ఇది పశువుల హాస్టల్‌..

5 Jan, 2021 03:06 IST|Sakshi

రూ.2 కోట్లతో షెడ్, ఇతర వసతులు

ఈజీఎస్, సీఎస్‌ఆర్‌ నిధులతో నిర్మాణం

ఒక్కో హాస్టల్‌లో 160 గేదెలు, ఆవులకు వసతి

మహిళా సంఘాలు, సన్నకారు రైతులకు నిర్వహణ బాధ్యతలు.. సిద్దిపేట జిల్లాలో రాష్ట్రంలోనే

తొలి ప్రాజెక్టు కింద నిర్మాణం

పైన చిత్రంలో మీరు చూస్తున్నది ఓ హాస్టల్‌. అదేంటీ.. పిల్లలే కనిపించడం లేదు అని అనుకుంటున్నారా.. ఎందుకంటే ఇది పిల్లల హాస్టల్‌ కాదు మరి.. పశువుల హాస్టల్‌. ఔరా.. ఇదేమి విచిత్రం అనుకుంటున్నారా. ఈ హాస్టల్‌ ఎక్కడుందో తెలుసా.. సిద్దిపేట జిల్లాలోని పొన్నాలలో.. రూ. 2 కోట్లతో దీన్ని నిర్మించారు. ఇక్కడ పెద్ద షెడ్లు, నీటి బోర్లు, వాటర్‌ ట్యాంక్, డ్రైనేజీ, విద్యుత్, గడ్డికోసే యంత్రాలు, పాలు నిల్వచేసే గది, కాపలాదారులకు గది, పశువుల వైద్య పరీక్ష స్టాండ్‌ అన్నీ ఉన్నాయి. విద్యార్థులకైతే తల్లిదండ్రులతో ఉండే అవకాశం ఉండదు కానీ.. ఇక్కడ పశువులు ఎంచక్కా తల్లీపిల్లా ఉండొచ్చు. ప్రస్తుతం 57 గేదెలు ఉండగా.. రోజుకు 150 లీటర్ల పాలు విక్రయిస్తున్నారు. మన ఊళ్లోనూ ఇలాంటి హాస్టల్‌ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదూ.  

సాక్షి, సిద్దిపేట: విద్యార్థులకు హాస్టళ్లు ఉంటాయని ఇప్పటివరకు తెలుసు.. కానీ సిద్దిపేట జిల్లాలో పశువులకూ ప్రత్యేకంగా హాస్టళ్లను నిర్మిస్తున్నారు. ఒక్కో దానిలో 160 గేదెలు, ఆవులకు వసతి కల్పించి.. పాడి పరిశ్రమ అభివృద్ధికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్‌) నిధులతో పాటు, కమ్యూనిటీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్‌) నిధులను జోడించి అన్ని హంగులతో హాస్టల్‌ను నిర్మించారు. ఈ హాస్టల్‌లో ఎస్సీ కార్పొరేషన్, స్త్రీనిధి రుణాల ద్వారా మహిళలకు అందించిన గేదెలు, ఆవులను పెంచి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టుగా ఈ జిల్లాలో హాస్టళ్లను నిర్మిస్తున్నారు. తర్వాత ఈ పశువుల హాస్టళ్లను దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా నిర్మించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

బాధ్యత వారిదే..
వ్యవసాయానికి అనుబంధంగాపాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న లక్ష్మంతోతలపెట్టిన ఈ పశువుల హాస్టళ్ల నిర్వహణను చిన్న,సన్నకారు రైతులు, మహిళా సంఘాలు తీసుకుంటున్నాయి. పశువులకు గడ్డివేయడం, పాలు పితకడం,వాటి పరిశుభ్రత వంటి పనులను మొత్తం రైతులే చూసుకుంటారు. వారి పనులను బట్టి వాటాలు కేటాయించారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్, స్త్రీనిధి ద్వారా రుణాలు తీసుకొని వచ్చిన పాలను విక్రయించడం, వాటిని ఖాతాలకు జమచేయడం అంతా మహిళలు చూసుకుంటారు. పాలను విజయ డెయిరీ సిబ్బందే నేరుగా హాస్టల్‌ వద్దకే వచ్చి సేకరించడం, వారం వారం డబ్బులు జమచేయడం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభమైన పొన్నాల గ్రామంలోని పశువుల హాస్టల్‌ నుంచి రోజుకు 57 గేదెల ద్వారా 150 లీటర్ల పాలను విక్రయిస్తున్నారు. వారం రోజుల్లో పూర్తి స్థాయిలో గేదెలు, ఆవులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. 

సౌకర్యంగా ఉంది
ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మాకు రెండు గేదెలు ఇచ్చారు. వాటిని హాస్టల్‌లో ఉంచడంతో సౌకర్యంగా ఉంది. సమయానికి వచ్చి గడ్డివేస్తున్నాం. ఉదయాన్నే పాలు పితుకుతున్నాం. గేదెలు అన్నీ ఒకేచోట ఉండటంతో కాపలా ఇబ్బంది లేదు. దూడల రక్షణ, వైద్య పరీక్షలు ఇక్కడే చేస్తున్నారు. పాలు కూడా ఇక్కడే విక్రయిస్తున్నాం. అయితే ధర తక్కువగా పెడుతున్నారు. పెంచితే మరింత లాభంగా ఉంటుంది. 
–పులుసు యాదగిరి, రైతు, పొన్నాల గ్రామం

వినూత్నంగా నిర్మాణం
మంత్రి హరీశ్‌రావు ఈ హాస్టల్‌ నిర్మాణాలు వినూత్నంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే గొర్రెల పాకలను లబ్ధిదారుల వారీగా కాకుండా సిద్దిపేట జిల్లాలో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని నిర్మించారు. ఇవి మంచి ఫలితాలు ఇచ్చాయి. ఈ పాకల్లో అన్ని వసతులు ఒకే చోట ఉండటంతో గొర్రెల కాపరులు లాభాలు పొందుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సిద్దిపేట జిల్లాలోని ఇర్కొడు, పొన్నాల, నర్మెట, మిట్టపల్లి, గుర్రాలగొంది, ఇబ్రహీంపూర్, జక్కాపూర్, గల్లమల్యాల గ్రామాల్లో నిర్మాణాలకు రూ. కోటి రూపాయల ఈజీఎస్‌ నిధులు, మరో కోటిరూపాయలను సీఎస్‌ఆర్‌ ద్వారా సేకరించారు. ఈ నిధులతో పెద్ద షెడ్లు, కాంపౌండ్, నీటికోసం బోర్లు, వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్, గడ్డికోసే యంత్రం, పాలు నిల్వచేసే గది, కాపలా కోసం వచ్చిన వారు ఉండే గది, పశువులను పరీక్ష చేసేందుకు స్టాండ్‌ మొదలైనవి నిర్మిస్తున్నారు. ఇప్పటికే పొన్నాల గ్రామంలో హాస్టల్‌ను ప్రారంభించారు. 

ఇక్కడ అన్ని వసతులూ ఉన్నాయిమా గ్రామంలో నిర్మించిన పశువుల హాస్టల్‌లో అన్ని వసతులున్నాయి.ఇక్కడ 160 గేదెలు, ఆవులు ఉంచే విధంగాషెడ్‌ను నిర్మించారు. ఇప్పటికే సగం గేదెలు వచ్చాయి. మిగిలిన వాటి కొనుగోలుకోసం రైతులు, గ్రామస్తులతోపాటు పశువైద్యాధికారులు ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్లారు. ఇప్పుడు 50 గేదెలు పాలు ఇస్తున్నాయి. మహిళలకు చేతినిండా పని కల్పించేందుకు ఈ హాస్టల్‌ ఉపయోగపడుతుంది. –రేణుక, గ్రామ సర్పంచ్,‌ పొన్నాల 

రైతులకు ఉపయోగకరం
పశువుల హాస్టల్‌తో చిన్న, సన్నకారురైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.ప్రభుత్వం నుంచి సబ్సిడీ ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని గేదెలు, ఆవులు కొనుగోలు చేసుకుంటున్నారు. వసతి కోసం హాస్టల్‌ ఉంది. సమయానికి వెళ్లి మేతవేయడం, శుభ్రపర్చడం, పాలు పితకడం చేస్తే చాలు. వ్యవసాయంతోపాటు, పశుపోషణ కూడా సాగుతుంది.–మమత, పొన్నాల గ్రామం

మరిన్ని వార్తలు