రోడ్డు మారేటప్పుడూ ‘ఎక్స్‌ప్రెస్‌ వే’గమే!

6 Jun, 2022 02:12 IST|Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌పై ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే తరహా ఇంటర్‌ఛేంజ్‌లు

ప్రస్తుత డిజైన్లు మార్చాలని ఢిల్లీ ఎన్‌హెచ్‌ఏఐ ఆదేశం

రెండో డిజైన్‌ సిద్ధం చేసి పంపిన కన్సల్టెన్సీ సంస్థ

50 కి.మీ.కిపైగా వేగంతో వాహనాలు వెళ్లినా ఇబ్బంది లేకుండా డిజైన్‌  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)ను దేశంలోనే ఆధునిక రాజమార్గంగా నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో ప్రస్తుతం అత్యంత భారీ ఎక్స్‌ప్రెస్‌ వేగా పేర్కొంటున్న ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌ వేపై నిర్మిస్తున్న ఇంటర్‌ఛేంజ్‌ల కంటే మెరుగ్గా దీనిపై ఇంటర్‌ఛేంజ్‌లను డిజైన్‌ చేస్తోంది.

 రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన 158.64 కి.మీ. నిడివిగల రహదారిలో 11 చోట్ల జాతీయ/రాష్ట్ర రహదారులను దాటుతున్నందున ఆయా ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్‌లను నిర్మించనుండటం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే రూపొందించిన డిజైన్లను పరిశీలించిన ఢిల్లీ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు... మరింత విశాలమైన నిర్మాణాల కోసం కొత్త డిజైన్లను రూపొందించాలని ఆదేశించడంతో కన్సల్టెంట్‌ సంస్థ వాటిని ఎన్‌హెచ్‌ఏఐ పరిశీలనకు పంపింది. 

తొలుత 60 ఎకరాల్లో.. రెండోది 75 ఎకరాల్లో.. 
ఎక్స్‌ప్రెస్‌ వేగా ఉండే రింగురోడ్డుపై 120 కి.మీ. వేగంతో వాహనాలు దూసుకెళ్లేలా రోడ్డును డిజైన్‌ చేస్తారు. సాధారణ రోడ్లు–ఎక్స్‌పెస్‌ వే మధ్య మారేందుకు వీలుగా నిర్మించే ఇంటర్‌ఛేంజ్‌లపై ఆ వేగం 30–40 కి.మీ. మధ్య మాత్రమే ఉంటుంది. ఔటర్‌ రింగురోడ్డుపై అలాగే డిజైన్‌ చేశారు. ప్రస్తుతం నిర్మించబోయే రీజినల్‌ రింగురోడ్డుపైనా అదే స్థాయిలో ఇంటర్‌ఛేంజ్‌లను తొలుత డిజైన్‌ చేశారు.

ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఇప్పుడు ఇంటర్‌ఛేంజర్లపైనా వాహనాలు కనీసం గంటకు 50 కి.మీ. వేగంతో వెళ్లేలా కొత్త డిజైన్‌లను రూపొందించారు. ఇంటర్‌ఛేంజ్‌ మలువుల వద్ద వేగం 30–40 కి.మీ. మధ్యలో ఉండాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాటి వేగం 50 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోయినా ఇబ్బంది లేకుండా 75 మీటర్ల ముందు నుంచి రోడ్డు మలుపు తిరిగేలా కొత్త డిజైన్‌ రూపొందించారు.

పాత డిజైన్‌లో 60 మీటర్ల ముందు మలుపు ప్రారంభమయ్యేలా ఉంది. పాత డిజైన్‌ ప్రకారం ఇంటర్‌ఛేంజ్‌ నిర్మాణానికి 60 ఎకరాల స్థలం సరిపోయేది. కొత్త డిజైన్‌ ప్రకారం 70 ఎకరాలకుపైగా అవసరం కానుంది. ఈ రెండు డిజైన్లు పరిశీలిస్తున్న ఎన్‌హెచ్‌ఏఐ వాటి ల్లో ఏయే ప్రాంతాల్లో ఏయే డిజైన్ల ప్రకారం రోడ్డు నిర్మించాలనే విషయాన్ని ఖరారు చేయనుంది. 

వచ్చే వారం సర్వే షురూ.. 
ఆందోల్‌–జోగిపేట ఆర్డీఓ పరిధిలో 108.9491 హెక్టార్లు, చౌటుప్పల్‌ ఆర్డీఓ పరిధిలో 300.3820 హెక్టార్లు, యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్‌ పరిధిలో 208.6090 హెక్టార్ల భూసేకరణకు వీలుగా ఏప్రిల్‌ 19న 3ఏ (క్యాపిటల్‌) నోటిఫికేషన్‌కు సంబంధించిన గెజిట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రాజెక్టులో ఇది రెండో గెజిట్‌. భూసేకరణకు సంబంధించి ఒక అదనపు కలెక్టర్, ఏడుగురు ఆర్డీఓలను నియమించగా ముగ్గురి పరిధికి సంబంధించే ఈ గెజిట్‌ను విడుదల చేశారు.

ఇంటర్‌చేంజర్ల డిజైన్ల మార్పు నేపథ్యంలో మిగతా ఆర్డీఓల పరిధిలోని భూమికి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. డిజైన్లు పూర్తయినందున మిగతా ప్రాంతాలకు సంబంధించి, గెజిట్‌ విడుదలైన మూడు ప్రాంతాలకు సంబంధించి అదనపు గెజిట్‌ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే గెజిట్‌ విడుదలైన మూడు ప్రాంతాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వచ్చే వారం ప్రారంభం కానుంది. రెవెన్యూ అధికారులు ఫీల్డ్‌కు వెళ్లి రోడ్డు అలైన్‌మెంట్‌ ప్రకారం 100 మీటర్ల వెడల్పుతో సేకరించే భూమికి హద్దులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (డీజీపీఎస్‌) యంత్రాలతో ఉపగ్రహ సహకారంతో నిర్వహిస్తారు.   

మరిన్ని వార్తలు