నా పిల్లిని తెచ్చిస్తే.. రూ.30 వేలిస్తా: మహిళ ప్రకటన

14 Jul, 2021 01:28 IST|Sakshi
అదృశ్యమైన తన జింజర్‌ (పిల్లి)ని చూపిస్తున్న జరీనా

సుల్తాన్‌బజార్‌ (హైదరాబాద్‌): తాను ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లి తప్పిపోవడంతో ఓ జంతు ప్రేమికురాలు కలత చెందారు. ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించారు. వారు ఫిర్యాదు తీసుకోకపోవడంతో పిల్లి ఫొటోతో రోడ్డుపై కరపత్రాలు సైతం పంచారు. అయినప్పటికీ పిల్లి ఆచూకీ దొరకకపోవడంతో ఏకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పిల్లి జాడ తెలిపిన వారికి నగదు రివార్డు సైతం ప్రకటించారు. టోలిచౌకీ  ప్రాంతానికి చెందిన జరీనా 8 నెలల నుంచి ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. దానికి జింజర్‌ అని పేరు కూడా పెట్టారు.

జింజర్‌కు జూబ్లీహిల్స్‌లోని ట్రస్టీ పెట్‌ క్లినిక్‌లో జూన్‌ 17న కుటుంబ నియంత్రణ సర్జరీ చేయించారు. అనంతరం వాపు రావడంతో తిరిగి జూన్‌ 23న అక్కడికే తీసుకెళ్లారు. ఈ క్రమంలో క్లినిక్‌ నుంచి పిల్లి అదృశ్యమైంది. జూన్‌ 27న రాయదుర్గం పోలీసులను ఆశ్రయించగా వారు ఫిర్యాదు తీసుకోకపోవడంతో జూబ్లీహిల్స్‌ పరిసర ప్రాంతాలలో పిల్లి ఫొటోతో కరపత్రాలు కూడా పంచారు. 20 రోజులుగా తన పిల్లి జాడ దొరకడం లేదని, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని జరీనా వాపోయారు. మంగళవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన జరీనా, జింజర్‌ ఆచూకీ తెలిపిన వారికి రూ. 30 వేల రివార్డు ఇస్తానని, తను ప్రాణంగా పెంచుకుంటున్న జింజర్‌ను తెచ్చివ్వాలని కోరారు.

మరిన్ని వార్తలు