బీఇ కోవిడ్‌ వ్యాక్సిన్‌ మూడో దశ పరీక్షలకు అనుమతి

25 Apr, 2021 13:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ నుంచి మరొక కోవిడ్‌ టీకా రానుంది. నగరానికి చెందిన వ్యాక్సిన్, ఫార్మాసూటికల్‌ కంపెనీ బయోలాజికల్‌ ఇ. లిమిటెడ్‌ (బీఇ) అభివృద్ధి చేస్తున్న కోవిడ్‌ టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ) అనుమతి లభించింది. బీఇ గతేడాది నవంబర్‌ రెండో వారంలో మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రారంభించింది. రెండు దశలనూ విజయవంతంగా పూర్తి చేశామని.. మంచి సానుకూల ఫలితాలు వచ్చాయని బీఇ ఎండీ మహిమ దాట్ల తెలిపారు.

పరీక్షలో పాల్గొన్న వారి భద్రత, రోగనిరోధక శక్తిని అంచనా వేశామన్నారు. రెండు దశల క్లినికల్‌ ట్రయల్స్‌లో చాలా పాజిటివ్‌ ఫలితాలను చూశామని.. మూడో దశలో ఆశాజనక ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉందన్నారు. దేశవ్యాప్తంగా 18–80 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 1,268 ఆరోగ్యవంతుల మీద మూడో దశ పరీక్షలుంటాయని పేర్కొన్నారు. 18–65 ఏళ్ల వయస్సు వారికి రెండు మోతాదులలో వ్యాక్సిన్‌ ఉంటుంది. 28 రోజుల కాల వ్యవధిలో ఇంట్రామస్కులర్‌ ఇంజక్షన్‌ ద్వారా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఉంటుంది.
చదవండి: దేశంలో కొత్తగా 3,49,691 కరోనా కేసులు

మరిన్ని వార్తలు