ఆరిపోతున్న ప్రాణదీపాలు.. ఒడిదొడుకులు, ఒత్తిళ్లను తట్టుకోలేక..

3 Aug, 2022 02:16 IST|Sakshi

పెరుగుతున్న యువ వైద్యుల బలవన్మరణాలు 

ఐదేళ్లలో వివిధ రకాల వృత్తుల్లోని వారు 3,100 మంది ఆత్మహత్య 

వీరిలో ఎక్కువమంది వైద్యులే అన్న కేంద్ర ఆరోగ్య శాఖ

ఎంబీబీఎస్‌ చేసినా ఏమీ చేయలేక, పీజీ చేసినా ప్రావీణ్యం లేక, సూపర్‌ స్పెషాలిటీలో సీట్లు రాక, వివాహాలు కాక, జీవితంలో స్థిరపడలేక మనోవేదన 

సాక్షి, హైదరాబాద్‌: వైద్య వృత్తిలో ఒడిదొడుకులు, ఒత్తిళ్లను తట్టుకోలేక అనేకమంది యువ వైద్యులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2016 నుండి 2020 మధ్య కాలంలో 18 నుండి 30 సంవత్సరాల వయస్సులో వివిధ రకాల వృత్తుల్లో ఉన్న 3,100 మంది పలు సమస్యలతో ఆత్మహత్య చేసుకోగా..  ఇందులో ఎక్కువమంది వైద్యులు ఉన్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పేర్కొంది. అదే కాలంలో వివిధ వయస్సుల వారు 12,397 మంది పరీక్షల్లో ఫెయిల్‌ అవడంతో ఆత్మహత్య చేసుకున్నారని, వీరిలోనూ  వైద్య విద్యార్థులున్నారని తెలిపింది. 

సూపర్‌ స్పెషాలిటీ చేస్తేనే.. 
వైద్య విద్య పూర్తిచేస్తే జీవితంలో హాయిగా స్థిరపడిపోవచ్చనే భావన ఉంది. కానీ వాస్తవం అందరు మెడికల్‌ విద్యార్థుల విషయంలో ఒకేలా లేదు. ఈ రోజుల్లో ఎంబీబీఎస్‌ పూర్తిచేయగానే స్థిరపడిపోయినట్లు కానేకాదు. కనీసం పీజీ లేకపోతే ఎవరూ పట్టించుకోవడం లేదు. 

స్థిరపడాలంటే 15 ఏళ్లు.. 
ఎంబీబీఎస్‌ నుంచి సూపర్‌ స్పెషాలిటీ వరకు కోర్సులు పూర్తి చేసే సరికి పదేళ్లు దాటుతుంది. అది కూడా సకాలంలో పీజీ సీటొస్తేనే. లేకుంటే అంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది. తర్వాత బయటకు వచ్చి స్థిరపడే సరికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. అంటే వైద్య వృత్తిలో స్థిరపడాలంటే మొత్తంగా 15 ఏళ్లు పడుతుందన్న మాట. మరోవైపు లక్షలు, కోట్లు ఖర్చు చేసి ఎంబీబీఎస్‌ పూర్తి చేసినా, తర్వాత మళ్లీ కోట్లల్లో డబ్బులు పెడితేనే పీజీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్య కోర్సులు చదవగలిగే పరిస్థితులు ఉన్నాయి.

ఒకవైపు పీజీ సీటు రాక.. ఇటు ఎంబీబీఎస్‌తో ఏమీ చేయలేక, జీవితం ఎలా గడపాలో తెలియక ఎందరో యువ డాక్టర్లు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) మెడికల్‌ కాలేజీల్లో యోగాను ప్రవేశపెట్టి, విద్యార్థుల్లో ఒత్తిడిని, నిరాశను తగ్గించేందుకు ప్రయత్నిస్తుండటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. 

విదేశీ గ్రాడ్యుయేట్లు ఇక్కడి పరీక్షలో ఫెయిల్‌! 
ఇక్కడ సీట్ల కొరతతో వేలాది మంది విద్యార్థులు విదేశాల్లో మెడిసిన్‌ చదువుతుండగా, దేశంలో నిర్వహించే ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ) పరీక్ష పాసయ్యేవారు 20 శాతం కూడా మించడం లేదు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో కేవలం 2,348 మంది మాత్రమే పాసయ్యారు. 

ఓ జర్నల్‌ ప్రకారం.. వైద్యుల ఆత్యహత్యకు దారితీస్తున్న పరిస్థితులు.. 
ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో మూడింట ఒక వంతు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ విద్యార్థులు కాగా మిగిలినవారు ప్రాక్టీస్‌ చేస్తున్న వైద్యులు ఉంటున్నారు. అనేక ఒత్తిళ్ల కారణంగా వీరంతా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పీజీలో ఆర్థిక భారం, వృత్తి పరమైన ఒత్తిడి, వివాహ సమస్యలు వంటివి కారణాలుగా ఉన్నాయి.  

ముఖ్యంగా ఒత్తిడికి సంబంధించిన ఆత్మహత్యలే 60 శాతం వరకు ఉంటున్నాయి.  

ఎంబీబీఎస్‌ పూర్తయి, పీజీ సీట్లు రానివారిలో చాలామంది యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. కేవలం ఎంబీబీఎస్‌తో స్థిరపడే అవకాశం లేకపోవడం వల్ల చాలామంది యువతుల తల్లిదండ్రులు వీరిపై ఆసక్తి చూపించడం లేదు.  

కొందరు ఎంబీబీఎస్‌ పూర్తి చేసినవారు పీజీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్య కోర్సులు చేశాకే పెళ్లి చేసుకోవాలని ఆగిపోతున్నారు. దీంతో వారికి 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కావడం లేదు. దీంతో వారిలో ఒత్తిడి పెరుగుతోంది.  

ఎంబీబీఎస్‌ వైద్యులు కేవలం కేర్‌టేకర్ల మాదిరిగానే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పని చేస్తుంటారు. అందుకే వారి పట్ల యాజమాన్యాలు చిన్నచూపు చూస్తూ తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. ఇది వారిని కుంగుబాటుకు గురిచేస్తోంది. 

పీజీ పూర్తయినా వెంటనే స్థిరపడిపోతామన్న గ్యారంటీ లేదు. వారి చిన్నప్పటి క్లాస్‌మేట్స్‌ కొందరు ఇంజనీరింగ్, ఐఐటీ వంటి కోర్సులు చదివి 22–23 ఏళ్లకే లక్షల్లో సంపాదిస్తుండటం వారిలో ఆత్మన్యూనతా భావన కలిగిస్తోంది.  

ప్రతి ఆత్మహత్య వెనుక 20 ప్రయత్నాలు  
ఆత్మహత్య రిస్క్‌ వైద్యుల్లోనే ఎక్కువ. ఏటా దేశంలో లక్ష మంది వైద్యుల్లో 40మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి ఆత్మహత్య వెనుక సగటున 20 ప్రయత్నాలు ఉంటున్నాయి.    
– డాక్టర్‌ కిరణ్‌ మాదల, జాతీయ కార్యవర్గ సభ్యుడు, ప్రభుత్వ వైద్య సంఘాల సమాఖ్య

ఒత్తిడి, నిరాశతోనే..  
ఎంబీబీఎస్‌ తర్వాత పీజీలో తామనుకున్న స్పెషలైజేషన్‌లో సీటు రాకపోవడంతో చాలామంది వైద్య విద్యార్థులు డిప్రెషన్లోకి పోతున్నారు. ఆ సీట్లు రాకపోవడంతో ఒత్తిడికి గురవుతున్నారు.  
– డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ హెల్త్‌ వర్సిటీ 

ఎంబీబీఎస్‌తో బతకలేరు 
ఈ రోజుల్లో ఎంబీబీఎస్‌తో బయట బతికే పరిస్థితి లేదు. తప్పనిసరిగా పీజీ చదివితేనే భవిష్యత్తు ఉంది. అయితే ఎంబీబీఎస్‌ సీట్లు ఎక్కువ ఉన్నా, పీజీ సీట్లు ఆ మేరకు లేవు. దీంతో చాలామంది వైద్య నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ఇలాంటి కారణాలతోనే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.    
– డాక్టర్‌ కార్తీక్‌ నాగుల, రాష్ట్ర అధ్యక్షుడు, జూడాల సంఘం  

>
మరిన్ని వార్తలు