బీఎస్‌– 6 కార్లకు ఇక సీఎన్‌జీ 

9 Feb, 2022 02:50 IST|Sakshi

కొత్తకార్లకు సీఎన్జీ రిట్రో ఫిట్‌మెంట్‌ 

విధి విధానాలపై కేంద్రం దృష్టి

త్వరలోనే అమల్లోకి ఇంధన మార్పు  

వాహనదారుకు 50 శాతం మేర ఆదా  

సాక్షి, సిటీబ్యూరో: ఎంతో సంతోషంగా కొనుగోలు చేసిన కొత్తకారు బయటకు తీసేందుకు  వెనకడుగు వేస్తున్నారా? ఇంటిల్లిపాదీ కలిసి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే  ఇంధన భారం బెంబేలెత్తిస్తుందా? మరేం ఫర్వాలేదు. త్వరలోనే  మీ వాహనంలో  ఇంధన వినియోగానికి అనుగుణమైన మార్పులు చేసుకోవచ్చు.  పెట్రోల్‌తో  నడిచే భారత్‌ స్టేజ్‌– 6 వాహనాల్లో ఇక సీఎన్జీ కిట్‌లను అమర్చుకోవచ్చు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై కేంద్రం దృష్టి సారించింది. త్వరలోనే అన్ని చోట్లా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.

దీంతో ప్రస్తుతం పెట్రోల్‌తో నడిచే  వాహనాలు సీఎన్జీ వినియోగంలో మారడం వల్ల వాహనదారులకు ఇంధనంపై ఖర్చు  40 నుంచి 50 శాతం వరకు ఆదా అవుతుంది. గ్రేటర్‌లో సుమారు 1.5 లక్షల బీఎస్‌–6  వాహనాలకు ఊరట లభించనుందని రవాణా వర్గాలు చెబుతున్నాయి. బీఎస్‌– 6 శ్రేణికి చెందిన వాహనాలను కొనుగోలు చేసిన చాలా మంది సీఎన్జీకి  మార్చుకోవాలని  భావించినప్పటికీ ఇప్పటి వరకు ఆ అవకాశం లేకపోవడంతో ఇంధనం  కోసం  భారీగా ఖర్చు చేయాల్సివస్తోంది.   

పర్యావరణ పరిరక్షణ.. 
సహజ ఇంధన వాహనదారులకు ఖర్చు తగ్గడంతో పాటు  పర్యావరణ పరిరక్షణకు సైతం  దోహదం చేస్తుంది. ఈ  మేరకు బీఎస్‌– 4 వాహనాల వరకు ప్రభుత్వం సీఎన్జీ కిట్‌లను ఏర్పాటు చేసుకొనేందుకు గతంలోనే అనుమతులను ఇచి్చంది. కానీ కొత్తగా వచ్చిన  బీఎస్‌–6 వాహనాలకు మాత్రం  ఇప్పటి వరకు అనుమతి లభించలేదు. తాజాగా అన్ని రకాల కార్లకు సీఎన్జీ కిట్‌లు ఏర్పాటు చేసుకోవచ్చని  కేంద్రం చెప్పింది. ఎస్‌యూవీ వాహనాలకు కూడా ఈ మార్పు వర్తించనుంది.  

1.5 లక్షల వాహనాలకు ఊరట... 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 1.5 లక్షల బీఎస్‌–6 వాహనాలకు ఈ మార్పు వల్ల  ఊరట లభించనుంది. సీఎన్‌జీ కిట్‌లను అమర్చుకోవడం వల్ల  వాహనదారులు ఆ ఇంధనం అందుబాటులో లేని సమయాల్లో సాధారణ పెట్రోల్‌ వాహనాలుగా కూడా వినియోగించుకోవచ్చు. వాహనాల భద్రత దృష్ట్యా ప్రతి మూడేళ్లకోసారి సీఎన్జీ కిట్‌లను రిట్రోఫిట్‌మెంట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.  

మరిన్ని వార్తలు