తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు షాక్‌

14 Feb, 2021 02:54 IST|Sakshi

అర్ధంతరంగా రుణాలు నిలిపేసిన కేంద్రం

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని షరతు!

విద్యుత్‌ బిల్లుకు మద్దతిస్తేనే రుణాలు పునరుద్ధరిస్తామని ఒత్తిడి?

కొత్త ప్లాంట్ల నిర్మాణంపై ప్రభావం

డిస్కంల కష్టాలు తీవ్రం  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్సీ), రూరల్‌ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ)ల నుంచి రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు రుణాల చెల్లింపులను గత నెల నుంచి కేంద్ర విద్యుత్‌ శాఖ అర్ధంతరంగా నిలుపుదల చేసింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన విద్యుత్‌ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపకపోవడం, బిల్లులోని నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు బిగిం చకపోవడం, గత నాలుగేళ్లుగా తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌) సమర్పించకపోవడం తదితర కారణాలతో ఈ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి.

యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి ప్రతినెలా విడుదల కావాల్సిన రుణాలతోపాటు ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద డిస్కంలను ఆదుకోవ డానికి కేంద్రం ప్రకటించిన రుణాలు, ప్రతి నెలా విద్యుత్‌ కొనుగోళ్ల కోసం తీసుకునే స్వల్పకాలిక రుణాలు కలిపి గత నెల నుంచి రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు రావాల్సిన మొత్తం రూ. 12,600 కోట్ల రుణాలను కేంద్రం నిలుపుదల చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.

హస్తిన వెళ్లినా లభించని ఊరట...
కేంద్రం నిలుపుదల చేసిన రుణాలను తిరిగి విడుదల చేయించుకోవడానికి తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌ రావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి. రఘుమారెడ్డి గత గురువారం ఢిల్లీ వెళ్లి కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌.కె. సింగ్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన అందుబాటులోకి లేకపోవడంతో కేంద్ర విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులను కలసి తిరిగి వచ్చి నట్లు అధికార వర్గాల సమాచారం.

కేంద్రం నిర్ధేశిం చిన లక్ష్యాల్లో భాగంగా విద్యుత్‌ బిల్లుకు మద్దతు తెలపాల్సిందేనని, వ్యవసాయ బోరుబావులకు మోటార్లు బిగించాలని, డిస్కంలకు నష్టాలు రాకుండా ఏటా విద్యుత్‌ బిల్లులు పెంచాలనే షరతులను అంగీకరిస్తేనే రుణాలను విడుదల చేస్తామని కేంద్ర అధికారులు సీఎండీలకు స్పష్టం చేసినట్లు సమాచారం. షరతుల విషయంలో కేంద్రం పట్టుదలతో ఉండటంతో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విద్యుత్‌ సంస్థల సీఎండీలకు ఊరట లభించలేదు.

విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణానికి నిధులు కటకట...
రాష్ట్రంలో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి, 1,080 మెగావాట్ల సామర్థ్యంగల భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు గత నెల నుంచి ఆర్‌ఈసీ, పీఎఫ్సీల నుంచి నెలవారీగా విడుదల కావాల్సిన రుణాలు నిలిచిపోయాయి. ప్రతి నెలా సగటున రూ. 500 కోట్ల విలువైన పనులు యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణంలో భాగంగా జరుగుతుండగా వాటికి సంబంధించిన బిల్లులను సమర్పిస్తే ఆర్‌ఈసీ, పీఎఫ్సీలు ఆ మేరకు రుణ మొత్తాన్ని గత నాలుగేళ్లుగా విడుదల చేస్తున్నాయి. తాజాగా ఈ రుణాలు నిలిచిపోవడంతో బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో తెలంగాణ విద్యుతుత్పత్తి సంస్థ (జెన్‌కో) చిక్కుకుపోయింది. ఇప్పటికే జరిగిన పనులకు సంభందించిన బిల్లులను చెల్లించకపోతే బీహెచ్‌ఈఎల్‌ సంస్థ యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణ పనులను నిలిపివేసే అవకాశం ఉందని ఇంధన శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

డిస్కంలకు నిధుల కటకట...
డిస్కంలు రూ. 12 వేల కోట్లకుపైగా విద్యుత్‌ కొనుగోళ్ల బిల్లులను విద్యుత్పత్తి సంస్థలకు బకాయి ఉన్నాయి. కేంద్రం గతేడాది రాష్ట్ర డిస్కంలకు ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద రూ. 12,600 కోట్ల రుణాలను మంజూరు చేసింది. వాటిని డిస్కంలు విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించి బకాయిలు తీర్చుకోవాల్సి ఉంది. ఈ రుణాలు మంజూరైనా తొలి రెండు విడతల కింద ఇప్పటివరకు చెలించాల్సిన రూ. 6 వేల కోట్ల రుణాలను కేంద్రం నిలిపివేసిందని అధికారులు పేర్కొంటున్నారు.

ఆర్థికంగా తీవ్ర సమస్యల్లో ఉన్న డిస్కంలకు కేంద్రం నిర్ణయం మరింత సంక్షోభంలో నెట్టనుందని అధికారులు అంటున్నారు. విద్యుత్‌ కొనేందుకు డిస్కంల వద్ద డబ్బులు లేవని, మరోవైపు బకాయిల కోసం విద్యుదుత్పత్తి సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయని ట్రాన్స్‌కో ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

సీఎంకు పరిస్థితి వివరించనున్న సీఎండీలు..
కేంద్రం అనూహ్య నిర్ణయం నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను సీఎం కేసీఆర్‌కు విద్యుత్‌ సంస్థల సీఎండీలు వివరించనున్నారు. ఈ అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలకు సంబంధించినది కావడంతో సీఎం స్థాయిలో జోక్యం చేసుకుంటే తప్ప రుణాల చెల్లింపును కేంద్రం పునరుద్ధరించే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు.  

మరిన్ని వార్తలు