతే రెండు డోసులు వేసుకున్నా ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశాలున్నాయి. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల అవయవాలను తీవ్రస్థాయిలో ప్రభావితం చేసే అవకాశాలు తక్కువ. 
– డా.సతీశ్‌ ఘంటా, నియోనేటల్, పీడియాట్రిక్‌ క్రిటికల్‌ కేర్‌ నిపుణులు, లిటిల్‌ స్టార్స్‌ ఆస్పత్రి 

30% మందికి ఇన్‌ఫెక్షన్‌ రావొచ్చు.. 
డబ్ల్యూహెచ్‌వో ప్రకారం రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న 14 రోజుల తర్వాత కూడా దాని సామర్థ్యం 70–80 శాతమే. టీకా తీసుకున్న వారిలో దాదాపు 30 శాతం మందికి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. టీకా తీసుకున్నాక వైరస్‌ సోకినా 95 శాతం మందిలో సీరియస్‌గా మారదు. ప్రస్తుతం వచ్చిన టీకాలన్నీ మోనోవాలెంట్, స్పైక్‌ ప్రోటీన్‌ ఆధారితమైనవే. మోనోవాలెంట్‌ అంటే సింగిల్‌ వైరస్‌ను కేంద్రంగా చేసుకుని చేసినవి. నాలుగైదు వేరియెంట్లను కలిపి తయారు చేస్తారు. స్పైక్‌ ప్రోటీన్లు ఒక్కటే కాకుండా యాంటీబాడీస్‌ చాలా ఉంటాయి. వాటి లక్ష్యంగానూ టీకాలు వాడాల్సి ఉంది. అందుబాటులోకి వచ్చిన టీకాలన్నీ ‘మొదటి తరం’వ్యాక్సిన్లు. ఇవి అత్యవసర వినియోగానికి, మరణాలు తగ్గించే ఉద్దేశంతో తెచ్చినవి మాత్రమే. 
– డా. కిరణ్‌ మాదల, అసోసియేట్‌ ప్రొఫెసర్, నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి,మెడికల్‌ కాలేజి 

జాగ్రత్తగా లేకపోతే ఎవరికైనా సోకొచ్చు 
వ్యాక్సిన్‌ తీసుకున్నాక కోవిడ్‌ రాదని, వైరస్‌ సోకదని అనుకోవద్దు. తప్పనిసరిగా మాస్క్, భౌతికదూరం, ఇతర జాగ్రత్తలన్నీ కచ్చితంగా పాటించాల్సిందే. జాగ్రత్తలు తీసుకోకపోతే టీకా వేసుకున్నా ఇన్‌ఫెక్షన్‌ సోకుతుంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ కారణంగా మరణాలు సంఖ్య తగ్గుతుంది. ఇది వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కాబట్టి మాస్కుల ధరించకపోతే ఎవరికైనా ఇది సోకవచ్చు. ఇప్పటికే టీకాలు తీసుకున్న వారిలో చాలా తక్కువ మందికే సోకుతోందని, ఒకవేళ సోకినా కూడా చాలా తక్కువ మందే ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోందోనని వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అలా కాలేదంటే వివిధ వైరస్‌ వేరియెంట్లు, మ్యుటేషన్లపైనా ఇది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఎలాంటి సందేహాలు లేకుండా అందరూ వ్యాక్సిన్లు వేసుకోవాలి. 
– డా.వీవీ రమణప్రసాద్, కన్సల్టింగ్‌ పల్మనాలజిస్ట్, కిమ్స్‌ ఆస్పత్రి 

ఇవి దృష్టిలో పెట్టుకోవాలి... 
► రెండు డోసులు వేసుకున్నా ఆ వ్యక్తికి వ్యాక్సిన్‌ నుంచి తక్కువ రోగనిరోధక స్పందన శక్తి లభిస్తే ‘బ్రేక్‌ థ్రూ’ ఇన్‌ఫెక్షన్‌ సోకచ్చు. అన్నిరకాల టీకాల్లోనూ ఇలాంటివి ఉంటాయి. ఒకవేళ సోకినా లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. 

► ఏ వ్యాక్సిన్‌తో అయినా వందకు వంద శాతం రక్షణ ఇవ్వదన్న విషయాన్ని గ్రహించాలి. 

► రెండోడోస్‌ తీసుకున్నాక 14 రోజుల తర్వాతే రక్షణ ఏర్పడుతుంది. ఆ లోగా ఇన్‌ఫెక్షన్‌ సోకొచ్చు. 

► సెకండ్‌వేవ్‌లో డబుల్‌ మ్యుటేషన్‌ వైరస్‌ వ్యాప్తి తీవ్రత దీనికి కొంత కారణమై ఉండొచ్చు. 

► మాస్కు, భౌతికదూరం పాటించడం, గుంపుల్లో చేరకపోవడం, తరచుగా చేతులు కడుక్కోవడం, ఇళ్లలో విస్తారంగా గాలి వీచేలా చూసుకోవడం కొనసాగించాలి.   

చదవండి:
డెల్టా వేరియంట్‌ ఎంత డేంజరో తెలుసా?

Covid-19: ‘‘అరే, యార్‌! ఎక్కడ నుంచి వచ్చిందిరా ఇది?’’

మరిన్ని వార్తలు