ఒక ప్రాంతం.. అనేక కరెంటు కంపెనీలు 

30 Nov, 2022 02:55 IST|Sakshi

ఎంత చిన్న ప్రాంతంలోనైనా అనేక డిస్కంల ఏర్పాటు 

కంపెనీలకు లైసెన్స్‌ల జారీ నిబంధనలకు సవరణ 

‘కనీస ప్రాంతం’పై మరింత స్పష్టతనిచ్చిన కేంద్రం

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణదిశగా కేంద్రం దూకుడు పెంచింది. యావత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లేదా పక్కపక్కనే ఉన్న మూడు రెవెన్యూ జిల్లాల మొత్తం ప్రాంతం పరిధిని విద్యుత్‌ సరఫరాకు ఉండాల్సిన కనీస ప్రాంతం(మినిమమ్‌ ఏరియా ఆఫ్‌ సప్లై)గా పరిగణిస్తూ కొత్త విద్యుత్‌ పంపిణీ కంపెనీ(డిస్కం)లకు లైసెన్సులు జారీచేయాలని ఆదేశించింది.

లేకుంటే ప్రభుత్వం ప్రకటించిన మరేతర చిన్న ప్రాంతాన్ని కూడా మినిమమ్‌ ఏరియా ఆఫ్‌ సప్లైగా పరిగణిస్తూ కొత్త డిస్కంలకు లైసెన్సులు జారీ చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు డిస్ట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ లైసెన్స్‌ రూల్స్‌(రెండో సవరణ)–2022ను ప్రకటిస్తూ ఈ నెల 28న కేంద్ర విద్యుత్‌ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గత సెప్టెంబర్‌ 8న గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా అమల్లోకి తెచ్చిన సవరణలకు మరింత స్పష్టతనిస్తూ తాజా నోటిఫికేషన్‌ను ప్రకటించింది.

ప్రభుత్వాలు నిర్దేశించనున్న ఎంత చిన్న ప్రాంతంలోనైనా ఒకటికి మించిన సంఖ్యలో సమాంతర విద్యుత్‌ కంపెనీల ఏర్పాటుకు కొత్త సవరణలు వీలు కల్పించనున్నాయి. మున్సిపాలిటీ/ మున్సిపల్‌ కార్పొరేషన్‌/ రెవెన్యూ జిల్లాను కనీస ప్రాంతంగా పరిగణిస్తూ విద్యుత్‌ కంపెనీలకు లైసెన్సులు జారీ చేయాలని పాత నిబంధనలు పేర్కొంటున్నాయి.  

విద్యుత్‌ బిల్లు అమలు కోసమే.. 
ఒకే ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఎన్ని డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు ముందుకొచ్చినా, రాష్ట్రాల ఈఆర్సీలు వాటికి తప్పనిసరిగా లైసెన్సులు జారీ చేయాలని, ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్‌ చట్టసవరణ ముసాయిదా బిల్లు–2022లో కేంద్రం ప్రతిపాదించింది. తమ సొంత పంపిణీ వ్యవస్థ ద్వారానే వినియోగదారులకు డిస్కంలు విద్యుత్‌ సరఫరా చేయాలని ప్రస్తుత నిబంధనలు పేర్కొంటున్నాయి.

అంటే డిస్కంలు విద్యుత్‌ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లతో సొంత సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటేనే లైసెన్స్‌ ఇస్తారు. ‘సొంత వ్యవస్థ ఉండాల’నే నిబంధనను సైతం తొలిగిస్తున్నట్టు విద్యుత్‌ బిల్లులో కేంద్రం మరో ప్రతిపాదన చేసింది. ఒకే ప్రాంతంలో ఒకటికి మించిన సంఖ్యలో డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలకు తప్పనిసరిగా ఓపెన్‌ యాక్సెస్‌ సదుపాయం కల్పించాలని ఇంకో కీలక ప్రతిపాదన చేసింది. తాజాగా విద్యుత్‌ సరఫరాకు ఉండాల్సిన కనీస ప్రాంత పరిధిపై పరిమితులను ఎత్తివేస్తూ కొత్త నిబంధనలను అమల్లోకి తేవడంతో భవిష్యత్తులో విద్యుత్‌బిల్లు అమలుకు మార్గం సుగమమైంది. విద్యుత్‌ బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే ప్రైవేటు డిస్కంలకు తలుపులు బార్లా తెరిచినట్టు కానుంది. 

మరిన్ని వార్తలు