Cab Driver Attack Case: క్యాబ్‌ డ్రైవర్‌పై దాడిలో 12 మందిపై కేసు 

9 Aug, 2022 10:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లి ప్రాంతంలో క్యాబ్‌ డ్రైవర్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వివేక్‌రెడ్డి కస్టడీ సోమవారం ముగిసింది. దీంతో పోలీసులు ప్రధాన నిందితుడిని జైలుకు తరలించారు. క్యాబ్‌ డ్రైవర్‌ వెంకటేష్‌తో పాటు యజమాని పర్వతాలును తనతో పాటు 12 మంది కలిసి దాడి చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు.

గత నెల 31న ఉప్పర్‌పల్లికి చెందిన వివేక్‌రెడ్డి (24) బీఎన్‌రెడ్డినగర్‌ నుంచి క్యాబ్‌ బుక్‌ చేసుకుని ఉప్పర్‌పల్లికి ప్రయాణం అయ్యాడు. బుకింగ్‌ స్వీకరించిన వెంకటేష్‌ (27) వివేక్‌రెడ్డిని పికప్‌ చేసుకుని చంద్రాయణగుట్ట మీదుగా ఉప్పర్‌పల్లికి  వెళ్తున్నాడు.ఈ క్రమంలో రాత్రి 12 గంటల సమయంలో యజమాని ఫోన్‌ చేయడంతో ఉప్పర్‌పల్లి వద్ద డ్రాప్‌ చేసి వస్తానని తెలపడంతో తాను చంద్రయణగుట్ట వద్దే ఉన్నానని తాను కూడా వస్తానంటూ తెలపడంతో కారులోనే ముగ్గురు కలిసి వెళ్లారు. 

డబ్బుల చెల్లింపులో వివాదం.. 
ఉప్పర్‌పల్లి వద్ద కారు దిగి డబ్బులు చెల్లించడంలో వివాదం చోటు చేసుకుని అతడు ఘర్షణకు దిగాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడికి తెలపడంతో వారు సైతం ఘటనా స్థలానికి వచ్చి డ్రైవర్‌తో పాటు యజమానిని సైతం చితకబాదారు. అనంతరం వారి కారులోనే ఇద్దరిని బందించారు. ఇదే సమయంలో రాజేంద్రనగర్‌ గస్తీ పోలీసులు పెట్రోలింగ్‌కు రాగా ఘర్షణ విషయాన్ని గమనించి వారందరినీ స్టేషన్‌కు తరలించారు. 

ఇరువురి భిన్న వాదనలు.. 
వివేక్‌రెడ్డి మొదట కారు డ్రైవర్‌ వెంకటేష్, పర్వతాలు ఇద్దరు తన గొలుసు తీసుకుని దాడి చేశారంటూ ఫిర్యాదు చేయగా.. డ్రైవర్‌ డబ్బులు చెల్లించమంటే తమపై దాడి చేశారని తెలపడంతో వారిని స్టేషన్‌లోనే కూర్చోబెట్టారు. అప్పటికే ఉదయం కావడంతో వెంకటేష్‌ అస్వస్థతకు గురై రక్తపు వాంతులు చేసుకోవడంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

దెబ్బలు తాళలేకే.. 
దెబ్బలు తాళలేకే ఇరువురు అస్వస్థతతకు గురి కావడంతో వారిని ఉస్మానియాకు తరలించామని డ్రైవర్‌ వెంకటేష్‌ పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ఉస్మానియా నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అదే రోజు సాయంత్రం కోమాలోకి వెళ్లిన వెంకటేష్‌ ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.  

హత్యాయత్నం కేసు.. 
మొదట రాజేంద్రనగర్‌ పోలీసులు వివేక్‌రెడ్డితో పాటు అతడి స్నేహితులపై దాడి కేసు నమోదు చేసి అనంతరం బాధితుడు కోమాలోకి వెళ్లడంతో హత్యాయత్నం కేసు నమోదు చేశారు.  

ఎస్‌ఐ పరీక్షలకు సిద్ధమవుతుండగా.. 
బాధితుడు వెంకటేష్‌ ఎస్‌ఐ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తునే శిక్షణ పొందుతున్నాడని ఆదివారం పరీక్షలు రాయాల్సి ఉండగా ఆసుపత్రిలో కోమాలో ఉ డని వారు విలపించారు. దాడి జరగకపోతే పరీక్షలు రాసి ఎస్‌ఐగా సెలక్ట్‌ అయ్యేవాడని దాడికి పాల్పడిన  నిందితులను శిక్షించాలని వారు కోరారు.  

మరిన్ని వార్తలు