ఉగ్రవాదులకు టెర్రర్‌, గాల్లో తిరిగే ఏకే-47గన్స్ వచ్చేస్తున్నాయ్‌

30 Jun, 2021 02:30 IST|Sakshi

విమానాలు, హెలికాప్టర్లలా గాలిలో ఎగర గలిగి, రిమోట్‌తో ఆపరేట్‌ చేసే వాహనాలే ‘మానవ రహిత విమానాలు (అన్‌మ్యాన్‌డ్‌ ఏరియల్‌ వెహికల్స్‌– యూఏవీలు)’. సింపుల్‌గా డ్రోన్లు అంటాం. అరచేతిలో పట్టే చిన్న డ్రోన్ల నుంచి చిన్నసైజు విమానాల వంటివి, హెలికాప్టర్లలా గాల్లో నిటారు గా ఎగిరేవి, విమానాల్లా రన్‌వేపై ప్రయాణించి ఎగిరేవి కూడా ఉంటాయి. ఇందులో విమానాల్లా ప్రయానించే మధ్యతరహా, భారీ డ్రోన్లు కిలోలకొద్దీ బరువును మోసుకుని,  పదుల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. ఉగ్రవాద సంస్థలు ఇలాంటి డ్రోన్లను ఆయుధాలు, బాంబులు చేరవేయడానికి చాలాకాలంగా వాడుతున్నాయి. పలుచోట్ల దాడులూ చేస్తున్నాయి. ఇప్పుడు మనదేశంలోనూ తొలిసారిగా డ్రోన్లతో ఉగ్రవాద దాడి జరిగింది.

ఎదుర్కొనేది ఎలా?
విమానాల తరహాలో ప్రయాణించే డ్రోన్లు గంటకు 60–70 కిలోమీటర్ల కన్నా వేగంగా కూడా దూసు కెళ్తాయి. సైనికులు తుపాకులతో అలాంటి వాటిని నేలకూల్చడం కష్టం. వాటిని కూల్చేందుకు యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ ఉండాలని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు ఎప్పటినుంచో ఆ వ్యవస్థలను వినియోగిస్తున్నాయి. యాంటీ డ్రోన్‌ వ్యవస్థలు, పరికరాలను ఇజ్రాయెల్‌  ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. ఈ వ్యవస్థలు ఆయా ప్రాంతాల్లో రాడార్, ఆప్టికల్, థర్మల్‌ ఇమేజింగ్‌ ద్వారా నిఘా పెడతాయి. ఎటువంటి డ్రోన్‌ ఆచూకీ కనిపించినా వెంటనే హెచ్చరిస్తాయి. వాటిని గాల్లోనే పేల్చివేయగలిగే ఏర్పాటు ఉంటుంది.
చదవండి కరోనా వ్యాక్సిన్‌ బదులు కుక్క కాటు టీకా

2019 సెప్టెంబర్‌లో యెమెన్‌ తిరుగుబాటుదా రులు సౌదీలోని భారీ చమురు కేంద్రాలపై పది డ్రోన్లతో బాంబు దాడి చేశారు. ఆ దెబ్బతో కొద్ది రోజులు సౌదీలో చమురు ఉత్పత్తి సగానికి పడిపో యి, భారీ నష్టం వాటిల్లింది. అప్పటి నుంచి చాలా దేశాలు యాంటీ డ్రోన్‌ వ్యవస్థలు వాడుతున్నాయి. తాజాగా జమ్మూలో డ్రోన్‌ దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా మిలటరీ ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ తయారీ ‘స్మాష్‌ 2000 ప్లస్‌’ యాంటీ డ్రోన్‌ పరికరాలను అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి.

ఏమిటీ ‘స్మాష్‌ 2000 ప్లస్‌’?
సాధారణంగా తక్కువ ఎత్తులో ప్రయాణించే డ్రోన్లను రాడార్‌ వ్యవస్థలు గుర్తించలేవు. కాపలా ఉండేవారే డ్రోన్లను గుర్తించి నేలకూల్చాలి. ఇందుకు సాధారణ తుపాకులు, ఆయుధాలు పనికిరావు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ ‘స్మాష్‌ 2000 ప్లస్‌’ పరికరాలను అభివృద్ధి చేసింది. చిన్నగా ఉండే వీటిని ఏకే–47 వంటి తుపాకులకు అమర్చి వినియోగించవచ్చు. పగలు, రాత్రి ఎప్పుడైనా సరే ఆయా ప్రాంతాల్లో ఆకాశాన్ని జల్లెడ పడుతూ.. డ్రోన్లను గుర్తించి, అప్రమత్తం చేస్తాయి. వాటికి నేరుగా గురిపెట్టి, కచ్చితంగా నేల కూల్చేందుకు తోడ్పడుతాయి. వీటిని ఆటోమేటిగ్గా పనిచేసేలా, లేదా సైనికులు ఆపరేట్‌ చేసేలా మార్చుకోవచ్చు. ఆటోమేటిక్‌ మోడ్‌ను వినియోగించినప్పుడు.. తుపాకీని డ్రోన్‌ వైపు గురిపెడితే.. లక్ష్యానికి సూటిగా రాగానే దానంతట అదే బుల్లెట్స్‌ను ఫైర్‌ చేస్తుంది. మన నావికా దళం ఇప్పటికే స్మాష్‌ యాంటీ డ్రోన్‌ వ్యవస్థలకు ఆర్డర్‌ ఇచ్చింది.

యాంటీ మిస్సైల్‌ వ్యవస్థలు ఉన్నా.
ఇజ్రాయెల్‌కు చెందిన ఐరన్‌ డోమ్, మరికొన్ని యాంటీ మిస్సైల్‌ వ్యవస్థలు కూడా డ్రోన్లను గుర్తించి సెకన్లలోనే పేల్చివేయగలుగుతాయి. కానీ అవి భారీ సైజు, విపరీతమైన ఖర్చుతో కూడినవి. అన్నిచోట్ల మోహరించడం సాధ్యం కాదు. అందువల్లే రేడియో ఫ్రీక్వెన్సీ, థర్మల్‌ ఇమేజింగ్‌ పరికరాలపై ఆధారపడక తప్పదని నిపుణులు చెప్తున్నారు. ఈ రెండు విధానాల్లో కూడా డ్రోన్లను గుర్తించి, కూల్చేసేందుకు మనుషుల ప్రమేయం అవసరం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

పాకిస్తాన్‌ నుంచి తుపాకులు, బాంబులు
జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ వైపు నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, బాంబులు సరఫరా చేస్తున్నారు. అలాంటి ఒక డ్రోన్‌ను గత ఏడాది జూన్‌ 20న బీఎస్‌ఎఫ్‌ గుర్తించి, నేల కూల్చింది. ఆ డ్రోన్‌ అమెరికా తయారీ గన్, భారీగా తూటాలు, ఏడు చైనా తయారీ గ్రనేడ్లను మోసుకొస్తున్నట్టు గుర్తించారు. ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని.. కాపలా తక్కువగా ఉండే ప్రాంతాల్లో, అర్ధరాత్రి తర్వాత ఆయుధాలు చేరవేస్తున్నారని తేల్చారు. గత రెండేళ్లలో పాకిస్తాన్‌ వైపు నుంచి 300కుపైగా డ్రోన్లు సరిహద్దులు దాటివచ్చి చక్కర్లు కొట్టినట్టు ఆర్మీ లెక్కలు చెప్తున్నాయి.     – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

డ్రోన్లు.. ఐదు కేటగిరీలు..
‘డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ)’ మార్గదర్శకాల ప్రకారం దేశంలో డ్రోన్లను ఐదు కేటగిరీలు. 250 గ్రాముల కంటే తక్కువ బరువు ఉండేవి నానో డ్రోన్లు. వీటి వినియోగానికి సంబంధించి పెద్దగా ఆంక్షలు ఏమీ లేవు. అయితే నిషేధిత ప్రాంతాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు. 

250 గ్రాముల నుంచి 2 కేజీల వరకు ఉండేవి మైక్రో కేటగిరీలోకి.. 2–25 కేజీల మధ్య ఉండేవి చిన్నతరహా.. 25–150 కిలోల మధ్య బరువుండే వి మధ్య తరహా.. 150 కిలోలకన్నా ఎక్కువ బరువున్నవి పెద్ద డ్రోన్ల కేటగిరీలోకి వస్తాయి.

► నానో, మైక్రో డ్రోన్లు హెలికాప్టర్ల తరహాలో రోటార్‌ బ్లేడ్లతో ఎగురుతాయి. మధ్యతరహా, భారీ డ్రోన్లలో చాలా వరకు విమానాల తరహాలో ప్రయాణించే ‘యూఏవీ’లు ఉంటాయి. చిన్నతరహా డ్రోన్లలో రెండు రకాలూ ఉంటాయి. 

► ఏ డ్రోన్‌ అయినా 50 అడుగులకన్నా తక్కువ ఎత్తులో ఎగుర వేసేందుకు పెద్దగా ఆంక్షలు లేవు. అంతకన్నా ఎక్కువ ఎత్తు ఎగరవేయాలంటే డీజీసీఐ అనుమతి, డ్రోన్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. 
► డీజీసీఐకి చెందిన డిజిటల్‌ స్కై యాప్‌ ద్వారా డ్రోన్ల రిజిస్ట్రేషన్, ఎగురవేసే అనుమతులు తీసుకోవచ్చు.  

మరిన్ని వార్తలు