కుటుంబ సభ్యులకు  మృతదేహాలు అప్పగింత

25 Jul, 2021 03:43 IST|Sakshi
అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మృతదేహాలను తరలిస్తున్న పోలీసులు

శ్రీశైలంహైవే ప్రమాదంపై కేసు నమోదు

రహదారిని 4 వరుసలుగా మార్చేందుకు కృషిచేస్తా: ఎంపీ

అచ్చంపేట/ఉప్పునుంతల: హైదరాబాద్‌–శ్రీశైలం జాతీయ రహదారిపై పిరట్వాన్‌పల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం ఉదయం 8 గంటలకు మృతుల కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, కార్తీక్‌ అలియాస్‌ సంపత్‌ కుటుంబసభ్యులకు సమాచారం అలస్యంగా చేరడంతో వారు ఉదయం 11.45 గంటలకు వచ్చారు. ఇతని పేరు, అడ్రస్‌ సరిగా లేకపోవడంతో గుర్తించడంలో జాప్యం జరిగింది. పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి, అనంతరం మృతదేహాలను అప్పగించారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ క్షతగాత్రుడు నరేశ్‌ తనతో పాటు వచ్చిన స్నేహితులు లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ప్రమాదంపై నరేశ్‌ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అజ్మీర రమేశ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంఘటన దురదృష్టకరం: ఎంపీ రాములు 
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోవడం దురదృష్టకరమని నాగర్‌కర్నూల్‌ ఎంపీ పి.రాములు అన్నారు. ఆయన అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీశైలం హైవేపై ట్రామా సెంటర్‌ ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న రెండు వరుసల రోడ్డును నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. దీన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించగా.. సర్వే చేయించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి గడ్కారీ హామీ ఇచ్చారని తెలిపారు. కాగా, సకాలంలో వైద్యులు ఆస్పత్రికి రాకపోవడంతో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు