Corona Virus: గాలిలో 10 మీటర్ల వరకు.. 

21 May, 2021 02:39 IST|Sakshi

డ్రాప్లెట్ల కంటే 5 రెట్లు ఎక్కువ దూరం విస్తరిస్తున్న ఏరోసోల్‌

రెండు మాస్క్‌లు ధరించాల్సిందే

సామాజిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి ప్రొటోకాల్స్‌ పాటించాలి

వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలి

కరోనా సంక్రమణపై కేంద్రం నూతన అడ్వైజరీ జారీ

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన భయాందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు, మహమ్మారిని అణచివేయడానికి ప్రతీ ఒక్కరు మాస్క్‌లు ధరించడంతో పాటు సామాజిక దూరాన్ని పాటించడం, శానిటేషన్‌ చేసుకోవడం, వెంటిలేషన్‌ ద్వారా వైరస్‌ వ్యాప్తిని నివారించగలుగుతామని కేంద్ర ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ విజయ్‌ రాఘవన్‌ కార్యాలయం నుంచి విడుదల చేసిన మార్గదర్శకాల్లో తెలిపారు.  కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి గాలి పీల్చడం, మాట్లాడటం, పాడటం, నవ్వడం, దగ్గు లేదా తుమ్ము మొదలైన వాటిలో బిందువులు (డ్రాప్లెట్స్‌), ఏరోసోల్స్‌ రూపంలో విడుదలయ్యే లాలాజలం వైరస్‌ వ్యాప్తికి ప్రా«థమిక లక్షణమని తెలిపారు.

లక్షణాలు కనిపించని కరోనా సోకిన వ్యక్తి కూడా వైరస్‌ను వ్యాపిస్తాడని వివరించారు. లక్షణాలు లేని వ్యక్తులు వైరస్‌ వ్యాప్తి చెందించే అవకాశం ఉన్నందున ప్రజలు రెండు మాస్క్‌లు ధరించడం కొనసాగించాలని, లేదా ఎన్‌–95 మాస్క్‌ ధరించాలని సూచించారు. వైరస్‌ ఒక వ్యక్తికి సోకిన తరువాత అనేకమందికి వ్యాపించే ప్రమాదం ఉంటుందని అందువల్ల వైరస్‌ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాప్తి కావడాన్ని ఆపివేయడం వలన వ్యాధి సంక్రమణ రేటు తగ్గుతుందని తెలిపారు. దీనికి ప్రతీ ఒక్కరి సహకారం అవసరమని, మాస్క్‌లు, వెంటిలేషన్, సామాజికదూరం, శానిటేషన్‌ ద్వారా వైరస్‌పై చేస్తున్న పోరాటంలో గెలవవచ్చని అడ్వైజరీలో తెలిపారు. 

వెంటిలేషన్‌తో తగ్గనున్న వ్యాప్తి..
ముఖ్యంగా వైరస్‌ గాలిలో 10 మీటర్ల వరకు వ్యాప్తి చెందుతుందని కరోనా సంక్రమణపై ప్రభుత్వం తెలిపింది. వైరస్‌ సోకిన వ్యక్తి డాప్లెట్స్‌ 2 మీటర్ల వరకు వ్యాప్తి చెందగా, ఏరోసోల్, డ్రాప్లెట్స్‌ కంటే 5 రెట్లు ఎక్కువ వ్యాపిస్తుందని సూచించారు. కరోనా లక్షణాలు లేని వ్యక్తులు కూడా సంక్రమణ వ్యాప్తి చెందుతారని తెలిపారు. అందువల్ల ప్రజలు కరోనా ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలన్నారు. మరోవైపు వెంటిలేషన్‌ చాలా తక్కువగా ఉన్న ఇళ్లు, కార్యాలయాల్లో వెంటిలేషన్‌ పెంచడం వల్ల వైరల్‌ ప్రభావాన్ని బాగా తగ్గించడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయని అడ్వైజరీలో ప్రస్తావించారు. వెంటిలేషన్‌ కారణంగా వైరస్‌ సోకిన ఒక వ్యక్తి నుంచి మరొకరికి సంక్రమించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపింది.

కిటికీలు, తలుపులు తెరవడం, ఎగ్జాస్ట్‌ వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా గాలిలో పేరుకుపోయిన వైరస్‌ పలుచపడి, ప్రసార ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. వెంటిలేషన్‌ మెరుగుపరచడానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర ప్రాధాన్యతతో తీసుకోవాలని సూచించారు. క్రాస్‌ వెంటిలేషన్, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు వ్యాధి వ్యాప్తిని తగ్గించగలుగుతాయన్నారు. కార్యాలయాలు, ఆడిటోరియంలు, షాపింగ్‌ మాల్స్‌ మొదలైనవాటిలో పైకప్పు వెంటిలేటర్లను వాడటం మంచిదని, ఫిల్టర్లను  తరచుగా శుభ్రపరచడం, మార్చడం చాలా మంచిదని సూచించారు. 

రెండు మాస్క్‌లు ధరించాలి...
ప్రజలు రెండు మాస్క్‌లను లేదా ఎన్‌ 95 మాస్క్‌ ధరించాలని ప్రభుత్వం పేర్కొంది. అవి మరింత ఎక్కువగా వైరస్‌ బారి నుంచి రక్షిస్తాయి. రెండు మాస్క్‌లు ధరించినట్లయితే, మొదట సర్జికల్‌ మాస్క్‌ ధరించాలని, ఆపై దానిపై బిగుతుగా ఉండే కాటన్‌ మాస్క్‌ ధరించాలని సూచించారు. ఎవరైనా సర్జికల్‌ మాస్క్‌ లేకపోతే, వారు 2 కాటన్‌ మాస్క్‌లు ధరించాలి. అయితే సర్జికల్‌ మాస్క్‌ ఒక్కసారి మాత్రమే వాడాలి. కానీ ఒకవేళ మీరు 2 మాస్క్‌లు ధరిస్తే, మీరు 5 సార్లు సర్జికల్‌ మాస్క్‌ని ఉపయోగించవచ్చు. అయితే ప్రతిసారి సర్జికల్‌ మాస్క్‌ వాడిన తరువాత 7 రోజులు ఎండలో ఉంచాలి.

ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ పరీక్ష...
ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇతర ఆరోగ్య కార్యకర్తలకు వేగంగా యాంటిజెన్‌ పరీక్షలు చేయడానికి శిక్షణ ఇవ్వాలి. ఈ ఆరోగ్య కార్యకర్తలకు  ఇప్పటికే వ్యాక్సిన్లు వేసినా సర్టిఫైడ్‌ ఎన్‌–95 మాస్క్‌ను, ఆక్సీమీటర్‌ను అందించాలని సూచించారు. 

ఏరోసోల్‌ అంటే ఏమిటి..?
ఏరోసోల్స్, డ్రాప్లెట్స్‌కు పరిమాణం తప్ప రెండింటి మధ్య తేడాలేదు. ఐదు మైక్రాన్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే బిందువులను శాస్త్రవేత్తలు ఏరోసోల్స్‌ అని పిలుస్తారు. 

>
మరిన్ని వార్తలు