కల్లం వద్దకు కార్గో బస్సు

4 Oct, 2020 02:07 IST|Sakshi

మార్కెట్‌ యార్డులు, మిల్లులకు ధాన్యం తరలిస్తున్న ఆర్టీసీ బస్సులు

చవకగా భద్రమైన బండి.. అందుబాటులోకి 200 వాహనాలు

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ ఉత్పత్తుల రవాణా తీరు మారిపోయింది. బండ్లు పోయి బస్సులొ చ్చాయి. కల్లాల వద్ద కార్గో బస్సులు దర్శనమిస్తున్నాయి. కల్లాల నుంచి ఇళ్లకు వరి ధాన్యం తరలించడానికి ఇదివరకు ఎడ్లబండ్లు ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో కార్గో బస్సులు వచ్చాయి. కల్లంలో ఒడ్లు సిద్ధం కాగానే వాటిని ఎడ్లబండి మీద ఇంటికి తీసుకెళ్లేవారు. తర్వాత ఊరికి లారీ రాగానే రైతులంతా మళ్లీ బండ్లకెత్తుకుని లారీలోకి మార్చేవారు. లారీలు అంతగా అందుబాటులో లేని సమయంలో ధాన్యాన్ని ఎక్కడికి తీసు కెళ్లాలన్నా ఎడ్లబండ్లే దిక్కు. ఇప్పుడు ఫోన్‌ చేయగానే నేరుగా కల్లం వద్దకే కార్గో బస్సు వస్తోంది. ధాన్యం ఎత్తుకుని రైస్‌ మిల్లుకంటే మిల్లుకు, కాదు మార్కెట్‌కంటే మార్కెట్‌కు తీసుకెళ్తోంది. ప్రస్తుతం 200 ఎర్రబస్సులు రైతులసేవలో పరుగుపెడుతున్నాయి. 

వానభయం ఉండదు.. ఎదురుచూపు లేదు..
సాగునీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో ఈసారి కల్లాలు ధాన్యంతో కళకళలాడు తున్నాయి. దాదాపు కోటి మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చిందని అంచనా. దీంతో 
పొలాల నుంచి రైస్‌ మిల్లులకు, మార్కెట్‌ యార్డులకు ధాన్యం తరలింపు పెరిగింది. రవాణావేళ వానొస్తే ధాన్యం తడిసిపోతుందే మోనన్న భయం ఇప్పుడు లేదు. స్థానిక డిపో బస్సులే కావటంతో ఆలస్యం అవుతుందన్న బెంగా లేదు. ప్రస్తుతం 150 పెద్ద బస్సులు, 50 మినీ బస్సులు కార్గో వాహనాలుగా పరుగులు పెడుతున్నాయి.  అవసరానికి తగ్గట్టు మరిన్ని బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటివరకు ఇతర సరుకుల తరలింపులో బిజీగా ఉన్న ఆ బస్సులు ఇప్పుడు ధాన్యం తరలింపులో తలమునకలై ఉన్నాయి.

గతంలో కనీసం 300 కి.మీ. బుక్‌ చేసుకోవాల్సి వచ్చేది. పైగా అప్‌ అండ్‌ డౌన్‌ ఛార్జీలూ భరించాల్సి ఉండేది. ఇప్పుడు 50 కి.మీ. పరిధిలో కూడా బుక్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు కేవలం ఒకవైపు ఛార్జీ భరిస్తే సరిపోయేలా మార్చారు. 8 టన్నుల సామర్ధ్యం ఉండే బస్సు 50 కి.మీ.కు రూ.4,420, 75 కి.మీ.రూ.5,010, 100 కి.మీ. 5,600, 125 కి.మీ.రూ.6,190.. ఇలా ఛార్జీలతో అందుబాటులో ఉన్నాయి. ఇవి లారీల ఖర్చు కంటే తక్కువే అని ఆర్టీసీ చెబుతోంది. అయితే వ్యక్తిగతంగా రైతుల్లో ఇంకా ఆర్టీసీ కార్గో బస్సులపై అవగాహన రాకపోవటంతో ఆర్డర్లు తక్కువే ఉంటున్నాయి. దీంతో ఎక్కడికక్కడ డిపో మేనేజర్లు ఊళ్లలోకి బస్సులు తీసుకెళ్లి సర్పంచుల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. చిన్న నిడివి గల వీడియోలు రూపొందించి వాట్సాప్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీంతో క్రమంగా రైతులు ఆర్టీసీ కార్గోకు చేరువవుతున్నారు. 

త్వరలో భారీ డిమాండ్‌: కృష్ణకాంత్, కార్గో ప్రత్యేకాధికారి
‘ఆర్టీసీ కార్గో బస్సులు రైతులకు ఎంతో ఉపయోగం. తక్కువ ఖర్చు, పూర్తి భద్రత ఉంటుంది. జవాబుదారీతనం కూడా ఉన్నందున రైతులు నష్టపోరు. ఇప్పుడిప్పుడే వారిలో అవగాహన పెరుగుతోంది. త్వరలో కార్గో బస్సులను భారీగా వినియోగించుకునే అవకాశం ఉంది’

మరిన్ని వార్తలు