తెలంగాణకు భారీగా పీపీఈ కిట్లు, మాస్కులు

4 Aug, 2020 08:37 IST|Sakshi

ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్ర ఆరోగ్య శాఖ సమాధానం  

సాక్షి, హైదరాబాద్ ‌: కరోనా సాయం విషయంలో కేంద్రం తెలంగాణకు భారీగానే చేయూతనందించింది. ఈ విషయం కేంద్ర ఆరోగ్య శాఖ స్వయంగా వెల్లడించింది. తెలంగాణకు కరోనా విషయంలో వైద్య పరంగా ఎలాంటి సహాయం అందించారో అన్న విషయంపై కోదాడకు చెందిన జలగం సుధీర్‌ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి స్పందించిన కేంద్రం.. కరోనా సాయంలో భాగంగా తెలంగాణకు 1,400 వెంటిలేటర్లు, 10.9 లక్షల పీపీఈ కిట్లు, 2.44 లక్షల ఎన్‌–95 మాస్కులు, 42.50 లక్షల హైడ్రాక్సి క్లోరోక్విన్‌ మాత్రలు అందజేసినట్లు వివరించింది. హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌ అనే సంస్థకు ఈ ప్రొక్యూర్‌మెంట్‌–డిస్ట్రిబ్యూషన్‌ బాధ్యతలు అప్పజెప్పినట్లు.. ఆ సంస్థ ద్వారా మాస్కులు, కిట్లు ఇతర సాయాలు తెలంగాణకు పంపినట్లు తెలిపింది.(కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి)

కుటుంబసభ్యులకు కరోనా బాధితుల సమాచారం
గాంధీ ఆస్పత్రి : గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు అందిస్తున్న వైద్యసేవలు, క్షేమ సమాచారాన్ని కుటుంబసభ్యులకు అందించాలని వైద్యమంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. వైద్య ఉన్నతాధికారులతో కలిసి సోమవారం సాయంత్రం ఆయన గాంధీ ఆస్పత్రిని సందర్శించి ఆస్పత్రి పాలనా యంత్రాంగం, పలు విభాగాల హెచ్‌ఓడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆస్పత్రిలో ఉన్న బాధితుల సమాచారం తెలియక కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారని దృష్టికి వచ్చిందన్నారు. సమస్యను పరిష్కరించేందుకు రోజూ రెండుసార్లు బాధితుల సమాచారాన్ని కుటుంబసభ్యులకు ఫోన్‌ద్వారా వివరించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు