Telangana Cabinet Meeting: కేంద్రం ఇచ్చింది 3శాతం కంటే తక్కువే..

12 Aug, 2022 01:51 IST|Sakshi

రాష్ట్రం చేసిన ఖర్చులో కేంద్ర పథకాల నిధులు నామమాత్రమే.. 

తోడ్పాటు అందిస్తే వృద్ధి రేటు మరింత ఎక్కువగా ఉండేది 

కేబినెట్‌ సమావేశంలో వివరించిన ఆర్థికశాఖ ఉన్నతాధికారులు 

సాక్షి, హైదరాబాద్‌:  కేంద్ర ప్రాయోజిత పథకాల (సీసీఎస్‌) కింద గత ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి రూ.47,312కోట్లు మాత్రమే వచ్చాయని.. అదే రాష్ట్ర ప్రభు త్వం కేవలం నాలుగేళ్లలోనే, ఒక్క రైతుబంధు కిందే రైతులకు రూ.58,240 కోట్లను అందించిందని కేబినెట్‌కు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.84 లక్షల కోట్లు ఖర్చుచేయగా.. అందులో సీఎస్‌ఎస్‌ కింద అందింది రూ.5,200 కోట్లు మాత్రమేనని.. రాష్ట్రం చేసిన ఖర్చులో ఇది 3శాతం కంటే తక్కువని నివేదించారు.

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్‌లో మంత్రి వర్గ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా ఐదు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ఉన్నతాధికారులు కూడా పాల్గొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. కేంద్రం తీరుతో రాష్ట్రాల వృద్ధిరేటు కుంటుపడు తోందని అధికారులు కేబినెట్‌కు వివరించారు. ‘దేశంలో రాష్ట్ర జనాభా రెండున్నర శాతమే అయినా.. దేశ ఆదాయంలో 5% మన రాష్ట్రం నుంచే అందింది. సొంత పన్నుల ఆదాయంలో 11.5 శాతం వృద్ధితో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఏడేళ్లలోనే మూడు రెట్ల వృద్ధితో దేశంలో అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రం సాధించిన ప్రగతికి కేంద్ర తోడ్పాటు కూడా ఉంటే.. రాష్ట్ర జీఎస్డీపీ విలువ మరో రూ.3 లక్షల కోట్లు పెరిగి రూ.14.50 లక్షల కోట్లకు చేరుకునేది..’’అని అధికారులు వివరించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ఇప్పటివరకు రాష్ట్ర ఆదా యం 15.3 శాతం వృద్ధిరేటును నమోదు చేసిందని తెలిపారు. కేంద్ర పథకాల నిధులు తగ్గినా తగిన వృద్ధి రేటు నమోదు చేయడం గర్వకారణమని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అభినందించారు. 

ఐటీలో లక్షా 55 వేల కొత్త ఉద్యోగాలు 
తెలంగాణ గత ఏడాది ఐటీ రంగంలో లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించి దేశంలో అగ్రగామిగా నిలిచిందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ కేబినెట్‌కు వివరించారు. ఐటీలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు కంటే ఇది ఎక్కువన్నారు. 

కేబినెట్‌ నిర్ణయాలివీ.. 
రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్ల మంజూరుకు ఆమోదం. ఇప్పటికే 36 లక్షల మంది పెన్షన్లు అందుకుంటుండగా.. ఆ సంఖ్య 46 లక్షలకు చేరనుంది. 
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల. 
కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి 10 స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు మంజూరు. ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో ఈఎన్‌టీ టవర్‌ నిర్మాణం. 
సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో అధు నాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణం. 
కోఠి వైద్యారోగ్యశాఖ సముదాయంలోనూ అధునాతన ఆస్పత్రి నిర్మాణం
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్‌ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు. 
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఈ నెల 21న చివరి ముహూర్తం ఉండటం, భారీ సంఖ్యలో వివాహ, శుభ కార్యక్రమాలు ఉండటంతో.. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు సమావేశాల రద్దుకు నిర్ణయం. 
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన. 
రాష్ట్రంలో జీవో 58, 59ల కింద పేదలకు స్థలాల పట్టాల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశం. 
గ్రామకంఠం స్థలాల్లో కొత్త ఇళ్ల నిర్మాణం విషయంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం. అధికారులతో ఒక కమిటీ వేసి, 15 రోజుల్లోగా నివేదిక తీసుకోవాలని నిర్ణయం. 
వికారాబాద్‌లో ఆటోనగర్‌ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం కేటాయింపు. 
తాండూరు మార్కెట్‌ కమిటీకి యాలాలలో 30 ఎకరాల ఎకరాల స్థలం కేటాయింపు. 
షాబాద్‌లో టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో షాబాదు బండల పాలిషింగ్‌ యూని ట్ల కోసం 45 ఎకరాలు కేటాయింపు.
చదవండి: రాష్ట్రంపై కేంద్రం నిందలను తిప్పికొడదాం.. సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు