మళ్లీ తెరపైకి విద్యుత్‌ బిల్లు

21 Jun, 2022 02:13 IST|Sakshi

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న కేంద్రం

విద్యుత్‌ పంపిణీ రంగం ప్రైవేటీకరణే అసలు లక్ష్యం 

కేంద్రం చెప్పుచేతల్లోకి వెళ్లనున్న విద్యుత్‌ రంగం 

ఆందోళనబాటలో విద్యుత్‌ ఉద్యోగులు  

సాక్షి, హైదరాబాద్‌: టెలికాం సేవల తరహాలో ప్రైవేటు, ప్రభుత్వ సర్వీసు ప్రొవైడర్ల నుంచి నచ్చిన వాటిని ఎంపిక చేసుకునే అవకాశాన్ని విద్యుత్‌ వినియోగదారులకు సైతం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు మళ్లీ తెరపైకి వచ్చింది. జూలైలో ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నామని, ఇందుకు సర్వసన్న ద్ధంగా ఉన్నామని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తాజాగా ప్రకటించడంతో దీనిపై మళ్లీ చర్చ ప్రారంభమైంది.

విద్యుత్‌ పంపిణీ రంగాన్ని డీలైసెన్సింగ్‌ చేయడంతో పాటు ప్రైవేటు ఫ్రాంచైజీలు, సబ్‌ లైసెన్సీలను అనుమతించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఇది అమల్లోకి వస్తే భవిష్యత్తులో రాష్ట్రాలు కేవలం బాధ్యతలకు మాత్రమే పరిమితం అవుతాయని, కీలక అధికారాలను రాష్ట్రాల నుంచి కేంద్రం తీసుకుంటుందని విమర్శలున్నాయి.  

ఇక ప్రైవేటు విద్యుత్‌ ! 
సంస్కరణ బిల్లు ఆమోదం పొందితే ప్రభుత్వరంగ విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు తమ పరిధిలోని ఏదైనా ఒక ప్రాంతంలో విద్యుత్‌ను సరఫరా చేసే బాధ్యతలను డిస్ట్రిబ్యూషన్‌ సబ్‌ లైసెన్సీలు, ఫ్రాంచైజీల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి వీలుకలగనుంది. అలాగే ఏదైనా ప్రాంతంలో డిస్కంలు తమ తరఫున విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఎవరినైనా డిస్ట్రిబ్యూషన్‌ సబ్‌లైసెన్సీలుగా నియమించుకోవచ్చు.

అయితే ఇందుకు సంబంధిత రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి పొందాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీలకు ఈఆర్సీ నుంచి లైసెన్స్‌ కానీ, అనుమతి కానీ అవసరం ఉండదు. ఫ్రాంచైజీలతో డిస్కంలు ఒప్పందం కుదుర్చుకుని ఈఆర్సీకి సమాచారం ఇస్తే సరిపోతుంది. అయితే, ఫ్రాంచైజీలకు అప్పగించిన ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు డిస్కంలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నష్టాలు బాగా వచ్చే ప్రాంతాలను డిస్కంలు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు మార్గం సుగమం కానుంది.  

సబ్సిడీలు, క్రాస్‌ సబ్సిడీలకు మంగళం..  
విద్యుత్‌ సబ్సిడీ, క్రాస్‌ సబ్సిడీల విధానానికి మంగళం పాడాలని కేంద్రం కోరుతోంది. వినియోగదారులకు ఉచితంగా/రాయితీపై విద్యుత్‌ సరఫరా చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు ప్రతి నెలా సబ్సిడీలను చెల్లిస్తోంది. మిగిలిన రాయితీ భారాన్ని క్రాస్‌ సబ్సిడీల రూపంలో పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల వినియోగదారులు భరిస్తున్నారు.

సబ్సిడీలు, క్రాస్‌ సబ్సిడీల కారణంగానే గృహాలు, ఇతర కేటగిరీల వినియోగదారులపై బిల్లుల భారం తక్కువగా ఉంటోంది. సబ్సిడీలనునగదు బదిలీ (డీబీటీ) విధానంలో వినియోగదారులకు నేరుగా ఇవ్వాలని, పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల వినియోగదారుల నుంచి క్రాస్‌ సబ్సిడీల వసూళ్ల నుంచి విరమించుకోవాలని కేంద్రం కొత్త బిల్లులో పేర్కొంది. 

ఆందోళనలో విద్యుత్‌ ఉద్యోగులు 
విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధం కావడంతో విద్యుత్‌ ఉద్యోగుల్లో ఆందోళన తీవ్రమైంది. విద్యుత్‌ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణతో తమ భవితవ్యం ప్రమాదంలో పడుతుందని ఉద్యోగులు మండిపడుతున్నారు. బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి ఉద్యోగ సంఘాలు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. బిల్లు విషయంలో కేంద్రం మొండిగా ముందుకు వెళ్తే దేశవ్యాప్త సమ్మెను ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తున్నాయి.

ఏటేటా బిల్లుల వాత..
విద్యుత్‌ సరఫరాకు డిస్కంలు చేస్తున్న మొత్తం ఖర్చులను రాబట్టుకునేలా విద్యుత్‌ టారిఫ్‌ ఉండాల్సిందేనని విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు పేర్కొం టోంది. డిస్కంల నష్టాలను పూడ్చుకోవడానికి అవసరమైన మేరకు విద్యుత్‌ చార్జీలు పెంచకుండా, ఆ నష్టాలను అలాగే భరించే ప్రస్తుత విధా నానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని తాజా బిల్లు చెబుతోంది.ఈ నిబంధనలను అమలు చేస్తే ఏటా విద్యుత్‌ చార్జీలు భారీగా పెరిగే అవకాశాలుంటాయని నిపుణులు అంటున్నారు.   

మరిన్ని వార్తలు