అంతర్రాష్ట్ర ప్రయాణం సులభతరం

3 Sep, 2021 04:07 IST|Sakshi

కరోనా కేసులు తగ్గుతుండటంతో దేశవ్యాప్తంగా ఒకే ప్రొటోకాల్‌కు కేంద్రం నిర్ణయం

ప్రయాణికులందరూ మొబైల్‌లో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకోవాలి

విమాన, రైలు, బస్సు తదితర ప్రయాణాలు చేసే వారందరికీ సూచనలు

ఏదైనా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగితే అక్కడ ఆంక్షలు అమలుచేయవచ్చు

మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలను మరింత సులభతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో ప్రత్యేకంగా నియమనిబంధనలు విధించాయి. క్వారంటైన్, ఐసోలేషన్‌ వంటివి అమలుచేశాయి. అయితే కరోనా కేసుల ఉధృతి తగ్గడంతో ప్రయాణాలను సులభతరం చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. విమాన, రైలు, బస్సు ప్రయాణాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏకీకృత ప్రొటోకాల్స్‌ను అమలు చేయాలని స్పష్టం చేసింది.

వీటిని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని సూచించింది. సులభతరం చేయడమంటే, ఇష్టారాజ్యంగా ప్రయాణికులు తిరగడమన్న ఉద్దేశం కాదని, అవసరమైన ఆరోగ్య ప్రొటోకాల్స్‌ను తప్పక పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఏదైనా రాష్ట్రంలో అసాధారణంగా కరోనా కేసులు పెరిగిన సందర్భాల్లో తగిన ప్రజారోగ్య చర్యలను వెంటనే ప్రారంభించవచ్చు. అటువంటప్పుడు స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలు అదనపు ఆంక్షలను అమలు చేయవచ్చు. 

మార్గదర్శకాలు ఇవీ... 
ప్రయాణికులు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి. కోవిడ్‌ సంబంధిత లక్షణాలు లేనప్పుడు మాత్రమే ప్రయాణించాలి. మాస్క్, హ్యాండ్‌ హైజీన్, భౌతికదూరం పాటించాలి.  
ప్రయాణ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదు.  
ప్రయాణికులందరూ తమ మొబైల్లో ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ 
చేసుకోవాలి.  
ప్రయాణ సమయంలో వారికి జ్వరం వచ్చినట్లయితే, వారు సంబంధిత విమాన సిబ్బందికి లేదా రైలు టీటీఈకి లేదా బస్‌ కండక్టర్‌కు తెలియజేయాలి. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కూడా లక్షణాలు కనిపిస్తే, కోవిడ్‌ కాల్‌ సెంటర్‌కు వివరాలు ఇవ్వాలి. 
విమానాశ్రయాలు/రైల్వే స్టేషన్లు/పోర్టులు/బస్‌ స్టేషన్లలో కరోనాకు సంబంధించిన ప్రకటనలు జారీచేయాలి.  
ప్రయాణికులందరూ బయలుదేరే సమయంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయించుకోవాలి. లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే విమానం/రైలు/ఓడ/బస్సు ఎక్కడానికి అనుమతిస్తారు.  
ప్రయాణికులకు శానిటైజర్లు, 
మాస్క్‌లను అందుబాటులో ఉంచాలి.  
ప్రయాణం తర్వాత బయటకు వెళ్లేవారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేయాలి. లక్షణాలు లేని ప్రయాణికులు 14 రోజులపాటు తమ ఆరోగ్యాన్ని స్వయంగా
పర్యవేక్షించుకోవాలనే సలహా ఇవ్వాలి.  
ఒకవేళ ప్రయాణికుల్లో ఎవరికైనా లక్షణాలుంటే, వారిని ఐసోలేట్‌ చేయాలి. అవసరమైతే రోగులను తగిన ఆసుపత్రికి తరలించాలి.  
అవసరమైన రోగులకు పల్స్‌ ఆక్సిమీటర్, థర్మామీటర్‌ అందుబాటులో ఉంచాలి. శిక్షణ పొందిన సిబ్బంది కూడా ఉండాలి.  
ప్రయాణికులు ఆప్రాన్‌ వాడాల్సిన అవసరంలేదు. అయితే ఎయిర్‌లైన్‌/రైల్వే కోచ్‌/షిప్‌ క్యాబిన్‌లు/బస్సులో సిబ్బంది మాత్రం ఎల్లప్పుడూ మాస్క్‌లు, ఫేస్‌ షీల్డ్, గ్లౌజులు ధరించాలి. ఇతర తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.  
విమానాలు/రైళ్లు/నౌకలు/బస్సులను క్రమం తప్పకుండా శానిటైజ్‌ చేయాలి. 
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య విమానాలు, రైలు, రహదారి ద్వారా జరిగే అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.  
ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో ప్రవేశించడానికి ముందు ఆర్‌టీపీసీఆర్‌ లేదా యాంటీజెన్‌ పరీక్షలు అవసరమైతే, విస్తృతంగా ప్రచారం చేయాలి. అయితే కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులను వేసుకున్నవారిని మినహాయించాలి.  

>
మరిన్ని వార్తలు