మార్చి వరకు ఉచిత బియ్యం!

30 Oct, 2020 01:21 IST|Sakshi

పంపిణీ పొడిగింపు యోచనలో కేంద్రం

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా  నుంచి పేదలు ఇంకా పూర్తిగా కోలుకోని దృష్ట్యా పేదలకు ప్రస్తుతం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై వచ్చే నెల తొలి లేదా రెండో వారంలో కేంద్రం ప్రకటన చేస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద పేదలకు పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం గడువు నవంబర్‌తో ముగియనుంది. అయితే పేద, మధ్యతరగతి కుటుంబాల ఆదాయాలు క్షీణించడం, వరదలతో పంటనష్టం సంభవిం చడం, నిర్మాణ రంగం ఇంకా కోలుకోక వలస కార్మికులు దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తుండటంతో ఉచిత బియ్యం పంపిణీని కొనసాగించాలంటూ వివిధ రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో పౌర సరఫరాలు, ఆర్థిక శాఖల అధికారులతో కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

కరోనా వేళ ఆదుకునేందుకు... 
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మార్చి నుంచి విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పో యిన పేద, మద్య తరగతి రేషన్‌ కార్డుదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి 3 నెలలపాటు ఉచితంగా ఒక్కొక్కరికీ 5 కిలోల బియ్యంతోపాటు కార్డున్న ఒక్కో కుటుంబానికి కిలో చొప్పున కందిపప్పు పంపిణీ చేసింది. రాష్ట్రంలో మొత్తంగా 2.80 కోట్ల మంది రేషన్‌ లబ్ధిదారులు ఉండగా వారిలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 1.91 కోట్ల మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న 5 కిలోల ఉచిత బియ్యానికి అదనంగా మరో 7 కిలోలు కలిపి మొత్తంగా 12 కిలోలు అందించింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసినా పేదలకు సరైన ఉపాధి లభించట్లేదు. ఈ నేపథ్యంలోనే ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీని మార్చి వరకు పొడిగించాలని ఉత్తరాది రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు