ప్రాజెక్టుల వ్యయాలు చెప్పండి 

14 Aug, 2020 02:41 IST|Sakshi

రాష్ట్రానికి కేంద్రం ఆదేశం

పాత, కొత్త ప్రాజెక్టుల వ్యయాలు, సవరించిన అంచనాలు తెలపాలని లేఖ

అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి ముందే వివరాల సేకరణ  

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరిస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రాజెక్టుల వివరాలన్నింటినీ ఒక్కొక్కటిగా సేకరిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టులకు బోర్డులు, కేంద్ర జల సంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌తోపాటు పర్యావరణ అనుమతుల వివరాలను కోరింది. తాజాగా తెలంగాణలో రెండు నదీ బేసిన్‌లలోని కొత్త, పాత ప్రాజెక్టుల అంచనా వ్యయాలు, సవరించిన అంచనాలు, చేసిన ఖర్చు వివరాలను కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. వీలైనంత త్వరగా ఈ వివరాలను సమర్పించాలని ఆదేశించింది. 

అపెక్స్‌కు ముందే అన్నీ సేకరణ... 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య జల వివాదాలు మొదలైన అనంతరం ప్రాజెక్టుల వివరాలన్నింటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కృష్ణా, గోదావరిపై అపెక్స్‌ కౌన్సిల్, గోదావరి బోర్డు, కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా కాళేశ్వరం సహా ఏడు ఎత్తిపోతల పథకాలను నిలుపుదల చేయాలని బోర్డులు గతంలోనే రాష్ట్రాన్ని ఆదేశించగా ఇటీవలే కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సైతం లేఖ రాశారు. ఇందులో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సీడబ్ల్యూసీ సలహా కమిటీ 2018 జూన్‌లో 2 టీఎంసీల తరలింపునకే అనుమతి ఇచ్చింది. కానీ ఆ పథకాన్ని విస్తరించి 3 టీఎంసీలు తరలించేలా తెలంగాణ ప్రభుత్వం పనులు మొదలు పెట్టిందని, దీనికి ఆమోదం లేదనే విషయాన్ని కేంద్రం గుర్తుచేసింది.

ఈ ఏడు ప్రాజెక్టులతోపాటే కృష్ణా నదిపై చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, కల్వకుర్తి, భక్త రామదాస వంటి ప్రాజెక్టుల్లో ఎన్నింటికి పర్యావరణ అనుమతులు ఉన్నాయో డీపీఆర్‌లు సమర్పించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే కొత్తగా రెండు నదీ బేసిన్‌లలోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, ఆ సమయంలో ప్రాజెక్టుల అంచనా వ్యయాలు, తర్వాత సవరించిన అంచనాలు, ఇందులో ఇంతవరకు చేసిన ఖర్చు వివరాలను తమకు అందజేయాలని రాష్ట్రాన్ని కోరింది. ఇప్పటికే తమ వద్ద అంచనాల వివరాలను పేర్కొన్న కేంద్రం... ఇందులో కాళేశ్వరం అంచనా వ్యయం రూ. 80,150 కోట్లు, పాలమూరు–రంగారెడ్డి అంచనా వ్యయం రూ. 35,200 కోట్లుగా ఉందని పేర్కొంది. ఈ ప్రాజెక్టులతోపాటు దేవాదుల, సీతారామ వంటి పథకాలపై కొత్త అంచనా వ్యయాలను అధికారికంగా ధ్రువీకరించేందుకే కేంద్రం అంచనా వ్యయాల వివరాలు కోరిందన్న చర్చ జలవనరుల శాఖ వర్గాల్లో జరుగుతోంది.   

మరిన్ని వార్తలు