Konijeti Rosaiah Death: రోశయ్య మృతి పట్ల ప్రముఖుల సంతాపం

4 Dec, 2021 17:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి,కేవీపీ రామచంద్రారావు, షబ్బీర్‌ అలీ, మల్లు భట్టి విక్రమార్క  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ  సంతాపం
ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా, మంత్రిగా, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా, ప్ర‌జా ప్ర‌తినిధిగా అర్ధ‌శ‌తాబ్ధానికి పైగా ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించిన కొణిజేటి రోశ‌య్య మృతి ప‌ట్ల భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ రమణ ప్రగాఢ సంతాపం వ్య‌క్తం చేశారు. ఎల్ల‌ప్పుడూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను త‌క్ష‌ణం ప‌రిష్క‌రిస్తూ, ప‌రిపాల‌నా ద‌క్షుడిగా పేరు పొందిన రోశ‌య్య మృతి తెలుగు వారికి తీర‌నిలోట‌న్నారు.

ప్రధాని మోదీ సంతాపం: 
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. తాను, రోశయ్య  ముఖ్యమంత్రులుగా ఒకే సమయంలో పనిచేశామని తెలిపారు. అదేవిధంగా రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన సమయంలో ఆయనతో మంచి అనుబంధం ఉందని గుర్తుచేశారు. ఆయన సేవలు మరువలేమని తెలిపారు. రోశయ్య కుటుంబ సభ్యులకు పీఎం మోదీ సానుభూతి తెలియజేశారు.

సోనియాగాంధీ సంతాపం
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. రోశయ్య కుమారుడితో ఫోన్లో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు.

రోశయ్య మరణం తీరని లోటు: వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయ సాయిరెడ్డి సంతాపం తెలిపారు. ‘మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉ‍న్న రోశయ్యగారి మరణం తీరని లోటు’ అని ట్విటర్‌లో సంతాపం తెలిపారు.

రాజకీయాల్లో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిని తెలుగు రాష్ట్రాలు కోల్పోయామని ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయనతో అసెంబ్లీలో కలిసి పనిచేసి చాలా విషయాలు నేర్చుకున్నానని కృష్ణదాస్ అన్నారు.

కొణిజేటి రోశయ్య పట్ల ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రాంతి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య మరణం అత్యంత బాధాకరమన్నారు. దివంగత నేత వైస్ రాజశేఖరరెడ్డికి రోశయ్య అత్యంత సన్నిహితులన్నారు. ఆయనకు భగవంతుడు ఆత్మశాంతి ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు.ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారు పరమపదించారని తెలిసి విచారించాను. వారు నాకు చిరకాల మిత్రులు. విషయ పరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసిందని’’ ఆయన ట్వీట్‌ చేశారు. ఓర్పు, నేర్పు కలిగిన మంచి వక్తగా రోశయ్య అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని’’ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీక రోశయ్య : ఏపీ గవర్నర్‌
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాటి తరం నాయకునిగా విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా రోశయ్య నిలిచారన్నారు. ఉదయం అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందడం విచారకరమన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని  ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ఫ్రగాడ సానుభూతి తెలియజేస్తున్నానని గవర్నర్ హరి చందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు