చంద్రబాబుపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు

2 Nov, 2023 13:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చంద్రబాబు ర్యాలీపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు చంద్రబాబుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతో చంద్రబాబు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ జయచందర్‌ ఫిర్యాదుతో క్రైం నంబర్‌ 531\2023 కేసు నమోదైంది.

ఐపీసీ సెక్షన్‌ 341, 290, 21 రెడ్‌ విత్‌ 76 సీపీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. రెండు గంటల పాటు రోడ్లపై న్యూసెన్స్‌ చేసి ప్రజలను ఇబ్బందులను గురిచేశారని చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సిటీ టీడీపీ పార్టీ జనరలసెక్రెటరీ జీవీజీ నాయుడు సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. సుమారు 400మంది ర్యాలీలో పాల్గొన్నారని పోలీసులు పేర్కొన్నారు.

కాగా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకో­ణం కేసులో అరెస్టయి, అనారోగ్య కారణాలు చూపి­ంచి తాత్కాలిక బెయిలుపై జైలు నుంచి బయ­టకు వచ్చిన చంద్రబాబు హైదరాబాద్‌ చేరుకున్నారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్లాలనుకున్నా.. ఆ పర్యటన రద్దు చేసుకున్నారు. ఇక్కడ ర్యాలీ చేపట్ట­డంతో నగర వాసులు నరకం చూశా­­­రు. అనుమతుల్లేకుండా, నిబంధనలు ఉల్లంఘించి ప్రధాన రోడ్లపై అడ్డదిడ్డంగా భారీ ర్యాలీ చేయ­­డమే కాకుండా, టీడీపీ శ్రేణులు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ కూడా ఉల్లంఘించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హై­ద­రాబాద్‌ నగర పోలీసులు కేసు నమోదు చేశారు.

మంగళవారం రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు బుధవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నారు. బాబుకు మద్దతు కోరుతూ అందరూ రావాలంటూ నాయ­కులు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేశారు. దీంతో దాదాపు రెండు వేల మంది టీడీపీ కార్యకర్తలు అక్కడకు వచ్చారు. సాయంత్రం విమానాశ్ర­యం నుంచి బయటకు వచ్చిన బాబు కాన్వాయ్‌ను అనుసరిస్తూ పార్టీ జెండాలు, ప్లకార్డులతో ముందుకు కదిలారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి చేరుకోవడానికి దాదాపు మూడున్నర గంటలు పట్టింది. 

హైదరాబాద్‌లో సాధారణ సమయాల్లోనే ర్యాలీలు, నిర­సనలు, ప్రదర్శనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి. పైగా, ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. దీని ప్రకారం టీడీపీ తెలంగాణలో పోటీ చేయకపో­యినా రిటర్నింగ్‌ అధి­కారి నుంచి ర్యాలీకి అను­మతి పొందాలి. 48 గంటల ముందు దరఖాస్తు చేసు­కోవాలి. ఈ ఉల్లంఘనకు పాల్పడటంతో పాటు ర్యాలీలో వాహనా­లను అడ్డదిడ్డంగా నడిపి, అంబులెన్స్‌లకు సైతం దారి ఇవ్వకపోవడంతో హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: ఫైబర్‌నెట్‌ కేసులో వేగం పెంచిన సీఐడీ

మరిన్ని వార్తలు