ఊరట: సాగు విద్యుత్‌కు మీటర్లపై కేంద్రం వెనక్కి

7 Jul, 2021 02:04 IST|Sakshi

కనెక్షన్లు మారుమూల ప్రాంతాల్లో ఉండటంతోనే..

దాని బదులు ఫీడర్లకు మీటర్లు బిగించాలని రాష్ట్రాలకు స్పష్టీకరణ

అమృత్‌ పట్టణాలు, అధిక నష్టాలున్న ప్రాంతాల్లో తొలి విడతగా అమలు

ఎంఎస్‌ఎంఈలు, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు ఇక స్మార్ట్‌ మీటర్లే

డిస్కంల ఆర్థిక పునర్‌ వ్యవస్థీకరణకు కేంద్రం కొత్త పథకం  

రాష్ట్రంలోని 25 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల కింద పంటలు సాగు చేస్తున్న అన్నదాతలకు కేంద్రం నిర్ణయంతో ఊరట కలగనుంది. రైతులు మినహా ఇతర అన్ని కేటగిరీల విద్యుత్‌ వినియోగదారులకు ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల బిగింపు ప్రక్రియ నిర్దేశిత గడువుల్లోగా పూర్తయ్యేలా కేంద్రం నిరంతరం సమీక్షించనుంది. 

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు బిగించాలన్న షరతులపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ప్రత్యామ్నాయంగా వ్యవసాయ విద్యుత్‌ సరఫరా ఫీడర్లకు మీటర్లు ఏర్పాటు చేయాలని స్పష్టతనిచ్చింది. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు మారుమూల ప్రాంతాల్లో ఉండటంతోపాటు వాటి స్వభావాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే వ్యవసాయ ఫీడర్లను వేరు చేసి ‘కుసుం’పథకం కింద వాటిని సౌర విద్యుదీకరించాలని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ‘కుసుం’కింద రైతులు తమ పంట పొలా ల్లో సౌర విద్యుత్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకొని గ్రిడ్‌తో అనుసంధానిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వనున్నా యి.

వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్‌ ద్వారా రైతులకు పగటిపూట ఉచిత/చౌక విద్యుత్‌ లభించనుందని, దీంతో వారి ఆదాయం పెరుగుతుందని కేంద్రం పేర్కొంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్రం రూ.3.03 లక్షల కోట్ల ఆర్థిక సహాయంతో కొత్త పథకాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 10 వేల వ్యవసాయ ఫీడర్లను వేరు చేయడానికి రూ. 20 వేల కోట్లు కేటా యించింది. వ్యవసాయ ఫీడర్లను వేరు చేసి కేంద్రం సూచనల మేరకు వాటికి మీటర్లను బిగించడానికి ఇప్పటికే రాష్ట్ర డిస్కంలు కసరత్తు ప్రారంభించాయి.

100% స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు.. 
వ్యవసాయ వినియోగదారులు మినహా ఇతర అన్ని కేటగిరీల విద్యుత్‌ వినియోగదారులందరికీ పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో  ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించాలని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 25 కోట్ల వినియోగదారులను ఈ కొత్త పథకం అమలు కాలంలో ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటరింగ్‌ పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యం పెట్టుకోగా తొలి విడతలో 10 కోట్ల ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను 2023 డిసెంబర్‌లోగా ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి విడతగా అన్ని అమృత్‌ నగరాలు, 15 శాతం, ఆపై విద్యుత్‌ నష్టాలున్న ప్రాంతాలు, ఎంఎస్‌ఎంఈలు, ఇతర పారిశ్రామిక, వాణిజ్య కేటగిరీ వినియోగదారులు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్‌ స్మార్ట్‌మీటర్లు బిగించాల్సి ఉండనుంది. వినియోగదారులకు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు తోడుగా ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల స్థాయిల్లో ‘కమ్యూనికబుల్‌ ఏఎంఐ మీటర్ల’ను ఏర్పాటు చేయాలని కోరింది. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌మీటర్లు, గ్రిడ్, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల స్థాయిల్లో ఏఎంఐ మీటర్లను ఏర్పాటు చేయడం ద్వారా కచ్చితమైన విద్యుత్‌ ఆడిటింగ్‌కు అవకాశం లభించనుంది. దీంతో ఎక్కడెక్కడ విద్యుత్‌ నష్టాలు వస్తున్నాయో గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడానికి వీలు ఉంటుందని కేంద్రం పేర్కొంటోంది. ప్రతి నెలా నివేదికలు తయారు చేసేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగించాలని సూచించింది.  

అన్ని పట్టణాల్లో ‘స్కాడా’... 
ప్రస్తుతం రాష్ట్రంలో సూపర్వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజిషన్‌ (స్కాడా) కేంద్రం ఒక్కటే ఉంది. హైదరాబాద్‌ ఎర్రగడ్డలో ఉన్న స్కాడా కేంద్రం నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో నిరంతర విద్యుత్‌ సరఫరాను సమీక్షిస్తుంటారు. ఇకపై అన్ని పట్టణాల్లో ఇలాంటి స్కాడా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం పేర్కొంది. 

కొత్త స్కీం లక్ష్యాలు.. 
► డిస్కంల సాంకేతిక, వాణిజ్యపర నష్టాల (ఏటీ అండ్‌ సీ లాసెస్‌) ప్రస్తుత జాతీయ సగటు శాతం 12–15 వరకు ఉండగా, 2024–25 నాటికి అన్ని డిస్కంల నష్టాలు ఈ మేర తగ్గాలి. 
► డిస్కంల వార్షిక విద్యుత్‌ సరఫరా వ్యయం (ఏసీఎస్‌)– వార్షిక ఆదాయ అవసరాలు (ఏఆర్‌ఆర్‌) మధ్య వ్యత్యాసం 2024–25 నాటికి సున్నాకు చేరాలి.  

మరిన్ని వార్తలు