వేసెక్టమీలో దేశంలోనే రాష్ట్రానికి రెండో స్థానం

29 Jul, 2022 02:53 IST|Sakshi
భారతి ప్రవీణ్‌ పవార్‌ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న దృశ్యం 

రాష్ట్రానికి అవార్డు అందజేసిన కేంద్రం

అభినందించిన మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వేసెక్టమీ) చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌ మొదటిస్థానంలో ఉంది. దీంతోపాటు వ్యక్తిగత జాబితాలో అత్యధిక సర్జరీలు చేసినందుకు హనుమకొండ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాకూబ్‌పాషాకు కేంద్రం ప్రత్యేక అవార్డు ప్రకటించింది. రాష్ట్రంలో గతేడాది మొత్తం 3,600 వేసెక్టమీ సర్జరీలు జరగగా, డాక్టర్‌ యాకూబ్‌పాషా తన 22 ఏళ్ల సర్వీసులో 40 వేలకు పైగా సర్జరీలు నిర్వహించారు.

తాజాగా ఢిల్లీలో నిర్వహించిన ‘నేషనల్‌ ఫ్యామిలీ ప్లానింగ్‌ సమ్మిట్‌–2022’లో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ చేతుల మీదుగా రాష్ట్ర అధికారులు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. శాఖ సిబ్బందిని, హనుమకొండ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాకూబ్‌పాషాను ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వార్తలు