యాసంగి వరిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి 

30 Oct, 2021 03:00 IST|Sakshi

రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: యాసంగిలో వరి సాగుచేస్తే, ఆ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందో, లేదో కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. దొంగదీక్షలు చేసే బీజేపీ రాష్ట్ర నాయకులు యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ప్రధాని, కేంద్ర పెద్దలను ఒప్పించాలని సవాల్‌ చేశారు. పంజాబ్‌లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణ విషయంలో ఎందుకు వివక్ష చూపుతోందని ప్రశ్నించారు.

తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. రైతు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటుధర కల్పించడంతోపాటు కొనుగోలు బాధ్యత కూడా కేంద్రానిదేనని అన్నారు. కేంద్రప్రభుత్వం కేవలం మద్దతు ధర ప్రకటించి మిన్నకుండి పోతోందని, తెలంగాణ ప్రభుత్వమే రైతుల సంక్షేమం దృష్ట్యా నష్టాన్ని భరించి కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు.

పంట వచ్చిన ప్రతిసారి ధాన్యం కొనుగోళ్లపై ఎఫ్‌సీఐని అడుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతోందని విచారం వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరి వ్యవసాయానికి గొడ్డలిపెట్టులా ఉందని విమర్శించారు. కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకుంటుంటే రాష్ట్రంలోని బీజేపీ నాయకులు రాజకీయలబ్ధి కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వరి పంట వేస్తే రైతుబంధు, రైతుబీమా నిలిపివేస్తారని చేస్తున్న ప్రచారం నిరాధారమైనదని, సీఎం కేసీఆర్‌ బతికున్నంత కాలం ఈ పథకాలు కొనసాగుతాయన్నారు.  

షర్మిలను అమ్మ అనే పిలిచాను: మంత్రి 
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల పట్ల చేసిన వ్యాఖ్యలపై  మంత్రి నిరంజన్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ‘నేను ఎవరి పేరిటా ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఏకవచనం వాడలేదు. చివరన అమ్మా అని కూడా అన్నాను‘ అని మంత్రి వివరించారు. అయి నా తన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా బాధ కలిగితే విచారం వ్యక్తం చేస్తున్న ట్టు తెలిపారు. ‘షర్మిల నా కుమార్తె కంటే పెద్దది.. నా సోదరి కంటే చిన్నది’ అని పేర్కొన్నారు. తన తండ్రి సమకాలికుడైన సీఎం కేసీఆర్‌ను షర్మిల ఏకవచనంతో సంబోధించడం సంస్కారమేనా అని ప్రశ్నించారు.    

మరిన్ని వార్తలు