‘బొల్లినేని’ కేసులో సీబీఐ దూకుడు!

6 Oct, 2020 08:12 IST|Sakshi

సీబీఐ వద్ద నిందితుల ఫోన్‌ సంభాషణలు, ఫొటోలు 

కేసు నీరుగార్చేందుకు రూ.5 కోట్ల లంచం డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: జీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ అవినీతి కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి బొల్లినేని శ్రీనివాసగాంధీకి వ్యతిరేకంగా పలు కీలక సాక్ష్యాలను సేకరించింది. ఈ సాంకేతిక ఆధారాల సాయంతో కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. జీఎస్టీ కమిషనర్‌ చిలుక సుధారాణి, సూపరింటెండెంట్‌ బొల్లినేని శ్రీనివాసగాంధీలు కలిసి ఓ వ్యాపారవేత్త వద్ద రూ.5 కోట్ల లంచం డిమాండ్‌ చేసిన ఫిర్యాదుపై సీబీఐ సెప్టెంబర్‌ 11న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసి అత్యంత కీలకమైన ఆడియో రికార్డులు, పలు ఫొటోలు సంపాదించింది. ఇందులో బొల్లినేని శ్రీనివాసగాంధీ, చిలుక సుధారాణి, బాధితుడు సత్యశ్రీధర్‌రెడ్డిల సంభాషణల రికార్డులున్నాయని తెలిసింది. వీరు రూ.10 లక్షల లంచం తీసుకుంటుండగా తీసిన పలు ఫొటోలు కూడా సీబీఐ సేకరించిందని సమాచారం. ఈ కాల్స్‌లో లంచం డిమాండ్‌ చేయడం, వాటిని ఎప్పుడు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలో సత్యశ్రీధర్‌రెడ్డికి సూచించిన వ్యవహారం మొత్తం రికార్డయింది.
(చదవండి: స్వేచ్ఛ, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు)

అసలేం జరిగిందంటే..?
ఇన్ఫినిటీ మెటల్‌ ప్రొడక్ట్స్, దాని అనుబంధ కంపెనీలు అక్రమమార్గంలో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను పొందాయంటూ జీఎస్టీలో కేసు నమోదైంది. కేసులో నింది తుడు జగన్నగారి సత్యశ్రీధర్‌రెడ్డి అరెస్టయి, మార్చి 29న విడుదలయ్యాడు. ఇదే కేసులో వ్యాపార భాగస్వామిగా ఉన్న అతని భార్య అరెస్టు కాకుండా, మొత్తం కేసును నీరుగార్చేందుకు హైదరాబాద్‌ జీఎస్టీ పన్ను ఎగవేత నిరోధక విభాగంలో డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న చిలుక సుధారాణి, అదే విభాగంలో సూపరింటెండెంట్‌గా ఉన్న బొల్లినేని శ్రీనివాసగాంధీలు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు బాధితుడు సత్యశ్రీధర్‌ కూడా అంగీకరించాడు. అడ్వాన్సుగా రూ.10 లక్షలు ఏప్రిల్‌ 15న చెల్లించాడు.

మిగిలిన రూ.4.90 కోట్ల నగదుకు బదులుగా ఓపెన్‌ప్లాట్ల రూపంలో ఇవ్వాలని వారు షరతు విధించారు. ఈ లంచం వ్యవహారంలో సీబీఐకి ఉప్పందింది. దీంతో సుధారాణి, బొల్లినేని శ్రీనివాసగాంధీలతోపాటు లంచం విషయాన్ని తమకు చెప్పకుండా దాచినందుకు బాధితుడు సత్యశ్రీధర్‌రెడ్డిపైనా సీబీఐ కేసు నమోదు చేయడం గమనార్హం. ఏడాదికాలంలో బొల్లినేనిపై రెండో కేసు నమోదు కావడం గమనార్హం. గతేడాది బొల్లినేనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైన విషయం తెలిసిందే. ఎంపీ సుజనా చౌదరికి సంబంధించిన జీఎస్టీ ట్యాక్స్‌ ఎగవేత కేసును దర్యాప్తు చేసింది సుధారాణి, బొల్లినేని శ్రీనివాసగాంధీలే. 
(చదవండి: చంద్రబాబు ఆప్తుడు బొల్లినేనిపై మరో సీబీఐ కేసు)

మరిన్ని వార్తలు