మంత్రి గుంగుల కమలాకర్ ఇంటికి సీబీఐ బృందం.. విచారణకు ఢిల్లీకి రావాలని సమన్లు..

1 Dec, 2022 07:27 IST|Sakshi

‘నకిలీ సీబీఐ అధికారి’ కేసులో నేడు  విచారణకు రావాలని ఆదేశం

ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు కూడా..

ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న కొవిరెడ్డి శ్రీనివాసరావు ఆగడాలు

తెలుగు రాష్ట్రాల ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో పరిచయాలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ సాక్షి, న్యూఢిల్లీ: ‘నకిలీ సీబీఐ అధికారి’ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో గురువారం ఢిల్లీలో అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తాను సీబీఐ అధికారినంటూ తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యా ప్తంగా పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడిన కొవి రెడ్డి శ్రీనివాసరావు లీలలు ఒక్కొక్కటిగా వెలుగు లోకి వస్తున్న విషయం తెలిసిందే. అతడికి తెలుగు రాష్ట్రాల ప్రముఖులతో సంబంధాలపై సీబీఐ ఆరా తీస్తోంది.

ఈ క్రమంలో మంత్రి గంగుల, ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్‌ వ్యాపారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలతో పరిచయం ఉందని గుర్తించడంతో విచారణకు రావాలని ఆదేశించింది. బుధవారం ఉదయం ఇద్దరు సీబీఐ అధికారులు కరీంనగర్‌లోని గంగుల నివాసానికి వచ్చి సమన్లు అందించారు. రాష్ట్రంలో సీబీఐకి ఎంట్రీ లేదంటూ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్‌ 51 జారీ చేసిన నేపథ్యంలో.. సీబీఐ అధికారులు రాష్ట్రంలో ప్రముఖులకు సమన్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

కులం పేరుతో కుచ్చుటోపీ!
విశాఖపట్టణంలోని చినవాల్తేరు కిర్లంపూడికి చెందిన కొవిరెడ్డి తాను ఐపీఎస్‌ అధికారినని, సీబీఐలో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పుకొంటూ తిరిగేవాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో కులం పేరు చెప్పుకుని పరి చయం పెంచుకున్నాడు. తమ కులంవ్యక్తి కావడం, అతడి పటాటోపం చూసి ఒకరి వెనుక మరొకరు నమ్మేశారు.

అందులో ఎంపీలు, మంత్రులు, ఎమ్మె ల్యేలూ ఉన్నారు. అయితే శ్రీనివాసరావు ఢిల్లీలో వ్యాపారాలు, ఇతర అవసరాలున్న వారిని ఎంచుకునేవాడు. ఢిల్లీలో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని.. కొలువులు, పర్మిట్లు ఇప్పిస్తానని, కేసులు మాఫీ చేయిస్తానని నమ్మించేవాడు. ‘పని’ కావాలంటే ఖర్చవుతుందని చెప్పి విలువైన కాను కలు తీసుకునేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీలో పోర్టర్‌ అనే కంపెనీకి చెందిన దాదాపు 2వేల వాహనాలకు ఢిల్లీలో ‘నో ఎంట్రీ’ నిబంధనలు లేకుండా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ కేసులోనే శ్రీనివాసరావును ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో సీబీఐ అరెస్టు చేసింది.

రాష్ట్ర నేతల పరిచయాలతో..
తెలుగు రాష్ట్రాల్లో ఓ కులానికి సంబంధించిన నేత లను బాగా నమ్మింపజేసిన శ్రీనివాసరావు.. వారిలో కొందరు ప్రముఖుల నుంచి భారీగా బంగారం, నగదు తీసుకున్నట్టు సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలో అతడి ఫోన్‌లో వద్దిరాజు రవిచంద్ర, ఆయనకు బంధువైన మంత్రి గంగుల కమలాకర్‌లతో కలిసి తీసుకున్న ఫొటోలు లభించినట్టు సమాచారం. దీనికితోడు గతంలో ఈడీ అధికారిని అంటూ మంత్రి గంగుల కమలాకర్‌ను ఓ అజ్ఞాత వ్యక్తి మోసం చేసేందుకు ప్రయత్నించిన విషయమూ తెలిసిందే. ఈ క్రమంలో ఏవైనా లావాదేవీలు నడిచాయా అని సీబీఐ అనుమానిస్తోందని సమాచారం.

శ్రీనివాసరావుతో నాకేం సంబంధం లేదు
ఇటీవల కొన్ని వేదికలపై శ్రీనివాసరావు కలిశాడే తప్ప అతడితో తనకేం సంబంధం లేదని మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. సదరు శ్రీనివాసరావు తాను ఐపీఎస్‌ అధికారిని అంటూ పరిచయం చేసుకున్నాడని వివరించారు. ఢిల్లీ వెళ్లి ఇదే విషయాన్ని సీబీఐ ఆఫీసర్లకు చెబుతానన్నారు.

చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. విచారణలో నందు పొంతనలేని సమాధానాలు

మరిన్ని వార్తలు