అరెస్టు వారంట్‌ ఇస్తా: రేవంత్‌రెడ్డికి జడ్జి హెచ్చరిక

9 Feb, 2021 14:56 IST|Sakshi

ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌కు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి హెచ్చరిక

చంద్రబాబు పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు అభ్యంతరం

సాక్షి, హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రత్యేక కోర్టు విచారణకు సోమవారం హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి సాంబశివరావునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులపై కేసులను సత్వరం విచారించాలన్న సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోర్టు విచారణకు నిందితులు తప్పనిసరిగా హాజరుకావాల్సిందే నని తేల్చిచెప్పారు. మంగళవారం నిందితులపై అభియోగాలు నమోదు చేయనున్న నేపథ్యంలో నిందితులంతా తప్పనిసరిగా హాజరుకావాలని, లేకపోతే అరెస్టు వారంట్‌ జారీ చేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయసింహాతో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు ప్రత్యేక కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. 

వాదనలు వినిపించాలని కోరే హక్కు లేదు..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమాస్తులపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దివంగత ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌లో వాదనలు వినిపించేందుకు తమకు అనుమతివ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు సోమవారం తిరస్కరించింది. వాదనలు వినిపిస్తామని కోరే హక్కు (లోకస్‌) చంద్రబాబుకు లేదని న్యాయమూర్తి సాంబశివరావునాయుడు స్పష్టం చేశారు.

అయితే ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను సత్వరం విచారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు కోరుతూ లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ఇప్పటికే పలు పర్యాయాలు ఉత్తర్వులు ఇస్తామంటూ గత ఏడాదిన్నరగా న్యాయస్థానం వాయిదా వేస్తుండటంపై తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని, ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు స్పందించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు.

చదవండిరేవంత్‌ పిటిషన్‌ కొట్టివేత.. 

మరిన్ని వార్తలు