విద్యుత్‌ సబ్సిడీలపై రాష్ట్రాలకు కేంద్రం ఆప్షన్లు

19 Aug, 2021 07:40 IST|Sakshi

త్వరలో పార్లమెంటులో విద్యుత్‌ చట్ట సవరణకు అవకాశం

నేరుగా వినియోగదారులకు నగదు బదిలీచేస్తే పూర్తి స్థాయి బిల్లులు

డిస్కంల నిర్వహణలోని వినియోగదారుల ఖాతాల్లో వేస్తే మాత్రం ఇప్పుడున్నట్టే..

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ రంగంలో సంస్కరణలను ప్రతిపాదిస్తూ చట్టసవరణ చేయనున్న కేంద్రం.. సబ్సిడీల విషయంగా రెండు ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. విద్యుత్‌ సబ్సిడీలను నేరుగా వినియోగదారుల ఖాతాల్లోనే వేయడం ఒకటికాగా.. వినియోగదారుల పేరిట విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు నిర్వహించే ఖాతాల్లో జమ చేయడం రెండోది.

ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వాటి ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని కేటగిరీల వినియోగదారులకు ఉచితంగా, మరికొన్ని కేటగిరీల్లో రాయితీపై విద్యుత్‌ సరఫరా అవుతోంది.

రాష్ట్రాల వ్యతిరేకతతో..
వాస్తవానికి విద్యుత్‌ సబ్సిడీల విషయంగా ‘నేరుగా నగదు బదిలీ (డీబీటీ)’ విధానాన్ని అనుసరించాలని కేంద్రం గత ఏడాది రూపొందించిన విద్యుత్‌ సవరణ బిల్లు ముసాయిదాలో ప్రతిపాదించింది. వినియోగదారులకు పూర్తి బిల్లులు వేయాలని, వారు ఆ బిల్లు చెల్లించాక.. రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వినియోగదారుల ఖాతాల్లో సబ్సిడీ సొమ్మును జమ చేయాలని పేర్కొంది. దీనిపై తెలంగాణ సహా పలు రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి.

ఈ విధానం అమలుచేస్తే ఒక్కసారిగా విద్యుత్‌ బిల్లులు భారీగా పెరుగుతాయని.. పేదలు చెల్లించడం కష్టంగా మారుతుందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ముసాయిదా బిల్లులో మార్పులు చేయనుందని నిపుణులు చెప్తున్నారు. సబ్సిడీలను నేరుగా వినియోగదారుల ఖాతాల్లో వేయడం, లేదా వినియోగదారుల పేరుతో డిస్కంలు నిర్వహించే ఖాతాల్లో జమ చేయడం అనే రెండు ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు.

డిస్కంల ఆధ్వర్యంలోని ఖాతాల్లో సబ్సిడీలను జమ చేస్తే.. విద్యుత్‌ బిల్లుల విధానం దాదాపుగా ప్రస్తుతం ఉన్నట్టే కొనసాగే అవకాశం ఉంటుంది. ఉచిత, రాయితీ విద్యుత్‌ పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండదు.

► వినియోగదారులు ముందుగా పూర్తి బిల్లు కట్టాక.. సబ్సిడీ సొమ్ము ఇచ్చే విధానంతో ఇబ్బంది ఎదురు కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయానికి పూర్తి గా.. ఎస్సీ, ఎస్టీల గృహాలకు నెలకు 100 యూనిట్ల వరకు.. ధోబీ ఘాట్లు, లాండ్రీలు, సెలూన్లకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. గృహ వినియోగదారులతోపాటు స్పిన్నింగ్‌ మిల్లులు, పౌల్ట్రీ ఫారాలకు రాయితీపై తక్కువ ధరలతో సరఫరా చేస్తోంది. వీరంతా ప్రస్తుతం సబ్సిడీ పోగా మిగతా బిల్లులు కడుతున్నారు. నగదు బదిలీ విధానం అమలు చేస్తే.. వీరంతా మొత్తం బిల్లులు కట్టాల్సి ఉంటుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి నగదు బదిలీ అవుతుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు