తెలంగాణ, ఏపీ అధికారులతో కేంద్ర హోంశాఖ కీలకభేటీ

12 Jan, 2022 03:42 IST|Sakshi

9, 10 షెడ్యూల్‌ సంస్థల విభజన... పన్ను, విద్యుత్‌ బకాయిలపై చర్చ

తెలంగాణ, ఏపీ అధికారులతో కేంద్ర హోంశాఖ సమావేశం

నగదు, బ్యాంకు డిపాజిట్ల పంపిణీ గురించి కూడా...

ఏడేళ్ల నుంచి పరిష్కారానికి నోచుకోని కొన్ని అంశాల్లో స్పష్టత వచ్చే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ ఆ«ధ్వర్యంలో నేడు రాష్ట్ర విభజన సమస్యలపై జరిగే కీలకభేటీలో ముందడుగు పడే అవకాశముంది. తెలంగాణ, ఏపీ ఉన్నతాధికారులు సమావేశమై పెండింగ్‌ అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు జరిగే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులకు ఇప్పటికే హోంశాఖ సమాచారమిచ్చింది. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లవుతున్నా పరిష్కారంకాని, ఇరు రాష్ట్రాల నడుమ భిన్నాభిప్రాయాలున్న ఒకట్రెండు అంశాల్లో ఈ సమావేశంలో స్పష్టత వస్తుందని తెలంగాణ భావిస్తోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో సమర్పించేందుకుగాను ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంలేని సమస్యల గురించి తెలంగాణ నివేదికలను సిద్ధం చేసింది.  

విభజన.. బకాయిలే ప్రధాన ఎజెండా 
విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. ఏపీ ఉన్నత విద్యామండలి, తెలుగు అకాడమీ, విజయ డెయిరీ లాంటి సంస్థల విషయంలో ఇరు రాష్ట్రాలు వాదనలను వినిపించనున్నాయి. ముఖ్యంగా సింగరేణి కార్పొరేషన్, దీనికి అనుబంధంగా ఉన్న ఏపీ హెవీ మిషనరీ అండ్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌(ఆప్మెల్‌)ల విభజన అంశం ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఎక్కడి కంపెనీలు ఆ రాష్ట్రానికే చెందుతాయని అటార్నీ జనరల్‌ న్యాయ సలహా ఇచ్చిన నేపథ్యంలో దీనిపై హోంశాఖ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశముందని అధికారులంటున్నారు.

షీలాబీడే కమిటీ సిఫారసులపై తెలంగాణ, ఏపీ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ డిస్కంల నుంచి తమకు రూ.7,500 కోట్లు వస్తాయని ఏపీ అంటుండగా, దీనిపై ఏపీ ప్రభుత్వం నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో వేసిన కేసును ఉపసంహరించుకుంటే వివాదాన్ని పరిష్కరించుకునేందుకు సిద్ధమని తెలంగాణ చెబుతోంది. ఏపీ నుంచి రావాల్సిన బకాయిలపై కూడా తెలంగాణ అధికారులు హోంశాఖకు నివేదిక ఇవ్వనున్నారు. ఏపీ రాష్ట్ర ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ విభజన, నగదు, బ్యాంకు డిపాజిట్ల పంపిణీ, జనాభా దామాషా ప్రాతిపదికన పన్ను బకాయిల పంపకాలపై ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించనున్నాయి. తెలంగాణకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ విభజన చట్టానికి అనుగుణంగా అన్ని అంశాలను సామరస్యంగా పరిష్కరిం చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర హోంశాఖ ఎదుట వాదనలను సమర్థవంతంగా వినిపిస్తామని, చాలా వరకు అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.    

మరిన్ని వార్తలు