Village Donated To Priest: గ్రామానికి గ్రామమే దానం

2 Oct, 2021 02:54 IST|Sakshi
పొలాల్లో వెలుగు చూసిన శాసనం ఇదే..

నల్లగొండ జిల్లాలో వెలుగుచూసిన 1158 నాటి శాసన

సాక్షి, హైదరాబాద్‌: పురోహితుల కోసం ప్రత్యేకంగా అగ్రహారాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ, రాజ పురోహితులకు గ్రామం మొత్తాన్ని దానంగా సమర్పించిన ఉదంతాలు అరుదు. అలాంటి ఓ దాన శాసనం తాజాగా వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలంలోని వావికొల్లు గ్రామం పొలిమేరలోని చారగొండవాగు తీరంలోని పొలాల్లో స్థానిక యువకుడు దీనిని గుర్తించాడు. దాన్ని తగుళ్ల గోపాల్‌ అనే కవి తన దృష్టికి తెచ్చారని, ఏడడుగుల ఎత్తు అడుగున్నర మందంతో ఉన్న ఈ శిలపై నాలుగు వైపులా 81 పంక్తులలో తెలుగులో చెక్కిన శాసనం ఉందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ తెలిపారు.
చదవండి: మణికొండ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: మంత్రి కేటీఆర్‌

కళ్యాణీ చాళుక్యుల చక్రవర్తి త్రిభువన మల్లదేవ రెండో జగదేకమల్ల పాలనా కాలంలో, పానగల్లు రాజధానిగా కందూరు నాడును పాలించిన సామంతుడైన ఉదయనచోడ మహారాజు ఈ శాసనాన్ని వేయించారని హరగోపాల్‌ పేర్కొన్నారు. క్రీ.శ.1158 ఆగస్టు 10న బోడవిప్పఱ్రు అనే గ్రామాన్ని దానం చేసినట్టు, బహుధాన్య నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పౌర్ణమినాడు చంద్రగ్రహణ ప్రత్యేక వేళ ఈ దానాన్ని సమర్పించినట్టు తెలుస్తోందని చెప్పారు.
చదవండి: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు 

గ్రామం నుంచి వసూలయ్యే పన్నులు రాజ్యానికి సమర్పించాల్సిన అవసరం లేకుండా, ఆ రాజ పురోహితులే అనుభవించేలా అవకాశం కల్పించారు. పుర హితానికి తోడ్పాటునందించే పురోహితులకు ఇలా దానాలు సమర్పించటం అప్పట్లో ఆనవాయితీగా ఉండేదని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. ఉదయనచోడుడి పాలన 1158 వరకు కొనసాగిందన్న ఆధారాన్ని చూపిన శాసనమిది కావటం విశేషం. గతంలో ఇదే రాజు వేయించిన 1157 నాటి శాసనం భువనగిరి సమీపంలో లభించింది.

మరిన్ని వార్తలు