కోవిడ్‌తో చిత్రకారుడు గోపి కన్నుమూత 

22 May, 2021 08:08 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: నాలుగు దశాబ్దాలకు పైగా కాన్వాస్‌పై తన బొమ్మలతో తెలుగు సాహిత్య, చిత్ర సీమను హోయలు పలికించి తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ చిత్రకారుడు గోపి (లూసగాని గోపాల్‌గౌడ్‌ 69) శుక్రవారం కోవిడ్‌తో కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత సమస్యలతో పాటు మధుమేహంతో బాధపడుతున్న ఆయన ఇటీవల కోవిడ్‌ బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాయంత్రం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో గోపి అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు భార్య,ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. 

అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి... 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌ చెందిన గోపి 1952లో జన్మించారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన అంచలంచెలుగా ఎదిగి నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ అభినందనలను అందుకున్నారు. 1975లో జేఎన్‌టీయూ నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేసి అన్ని తెలుగు వార,మాస పత్రికల్లో అనేక కథలు, నవలలకు ఆయన అద్భుతమైన బొమ్మలు గీశారు. అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో సమాచార, ప్రజాసంబంధాల విభాగంలో ఫ్రీలాన్స్‌ ఆర్టిస్టుగా 10 ఏళ్ల పాటు పనిచేశారు. పలు తెలుగు దినపత్రికలకు గోపి లోగోలను రూపొందించారు.

సినీ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాలకు తన కళాత్మకతను అద్దారు. మా భూమి, రంగుల కల, దొంగల దోపిడి వంటి చిత్రాలకు పోస్టర్లు, టైటిల్స్‌ రూపకల్పన చేశారు. ప్రఖ్యాత చిత్రకారుడు బాపు తన తరువాత గోపితో బొమ్మలు వేయించుకోవాలని స్వయంగా చెప్పడం విశేషం. ఆయన మృతి పట్ల పలువురు చిత్రకారులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.  
చదవండి: కరోనా సోకిన వారిలో ఆకస్మిక మరణాలకు కారణాలెన్నో..

మరిన్ని వార్తలు