వీఆర్వోల ‘సర్దుబాటు’

16 Feb, 2021 01:49 IST|Sakshi

మళ్లీ వీఆర్వోల వివరాలు తెప్పించుకుంటున్న సీసీఎల్‌ఏ

ఇతర శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో సర్దుబాటుకు యోచన

డైరెక్ట్‌ రిక్రూటీలు రెవెన్యూలోనే.. సర్దుబాటు తర్వాతే పదోన్నతులు! 

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను ఇతర ప్రభుత్వశాఖల్లో సర్దుబాటు చేసే ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్వోల పూర్తి వివరాలను భూపరి పాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) కార్యాల యం మళ్లీ సేకరిస్తోంది. మూడు ఫార్మాట్లలో వారి సమగ్ర సమాచారాన్ని పంపాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది. వీఆర్వోలందరి వివరాలను 18 కాలమ్‌ల ఫార్మాట్‌లో పంపాలని, వారిపై ఉన్న కేసులు, సస్పెన్షన్లు, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నవారి వివరాలు మరో ఫార్మాట్‌లో, వీఆర్వోల కులం, మతం, విద్యార్హతలు, ఉద్యోగ ఎంపికల గురించి ఇంకో ఫార్మాట్‌లో నమోదు చేసి పంపాలని కలెక్టర్లకు సూచించింది. వీలైనంత త్వరగా ఈ వివ రాలను చేరవేయాలని ఆ లేఖలో పేర్కొంది. కాగా, వీఆర్వోలను జూనియర్‌ అసిస్టెంట్ల హోదాలో పలు ప్రభుత్వశాఖల్లో సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారి సర్వీసు, విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖలకు ఇవ్వాలని, ఆ తర్వాత వారికి పదోన్నతుల ప్రకియ్ర చేపట్టాలని యోచిస్తున్నామని సీసీఎల్‌ఏ వర్గాలు తెలిపాయి. డైరెక్ట్‌ రిక్రూటీ వీఆర్వోలను రెవెన్యూలోనే కొనసాగించాలని ఆలోచిస్తున్నట్టు వెల్లడించాయి. 

తప్పులున్నాయి.. సరిపోలడంలేదు
వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 5,485 మంది వీఆర్వోలు పనిచేస్తున్నారు. ఈ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత వీరందరి వివరాలను ఇప్పటికే రెండుసార్లు సీసీఎల్‌ఏ వర్గాలు తెప్పించుకున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో తెప్పించిన వివరాల్లో వీఆర్వోల విద్యార్హత, కులం, ఉద్యోగ ఎంపికలకు సంబంధిం చిన వివరాలు సరిగా లేవని, ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో తెప్పించిన వివరాల్లో డిసెంబర్‌లో వచ్చిన సమాచారానికి, మళ్లీ పంపిన సమాచా రానికి తేడా ఉందని గుర్తించాయి. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి వీఆర్వోల వివరాలను సమగ్రంగా పంపాలని జిల్లా కలెక్టర్లను కోరుతూ సీసీఎల్‌ఏ లేఖలు రాయడం గమనార్హం.  

మరిన్ని వార్తలు