రాష్ట్రవ్యాప్తంగా ‘కార్పొరేట్‌’ వైద్యం

23 Feb, 2021 00:47 IST|Sakshi

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రోత్సాహం

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

పీపీపీ మోడల్‌లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు

ముఖ్యమైన జిల్లాల్లో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లు

ప్రైవేట్‌లో ఆయుష్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు

జిల్లా ఆసుపత్రుల్లో 3 నెలలు మెడికల్‌ పీజీల సేవలు 

అమలు కోసం రాష్ట్రాలకు కేంద్రం  సూచన

సాక్షి, హైదరాబాద్‌: అన్ని జిల్లాల్లోనూ ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రులను నెలకొల్పేలా ప్రోత్సహిం చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంపై నూతనంగా తీసుకున్న అనేక నిర్ణయాలను రాష్ట్రాలకు తెలియజేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహాయక వైద్య సేవల్లోనూ ప్రైవేట్‌ రంగాన్ని ముందుకు తీసుకురానున్నారు. ఇక జిల్లా రెసిడెన్సీ పథకం కింద పీజీ మెడికల్‌ విద్యార్థులంతా తప్పనిసరిగా మూడు నెలలపాటు జిల్లా ఆసుపత్రుల్లో పనిచేయాలని ఆదేశిం చింది.

మరోవైపు ముఖ్యమైన జిల్లాల్లో క్రిటికల్‌ కేర్‌ ఆసుపత్రి బ్లాక్‌లను ఏర్పాటు చేస్తారు. మున్ము ందు కరోనా వంటి మహమ్మారులు ఎలాంటివి విజృంభించినా వాటిని ఎదుర్కొనేందుకు వీటిని ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటు చేస్తారు. ఆ మేరకు తెలంగాణలో దాదాపు 20 జిల్లాల్లో ఇవి ఏర్పాటయ్యే అవకాశముంది. వీటిని కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులతో నెలకొల్పుతారు. గత పదేళ్లలో 75% కొత్త వ్యాధులు జంతువులు లేదా వాటి ఉత్పత్తుల ద్వారా ప్రబలినట్లు గుర్తించారు. గతేడాది ప్రపంచంలో కరోనాతోపాటు 60కు పైగా అంటువ్యాధు లు జనంపై దాడి చేశాయి. అందువల్ల జిల్లాల్లో క్రిటికల్‌ కేర్‌ ఆసుపత్రుల బ్లాక్‌లను ఏర్పాటు చేస్తారు. 

25 లక్షల ఎకరాల్లో ఔషధ మొక్కల సాగు
దేశవ్యాప్తంగా 25 లక్షల ఎకరాల్లో అత్యంత విలువైన ఔషధ మొక్కల సాగును చేపట్టనున్నారు. రైతులను, రైతు ఉత్పత్తిదారుల సంఘాలను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఇందులో భాగస్వామ్యం చేస్తారు. ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించ డం, పండించే సమయంలో నిర్వహణ, వాటికి అవసరమైన మార్కెట్‌ సదుపాయాల కోసం కేంద్రం రూ. 4 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని కోరింది. తెలంగాణలో దాదాపు లక్ష ఎకరాల్లో ఔషధ మొక్కల సాగుకు అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. 

ఆయుష్‌ గ్రిడ్‌... 
డిజిటల్‌ ప్లాట్‌ఫాంపై ఆయుష్‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తారు. ఆయుష్‌ రంగంలో వైద్య సదుపాయాలు కల్పించడం, ఆస్పత్రులు, లేబొరేటరీలు ఏర్పా టు చేయడం దీని ఉద్దేశం. భారతీయ సంప్రదాయ వైద్యానికి అంతర్జాతీయ స్థాయి కల్పనకు ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి గ్లోబల్‌ సెం టర్‌ను ఏర్పాటు చేస్తారు. ‘జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా ఆయుష్‌ రంగంలో నైపుణ్యాభివృద్ధి జరగాలి. ప్రైవేట్‌లో ఆయుష్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పాలి. అందుకోసం ఆయుష్‌ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాలి. ఆయుష్‌ వైద్య విద్యలో నాణ్యత, ప్రమాణాలను పెంచడం కోసం ప్రత్యేక వ్యవస్థలను నెలకొల్పాలి’అని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా 12,500 ఆయుష్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. 100 జిల్లాల్లో... జిల్లాస్థాయి ఆయుష్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తారు.

అన్ని జిల్లాల్లో ప్రజారోగ్య లేబరేటరీలు
అన్ని జిల్లాల్లోనూ సమగ్ర ప్రజారోగ్య లేబరేటరీలను నెలకొల్పుతారు. వాటిల్లో వైద్య పరీక్షలు చేస్తారు. 2022 డిసెంబర్‌ నాటికి దేశంలో లక్షన్నర హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. అందులో 11,024 సెంటర్లను అర్బన్‌ మురికివాడల్లో ఏర్పాటు చేస్తారు. ఆయా వెల్‌నెస్‌ సెంటర్లలో 12 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండటానికి ఏంచేయాలన్న దానిపై దృష్టిపెడతారు. అందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేస్తారు. సరైన తిండి (ఈట్‌ రైట్‌), ఫిట్‌ ఇండియా, యోగాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అత్యవసర మందులు, వైద్య పరీక్షలూ ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. అలాగే దేశంలో మరిన్ని బల్క్‌ డ్రగ్‌ పార్కులు, మెడికల్‌ డివైజెస్‌ పార్కులను వచ్చే మూడేళ్లలో ఏర్పాటు చేయాలి. ఫార్మా టెక్నాలజీని ఆధునీకరించాలని కేంద్రం నిర్ణయించింది.

మరిన్ని వార్తలు