సగానికి అటు ఇటుగా..!

24 Jan, 2022 05:16 IST|Sakshi

కేంద్రం నుంచి భారీగా తగ్గిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులు 

ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో ఇచ్చింది రూ.5,687 కోట్లే.. 

గత ఏడాది ఈ సమయానికి రూ.10 వేల కోట్ల సాయం

ఈసారి రూ.38 వేల కోట్లకుపైగా వస్తాయని రాష్ట్రం అంచనా 

నిధుల సర్దుబాటుపై  ఆర్థిక శాఖ మల్లగుల్లాలు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులు భారీగా తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆశలపై నీళ్లు చల్లినట్లుగా నిధుల విడుదల ఉందని గణాంకాలు చెబుతున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం రూ. 38,669.46 కోట్లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దు కింద వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించగా, అందులో కేవలం 14.71 శాతం అంటే రూ. 5,687.79 కోట్లు మాత్రమే నవంబర్‌ నాటికి విడుదలయ్యాయి.

గత ఏడాది ఇదే సమయానికి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దు కింద రూ. 9,786.86 కోట్లు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే సగానికి అటు ఇటుగా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సాయం వచ్చినట్లు లెక్క. అయితే, ఆ మేరకు ఏర్పడిన లోటును ఎలా పూడ్చాలనేదానిపై ఆర్థికశాఖ మల్లగుల్లాలు పడుతోంది. ఆశించిన దానిలో మూడోవంతు కూడా ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని పేర్కొంటోంది. కనీసం రూ.20 వేల కోట్ల నుంచి 25 వేల కోట్ల వరకు లోటు కేవలం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దు కిందనే ఏర్పడనుందని, అంతమేరకు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిధులు సమీకరించడం చాలా కష్టమవుతుందని ఆ శాఖ అధికారులు అంటున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల రాబడులను వీలున్నంతవరకు పెంచుతున్నప్పటికీ తొలి ఎనిమిది నెలల్లో కేవలం 47 శాతం మేర మాత్రమే వార్షిక బడ్జెట్‌ అంచనాలు వాస్తవరూపం దాల్చాయి. మొత్తం రూ. 2.21 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదనల్లో నవంబర్‌ నాటికి కేవలం రూ.1.05 లక్షల కోట్లు మాత్రమే సమకూరాయి. ఈ నేపథ్యంలో చివరి నాలుగు నెలల్లో రూ.1.15 లక్షల కోట్ల సమీకరణ ఎలా సాధ్యమన్నది ఆర్థికశాఖ వర్గాలకు కూడా అంతుపట్టకపోవడం గమనార్హం. ఈసారి కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, రాష్ట్ర పన్నుల్లో వాటాలు భారీగానే రావాలని, చివరి నాలుగు నెలల్లో ఈ రెండు పద్దుల కింద కనీసం రూ.30 వేల కోట్లు వస్తేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత సజావుగా సాగుతుందని, లేదంటే నిధులకు కటకటేననే చర్చ ఆ శాఖ వర్గాల్లో జరుగుతోంది.

మరిన్ని వార్తలు