లోన్‌యాప్స్‌ కేసులో ఛార్జీ షీట్‌ సిద్ధం

24 Mar, 2021 11:36 IST|Sakshi

చార్జిషీట్ సిద్దం చేసిన సైబర్ క్రైమ్స్ పోలీసులు

ప్రధాన నిందితుడిగా చైనా జాతీయుడు లాంబో

ఉద్యోగాల పేరిట బీటెక్‌ విద్యార్థుల పేరు మీద రుణాలు

ఇప్పటి వరకు  మొత్తం 22 వేల కోట్ల వ్యాపారం

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇన్‌స్టంట్‌ లోన్ యాప్స్ కేసులో  సైబర్ క్రైమ్స్ (సీసీఎస్‌) పోలీసులు చార్జిషీట్ సిద్దం చేశారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లోని 197 మొబైల్ యాప్స్ ద్వారా లక్షలాది  మందికి అత్యధిక వడ్డీతో పదివేల రూపాయల లోపు రుణాలు ఇచ్చినట్టు  పోలీసులు గుర్తించారు.  అంతేకాకుండా ఇప్పటి వరకు  మొత్తం 22 వేల కోట్ల మేరకు రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దేశంలోని పలు నగరాల్లో లోన్‌యాప్స్‌ నిర్వహకులపై పోలీసులు దాడిచేశారు. ఇప్పటివరకు 20 మంది నిర్వహకులను అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఆరుగురు, హైదరాబాద్లో ఆరుగురు, బెంగుళూరులో ఏడుగురు, కర్నూల్లో ఒకరిని  అరెస్ట్ చేశారు.

చైనాకు చెందిన లాంబోను లోన్‌ యాప్స్‌ ముఠా ప్రధాన నిర్వాహకుడిగా పోలీసులు గుర్తించారు. బెంగుళూరు కేంద్రంగా పిన్ పింగ్ టెక్నాలజీస్, ల్యూఫాన్గ్  టెక్నాలజీస్, నా బ్లూమ్ టెక్నాలజీస్,  హార్ట్ ఫుల్ టెక్నాలజీస్  పేరుతో నాలుగు సంస్థలను లాంబో ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. రాష్ట్రాల వారీగా స్థానిక ఫైనాన్స్ వ్యాపారులను ఉచ్చులోకి లాగారు.  ఎన్‌బిఎఫ్‌సీ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్ సంస్థలు విచ్చలవిడిగా వాడి, అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చాడు.  వేగంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి రుణాలను ఇచ్చేవారని పోలీసులు తెలిపారు.

అమాయకులైన నిరుద్యోగ బీటెక్‌ విద్యార్థులను ఉద్యోగాల పేరిట మోసం చేసి,  వారిపేరు మీద రుణాలను పొందేవారని పోలీసులు పేర్కొన్నారు. పైసా  పెట్టుబడి లేకుండా వేలకోట్ల వ్యాపారానికి పడగలేత్తారని వివరించారు. ప్రధాన సూత్రధారి అయిన  చైనా దేశీయుడు యోన్ యౌన్  అలియాస్ జెన్నిఫర్ చైనా నుంచే లాంబో ద్వారా భారత్ లో కార్యకలాపాలు నిర్వహించే వాడని పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన ఛార్జీషీట్‌ను బుధవారం పోలీసులు కోర్టులో దాఖలు చేయనున్నారు.

(చదవండి: కారుకు జీపీఎస్‌ ట్రాకర్‌ అమర్చి మరి ప్రేమ వేధింపులు)

మరిన్ని వార్తలు