కేసులు పెరుగుతున్నాయ్‌.. జాగ్రత్త!

7 Aug, 2022 02:21 IST|Sakshi

కరోనాపై రాష్ట్రానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరిక

కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షలు మరింత పెంచాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కోవిడ్‌–19 కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండి కట్టడి చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. గత పక్షం రోజుల్లో కేసుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ముందు జాగ్రత్తచర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీకి లేఖ ద్వారా పలు సూచనలు చేశారు. పక్షం రోజులుగా రాష్ట్రంలో కొత్తగా పెరుగుతున్న కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 5.7 శాతంగా ఉన్నాయని పేర్కొ­న్నారు. గతవారం రాష్ట్రంలో పాజిటివ్‌ రేటు 5.67 శాతం నుంచి 7.34 శాతానికి చేరిందని తెలిపారు.

రాష్ట్రంలో 12 జిల్లాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు వారం రోజులుగా తగ్గగా, అదే సమయంలో నాలుగు జిల్లాల్లో కేసులు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. రానున్న పండుగలు, పర్వది­నాల్లో భారీగా ప్రజలు గుమిగూడే అవకాశా­లున్నందున ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షలు మరింత పెంచాలని, ఆర్టీపీసీఆర్‌తోపాటు యాంటీజెన్‌ పరీక్షల సంఖ్య రెట్టింపు చేయాల­న్నారు.

కరోనా కేసులు ఎక్కువ నమోద­వుతున్న జిల్లాలపై దృష్టి పెట్టి వైరస్‌ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకో­వాలని సూచించారు. విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించి జీనోమ్‌ సీక్వెన్స్‌ నిర్వహించాలని, 18 ఏళ్ల వయసు దాటిన వారందరికీ ప్రికాషన్‌ డోసు అందించాలని, ప్రజలు కోవిడ్‌–19 నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కేసులు పెరుగుతున్న జిల్లాలివే..
హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మేడ్చ­ల్‌ జిల్లాల్లో 15 రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. 1.17 శాతం నుంచి 1.61 శాతం వరకు పెరుగుదల నమోదవుతోందని, ఈ మేరకు ఈ జిల్లాల్లో మరింత దృష్టి పెట్టి కేసుల సంఖ్య తగ్గేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. మరో 12 జిల్లాల్లో నిర్ధారణ పరీక్షలను పెంచాలని పేర్కొంది.   

మరిన్ని వార్తలు