CCMB mRNA Vaccine: దేశంలో తొలిసారి.. వైరస్‌ రూపాలెన్ని మార్చినా.. ఏమార్చే టీకా! 

14 May, 2022 07:24 IST|Sakshi

ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీపై పట్టు సాధించిన సీసీఎంబీ

దేశంలో తొలిసారి అభివృద్ధి చేసిన ఘనత

చౌకగా టీకా తయారు చేయొచ్చన్న సంస్థ

సాక్షి హైదరాబాద్‌: టీకా తయారీ విషయంలో భారత్‌ కీలకమైన ముందడుగు వేసింది. కోవిడ్‌తోపాటు అనేక ఇతర వ్యాధుల నిరోధానికి టీకాలు తయారు చేసేందుకు వీలు కల్పించే మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ (ఎంఆర్‌ఎన్‌ఏ) టెక్నాలజీపై హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు పట్టుసాధించారు. అంతేకాకుండా వ్యాధికారక సూక్ష్మజీవులు తమ రూపాన్ని ఎన్నిసార్లు మార్చుకున్నా ఎప్పటికప్పుడు వేగంగా కొత్త టీకాలను తయారు చేసేందుకు ఈ టెక్నాలజీ దోహదపడుతుంది. దేశంలో ఈ సాంకేతికతను తొలిసారి రూపొందించిన సంస్థ ఇదే కావడం విశేషం.

ఇప్పటివరకూ ఈ టెక్నాలజీ మోడెర్నా, ఫైజర్‌ వంటి అంతర్జాతీయ సంస్థల వద్ద మాత్రమే ఉంది. దేశంలో రెండో దశ కోవిడ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో సీసీఎంబీ ఈ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందని, కేవలం పది నెలల్లో పట్టు సాధించిందని సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ నంది కూరి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కోవిడ్‌ కారక వైరస్‌ నుంచి ఆర్‌ఎన్‌ఏను వేరుచేసి, కొవ్వులతో కలిపి ఎలుకల్లోకి ఎక్కించినప్పుడు వాటి రోగనిరోధక వ్యవస్థ చైతన్యవంతమై యాంటీ బాడీలను ఉత్పత్తి చేసిందని చెప్పారు.

ప్రస్తుతం హ్యామ్‌స్టర్‌ రకం ఎలుకలపై ప్రయోగాలు చేస్తున్నామన్నారు. క్షయ, మలేరియా, డెంగీ వంటి అనేక వ్యాధులకు ఈ టెక్నాలజీ ఆధారంగా టీకాలు చేయొచ్చని తెలిపారు. అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతకు సంబంధించిన సమాచారాన్ని తాము ఉపయోగించుకున్నామని, అయితే తాము సిద్ధం చేసిన ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ భిన్నమైందని చెప్పారు. కోవిడ్‌ కోసం చేసిన టీకా 90 శాతం కంటే ఎక్కువ సామర్థ్యంతో యాంటీ బాడీలను ఉత్పత్తి చేసిందని వివరించారు. పలు సంస్థలు ఇప్పుడు ఎంఆర్‌ఎన్‌ఏ సాయంతో ప్రాణాంతక కేన్సర్‌కూ చికిత్స అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.  

ప్రైవేట్‌ కంపెనీలతోచేతులు కలుపుతాం 
ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకునేందుకు ప్రైవేట్‌ సంస్థలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని సీసీఎంబీ అనుబంధ సంస్థ అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ (ఏఐసీ) సీఈఓ డాక్టర్‌ వి.మధుసూదనరావు తెలిపారు. టీకా తయారీకి బలమైన మౌలిక సదుపాయాలన్నీ ప్రైవేట్‌ సంస్థల్లోనే ఉన్నాయన్నారు. ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీని అభివృద్ధి చేసే క్రమంలో తాము కొన్ని ఖరీదైన రసాయనాల స్థానంలో స్థానికంగా లభించే వాటిని ఉపయోగించామని చెప్పారు. ఫలితంగా దేశీ ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో టీకాలు తయారుచేయటం చౌక అవుతుందని చెప్పారు. ఏయే వ్యాధులకు టీకాలు చికిత్స అభివృద్ధి చేయాలో ప్రస్తుతానికి నిర్ణయించలేదన్నారు.  

మరిన్ని వార్తలు