ప్రతి దివ్యాంగుడికి విశిష్ట గుర్తింపుకార్డు 

11 Oct, 2021 00:50 IST|Sakshi

సదరం సర్టిఫికెట్లతో అనుసంధానం

క్షేత్రస్థాయిలో మొదలైన కార్డుల జారీ ప్రక్రియ 

ఈ కార్డులు ఆధార్‌ తరహాలో దేశంలో ఎక్కడైనా చెల్లుబాటు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి దివ్యాంగుడికి విశిష్ట వికలత్వ ధ్రువీకరణకార్డును కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి పౌరుడికి ఆధార్‌కార్డు ఇస్తున్నట్లుగా దేశంలోని దివ్యాంగులకు యూనిక్‌ డిజెబులిటీ ఐడీ(యూడీఐ) జారీచేస్తోంది. ఈ కార్డుల జారీ నేపథ్యంలో రాష్ట్రంలోని వికలాంగులకు ప్రకత్యేక పరీక్షలు లేకుండా సదరం(వికలత్వ ధ్రువీకరణ) సర్టిఫికెట్లతో వీటిని అనుసంధానం చేయాలని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ నిర్ణయించింది.

ఈ క్రమంలో ఇప్పటికే సదరం సర్టిఫికెట్లు ఉన్న వారందరికీ స్వయంచాలిక(ఆటోమెటిక్‌) పద్ధతిలో వీటిని జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా సదరం సర్వర్‌ను కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌కు అనుసంధానం చేసింది. ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈ కార్డుల జారీ ప్రక్రియను రాష్ట్ర వికలాంగుల సంక్షేమశాఖ ప్రారంభించింది. 

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్ల పథకం కోసం సదరం సర్టిఫికెట్లను జారీచేస్తోంది. ఈ ధ్రువీకరణపత్రం ఆధారంగానే పింఛన్లు జారీచేస్తున్నారు. కనీసం 50 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారణ అయిన వారికే సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,98,656 మంది సదరం సర్టిఫికెట్లు తీసుకున్నట్లు రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.  

ఏడాది చివరికల్లా నూరు శాతం కార్డులు జారీ  
యాభై శాతం కంటే తక్కువ వికలత్వం ఉన్నవారికి ఈ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో చాలామంది దివ్యాంగులు ఈ జాబితాలోకి రాలేదని దివ్యాంగుల సంఘాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సదరం సర్టిఫికెట్లు పొందిన ప్రతిఒక్కరికీ యూడీఐ కార్డులు జారీ చేయనున్నట్లు వికలాంగుల సంక్షేమ శాఖ చెబుతోంది. ఇప్పటికే పలువురికి కార్డులు జారీ చేయగా, ఈ ఏడాది చివరికల్లా నూరు శాతం కార్డులు జారీ చేసేలా ఆ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

కేంద్ర ప్రభుత్వం ద్వారా జారీ చేస్తున్న యూడీఐ కార్డులను దేశంలో ఎక్కడైనా గుర్తింపుకార్డు కింద పరిగణిస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ కార్డుకు ఆధార్‌ నంబర్‌ను కూడా అనుసంధానం చేయనున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. కేంద్రం అమలు చేసే పథకాలకు ఈ కార్డులే ప్రామాణికం కానున్నాయి.  

మరిన్ని వార్తలు